Thursday, April 25, 2024
HomeTrending Newsకేంద్రం విద్యుత్ బిల్లుపై అసెంబ్లీలో వాడివేడి చర్చ

కేంద్రం విద్యుత్ బిల్లుపై అసెంబ్లీలో వాడివేడి చర్చ

అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. ఇవాళ రెండో రోజు జరిగిన సమావేశాల్లో ప్రభుత్వం ఏడు సవరణ బిల్లులను ప్రవేశపెట్టింది. ఐదు రోజుల విరామం అనంతరం శాసన సభ సమావేశాలు తిరిగి ఇవాళ ప్రారంభం అయ్యాయి. ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే భూపతి రావు మృతి పట్ల అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. రెండో రోజు అసెంబ్లీ, మండలి.. సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయాన్ని సస్పెండ్ చేశారు. మంత్రులు ఏడు చట్ట సవరణ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లును మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రవేశపట్టారు. అజామాబాద్‌ ఇండస్ట్రియల్‌ ఏరియా చట్ట సవరణ, తెలంగాణ మున్సిపల్ చట్ట సవరణ బిల్లును మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టారు. యూనివర్సిటీ ఆఫ్ ఫారెస్ట్ బిల్లును మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రవేశపెట్టగా… తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్ మెంట్ బిల్లును విద్యా శాఖ మంత్రి సబిత పెట్టారు. అలాగే తెలంగాణ మోటార్ వెహికిల్స్ టాక్సేషన్ బిల్లును ట్రాన్స్ పోర్ట్ మంత్రి పువ్వాడ అజయ్ ప్రవేశపెట్టగా… వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించిన సవరణ బిల్లును ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రవేశ పెట్టారు.

అనంతరం కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ బిల్లుపై చర్చ జరిగింది. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కేంద్రంపై నిప్పులు చెరిగారు. కేంద్రంలోని బీజేపీకి పోగాలం దాపురించిందని సీఎం కేసీఆర్ విమర్శించారు. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడిన కేసీఆర్… కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వ్యవసాయం, విద్యుత్ రంగాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. సంస్కరణల పేరుతో షావుకార్లకు దోచి పెట్టడానికి మోడీ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అన్ని వస్తువులపై ధరలు పెంచుతూ ప్రజలు, రైతుల నడ్డి విరుస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యుత్ బిల్లుపై టీఆర్ఎస్ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ప్రతి పక్షాలను మాట్లాడకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ… కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ బిల్లు ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా ఉందని విమర్శించారు.

Also Read: మొక్కుబడిగా అసెంబ్లీ సమావేశాలు;ఈటెల విమర్శ

RELATED ARTICLES

Most Popular

న్యూస్