Friday, July 5, 2024
HomeTrending Newsహాత్రాస్ తొక్కిసలాటలో రాజకీయ కోణం.. భోలే బాబా లా పథా

హాత్రాస్ తొక్కిసలాటలో రాజకీయ కోణం.. భోలే బాబా లా పథా

ఉత్తరప్రదేశ్ లోని హాథ్రాస్‌ తొక్కిసలాట, భోలే బాబా వ్యవహారంలో నిజానిజాలు వెలికితీసేందుకు సిబిఐతో విచారణ జరిపించాలని అలహాబాద్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. న్యాయవాది గౌరవ్ ద్వివేది ఈ పిటిషన్ దాఖలు చేశారు. అటు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో మరో పిటిషన్ దాఖలైంది. పదవి విరమణ చేసిన న్యాయమూర్తి ఆధ్వర్యంలో నిపుణుల కమిటీతో సమగ్ర విచారణ జరిపించాలని పిటిషన్ దాఖలైంది.

భోలే బాబా జాతవ్ కులానికి చెందినవారు. జాతవ్ సామాజికవర్గం యుపిలో అధికంగా ఉంటుంది. BSP అధినేత్రి మాయావతి కూడా ఈ సామాజిక వర్గానికి చెందిన వారే కావటం గమనార్హం. భోలే బాబా SC,ST, BC సామాజిక వర్గాల్లో ప్రాబల్యం కలిగి ఉన్నారు. అతని అనుచరులలో ముస్లింలు కూడా ఉన్నారు

తొక్కిసలాటలో మరణించిన వారి సంఖ్య 121 చేరింది.  భోలే బాబా స‌త్సంగ్‌ విషాదంలో మహిళలు, చిన్నారులను మృత్యువు కబళించింది. ప్ర‌స్తుతం బాబా(సౌరబ్ కుమార్) ఆచూకీ చిక్క‌డం లేదు. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 3.30 నిమిషాల‌కు .. పూల్ రాయ్ గ్రామంలోని స‌త్సంగ్ ప్రాంగ‌ణం వ‌ద్ద తొక్కిస‌లాట జ‌రిగింది. ఆ ఘ‌ట‌న త‌ర్వాత భోలే బాబా ఆన‌వాళ్లు దొర‌క‌డం లేదు. ఆయ‌న ప‌రారీలో ఉన్న‌ట్లు పోలీసులు భావిస్తున్నారు. బాబా కోసం వెతుకులాట ప్రారంభించారు.

మెయిన్‌పురి జిల్లాలోని భోలే బాబాకు చెందిన రామ్ కుటీర్ ఛారిట‌బుల్ ట్ర‌స్టులో పోలీసులు సోదాలు చేశారు. అక్క‌డ ఆయ‌న ఆచూకీ చిక్క‌లేదు. ఎక్క‌డికి వెళ్లాడో తెలియ‌దు. ఆయ‌న కోసం పోలీసులు వెతుకుతున్నారు.

ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మానికి సుమారు రెండున్న‌ర ల‌క్ష‌ల మంది హాజ‌రైన‌ట్లు తెలుస్తోంది. నిజానికి 80 వేల మంది వ‌ర‌కే ప‌ర్మిష‌న్ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ విషయం చెపుతున్న అధికారులు ఆ స్థాయిలో భద్రత కల్పించలేదు. కేవ‌లం 40 మంది పోలీసులు మాత్ర‌మే ర‌క్ష‌ణ విధుల్లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో సత్సంగ్ సంఘాల ప్రభావం అధికంగా ఉంటుంది. ఆయా రాష్ట్రాల్లో కులాల వారిగా, ప్రాంతాల వారిగా సత్సంగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆధ్యాత్మిక ప్రబోధాలు చేసే ఈ సంఘాలు రాజకీయ పలుకుబడి కలిగి ఉంటాయి. ఎన్నికల సమయంలో బాబాలను ప్రసన్నం చేసుకునేందుకు ఉత్తరాదిలోని అన్ని రాజకీయ పార్టీలు పోటీ పడుతుంటాయి.

అన్ని రకాల అనుమతులు తీసుకున్నా… హత్రాస్ సత్సంగ్ కు అధికార వర్గాలు సరైన రీతిలో భద్రత కల్పించలేదని ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బాబా అనుచరులు సమాజ్ వాది పార్టీకి మద్దతు ఇచ్చారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో BSP రాజకీయంగా ఏకాకి కావటంతో బాబా వర్గం ముఖ్యులు సమాజ్ వాది పార్టీకి అండగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపి భోలే బాబా టార్గెట్ గా కఠిన చర్యలకు ఉపక్రమిస్తోందని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ అంశం రాజకీయ రంగు పులుముకునేందుకు ఎంతో సమయం పట్టదు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్