హ్యారీ బ్రూక్, కెప్టెన్ ఏడెన్ మార్ క్రమ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో హైదరాబాద్ సన్ రైజర్స్ 23 పరుగుల తేడాతో కోల్ కతా నైట్ రైడర్స్పై విజయం సాధించింది. హైదరాబాద్ ఇచ్చిన 229 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కోల్ కతా విజయం కోసం చివరి వరకూ పోరాడి ఓటమి పాలైంది. హైదరాబాద్ ఓపెనర్ హ్యారీ బ్రూక్ 55 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 100 పరుగులు చేసి నాటౌట్ గా నిలవగా, ఏడెన్ 26 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 50; అభిషేక్ శర్మ 17 బంతుల్లో 3ఫోర్లు, 2 సిక్సర్లతో 32పరుగులు చేశారు, హెన్రిక్ క్లాసేన్ 6 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ తో 16 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచారు.
ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్ కతా బౌలింగ్ ఎంచుకుంది, 46 పరుగుల వద్ద హైదరాబాద్ తొలి వికెట్ (మయాంక్ అగర్వాల్-9) కోల్పోయింది, 57 వద్ద రాహుల్ త్రిపాఠి (9) వెనుదిరిగాడు. ఈ దశలో బ్రూక్, మార్ క్రమ్ లు చెలరేగి ఆడారు. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఈ సీజన్ లో ఇదే హయ్యస్ట్ స్కోరు కాగా, తొలి సెంచరీ కూడా హైదరాబాద్ ప్లేయర్ బ్రూక్ నేడు నమోదు చేయడం గమనార్హం. కోల్ కతా బౌలర్లలో ఆండ్రీ రస్సెల్ మూడు, వరుణ్ చక్రవర్తి ఒక వికెట్ పడగొట్టారు.
కోల్ కతా 20 పరుగులకే మూడు కీలక వికెట్లు (రహమతుల్లా గుర్బాజ్ డకౌట్, వెంకటేష్ అయ్యర్-10; సునీల్ నరైన్ డకౌట్) కోల్పోయింది. ఈ దశలో జగదీషన్ నారాయణ్ – కెప్టెన్ నితీష్ రానా నాలుగో వికెట్ (జగదీషన్-36) కు 62 పరుగులు సాధించారు. ఆండ్రీ రస్సెల్ (3)మరోసారి నిరాశ పరిచాడు. తర్వాత నితీష్- రింకూ సింగ్ లు ఫోర్లు, సిక్సర్లతో మ్యాచ్ ను మలుపు తిప్పారు. జట్టు స్కోరు 165 పరుగుల వద్ద 17 వ ఓవర్లో నితీష్ రానా (41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 75) ఔటయ్యాడు. శార్దూల్ ఠాకూర్ (12) కూడా వెనుదిరిగాడు. రింకూ 31బంతుల్లో 4ఫోర్లు, 4సిక్సర్లతో 58 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేయగలిగింది.
హైదరాబాద్ బౌలర్లలో మార్కో జాన్సెన్, మయాంక మార్కండే చెరో రెండు; భువి, నటరాజన్, ఉమ్రాన్ తలా ఒక వికెట్ సాధించారు.
సెంచరీ సాధించిన హ్యారీ బ్రూక్ కే ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.