Thursday, September 19, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంతమిళనాడులో భర్త స్వేచ్ఛకు భార్య బాండ్ పేపర్

తమిళనాడులో భర్త స్వేచ్ఛకు భార్య బాండ్ పేపర్

చైనా, రష్యాలకు పెద్ద చిక్కొచ్చి పడింది. యువకులు పెళ్లికి దూరం కావడంతో జననాల రేటు తగ్గుతోంది. ముసలివారి నిష్పత్తి క్రమంగా పెరుగుతోంది. బహుశా అందుకేనేమో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల పద్దులో మొదటి స్థానంలో అప్రతిహతంగా చాలా కాలంపాటు ఉన్న చైనాను రెండో స్థానంలోకి లాగి పడేసి…వారి మొదటి స్థానాన్ని మనం ఆక్రమించగలిగాం. వారి నిరాసక్తతే తప్ప కనీసం ఇందులో కూడా మన ప్రతిభ ఏమీ లేకపోవడం సిగ్గుపడాల్సిన విషయమే.

ఇంతకూ చైనా, రష్యాల్లో పెళ్లి అంటే యువకులు ఎందుకు భయపడుతున్నారంటే-

  • చైనాలో ఆర్థిక సంక్షోభం. నిరుద్యోగం. ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యా యువకులను బలవంతంగా యుద్ధంలోకి దించడం.
  • పెళ్లయ్యాక ఆచారాలు, కట్టుబాట్లు అమ్మాయిలకు నచ్చడం లేదు.
  • పెళ్లయితే ఉద్యోగాలు చేసుకోనివ్వరని అమ్మాయిలు భయపడుతున్నారు.
  • అర కొర జీతాలతో భార్య, పిల్లలను పోషించడం కష్టమని అబ్బాయిలు భయపడుతున్నారు.
  • ఆధునిక అమ్మాయిలను భరించడం కంటే శాశ్వతంగా పెళ్లికాని/పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని ప్రసాదుల్లా మిగిలిపోవడమే ఉత్తమం అని అబ్బాయిలు అనుకుంటున్నారు.

ఇదే ధోరణి కొనసాగితే తమ దేశం ఏదో ఒకనాటికి నిర్జన దేశమవుతుందని చైనా, రష్యా ప్రభుత్వాధినేతల్లో వణుకు మొదలయ్యింది. దాంతో “త్వరగా పెళ్లి చేసుకోండి ; ఇబ్బడి ముబ్బడిగా పిల్లల్ని కనండి” అని యువకులను ప్రభుత్వాలు వేడుకుంటున్నాయి. త్వరగా పెళ్లి చేసుకున్నా, వెంటనే పిల్లల్ని కన్నా ప్రత్యేక ప్రోత్సాహాకాలు ఇస్తోంది చైనా. ఉద్యోగావకాశాల్లో పెళ్లయినవారికి ప్రాధాన్యమిస్తోంది. కొత్తవారు రాక, ఉన్న వయో వృద్ధ ప్రభుత్వోద్యోగులు రిటైరైతే ఇబ్బంది అని పదవీ విరమణ వయసును పెంచింది. పెళ్లి- పిల్లల అవసరం మీద పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టింది.

తొలి కాన్పుకు రష్యా దాదాపు పది లక్షల రూపాయల నజరానా ఇస్తోంది. “లంచ్ బ్రేక్ లో, కాఫీ బ్రేక్ లో ప్రేమించుకోండి. శారీరకంగా కలవండి. పిల్లల్ని కనండి” అని రష్యా అధ్యక్షుడు పుతిన్ రష్యా యువకులను వేడుకుంటున్నారు. తన మాట ఒక్కటే సరిపోదని మత పెద్దలతో, యువకులు ఆరాధించే సెలెబ్రిటీలతో కూడా ప్రేమ- పెళ్లి- పిల్లల్ని కనాల్సిన అవసరం గురించి ప్రచారం చేయిస్తున్నారు.

చైనాలో అంతే…రష్యాలో అంతే! అని నవ్వుకునేరు. మనదగ్గర ఇలా కాదులే! అని నిష్పూచీగా ఉండేరు. భారతదేశంలో కూడా చదువుకున్న, ఆధునిక భావాలున్న యువకులు పెళ్లి అంటే ఇలాగే ఆలోచిస్తున్నారు. ఎంత అభ్యుదయ భావాలున్నవారైనా పెళ్లయ్యాక మారిపోతారని యువకుల పరిశీలన. పెళ్లయితే ఉన్నత చదువులు, మెరుగైన ఉద్యోగావకాశాలు, ఆధునిక జీవనపు అలవాట్లు, వేషం విషయాల్లో స్వేచ్ఛ పోతుందని పెళ్లి వద్దనుకుంటున్న అమ్మాయిల సంఖ్య భారత్ లో కూడా క్రమంగా పెరుగుతోంది.

అమ్మాయిలకే కాదు. ఈకాలం అబ్బాయిలకు కూడా పెళ్లయ్యాక భార్యవల్ల స్వేచ్ఛ పోతుందన్న భయం పెరుగుతోంది. అందుకే తమిళనాడులో దయగల ఒక పెళ్లి కూతురు తాళి కట్టించుకున్న వెంటనే… తలంబ్రాలు చల్లిన పసుపు చేతులతోనే బాండు పేపర్ మీద భర్త స్వేచ్ఛను హరించబోనని ఒప్పుకుంటూ సంతకం చేసి ఇచ్చింది. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ తో పాటు…భర్త స్వేచ్ఛకు అడ్డు రానన్న ఈ ఒప్పంద పత్రాన్ని కూడా స్థానిక రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్టర్ చేయించారు.

దీనిమీద మనదగ్గర కూడా చాలా చర్చ జరగాలి. చాలా మార్పులు రావాలి. ప్రత్యేకించి అబ్బాయిలు, అబ్బాయిల తల్లిదండ్రులు మారకపోతే…మన కథ కూడా చైనా-రష్యా కథే అవుతుంది! అప్పుడు మొదట పెళ్లికాని భారతం ఆవిష్కృతమవుతుంది. చివర జనరహిత భారతం మిగులుతుంది!

అప్పుడు-
“దేశమంటే మట్టి కాదోయ్!
మనుషులోయ్!”
అన్న గురజాడ మాటను మార్చి…
“దేశమంటే మనుషులు కాదోయ్!
ఒట్టి మట్టేనోయ్!”
అని పాడుకోవాలి!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్