Thursday, November 21, 2024
HomeTrending Newsకాశ్మీర్ నుంచి అస్సాం వరకు కుండపోత వానలు

కాశ్మీర్ నుంచి అస్సాం వరకు కుండపోత వానలు

దేశవ్యాప్తంగా ఉత్తరాది నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు కుండపోత వానలు హడాలెత్తిస్తున్నాయి. అస్సాంలో బ్రహ్మపుత్ర నది బీభత్సం సృష్టిస్తోంది. ఎడతెరిపి లేని వానలతో కొన్ని రోజులుగా అస్సాంలోని నదీ పరివాహక ప్రాంతాలు జలమయమయ్యాయి. కుండపోత వానలకు వందల గ్రామాలు నీట మునిగాయి. రహదారులు, సమాచార వ్యవస్థ దెబ్బతిన్నది. అన్ని నదులు ప్రమాదకరస్థాయి మించి ప్రవహిస్తున్నాయి. రాష్ట్రాన్ని ముంచెత్తిన వరదలు మానవులతో పాటు జంతువులను ప్రభావితం చేశాయి. వరదలతో కజిరంగ జాతీయ పార్కులోకి వరద నీరు చేరింది. దీంతో సుమారు 131 వన్యప్రాణులు మృత్యువాత పడ్డాయి.

అధికారిక వివరాల ప్రకారం.. ఆరు ఖడ్గమృగాలు, 117 జింకలు (ఇందులో 98 నీట మునిగి ప్రాణాలు కోల్పోగా.. రెండు జింకలు వాహనాలు ఢీకొట్టి చనిపోయాయి. మరో 17 జింకలు చికిత్స చేస్తుండగా ప్రాణాలు కోల్పోయాయి), రెండు సాంబార్‌, ఒక ఒట్టర్‌ సహా మొత్తం 131 వన్య ప్రాణాలు మృత్యువాత పడ్డాయి. మరికొన్ని హాగ్‌ జింకలు, రెండు ఖడ్గమృగాలు, సాంబార్‌ జింకలు, స్కాప్స్‌ గుడ్లగూబలు, చిత్తడి జింకలు, కుందేలు, ఒట్టర్‌, ఏనుగు సహా 97 జంతువులను అధికారులు రక్షించారు. ప్రస్తుతం 25 జంతువులు వైద్యుల సంరక్షణలో ఉండగా.. మరో 52 జంతువులను చికిత్స తర్వాత సురక్షిత ప్రాంతంలో వదిలారు.

వరదలతో 24 లక్షల మంది నిర్వాసితులయ్యారు. గోల్‌పరా, నాగావ్, నల్బరీ, కామరూప్, మోరిగావ్, దిబ్రూఘఢ్‌, సోనిత్‌పూర్, లఖింపూర్, సౌత్ సల్మారా, ధుబ్రి, జోర్హాట్, చారైడియో, హోజై, కరీంగంజ్, శివసాగర్, బొంగైగావ్, బార్‌పేట, ధేమాజీ, హైలాకండి, గోలాఘాట్, దర్రాంగ్, బిస్వనాథ్, కాచర్, తిన్ సుకియా, కర్బీ అంగ్లాంగ్, చిరాంగ్, కర్బీ అంగ్లాంగ్ వెస్ట్, మజులి జిల్లాలు వరదలతో ప్రభావితమయ్యాయి. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

మరోవైపు జమ్మూ కశ్మీర్‌లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ రోజు (సోమవారం) ఉదయం పనార్‌ వంతెన చండిమార్‌ సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ముందు జాగ్రత్త చర్యగా జమ్మూలోని రాజౌరి – పూంచ్‌ జిల్లాలను కశ్మీర్‌ లోయతో కలిపే మొఘల్‌ రహదారిని మూసివేశారు.

బిహార్‌లో పిడుగుపాటుకు గడిచిన 24 గంటల్లో 12 మంది మరణించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్టు బిహార్‌ సీఎం కార్యాలయం వెల్లడించింది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో కుండపోతతో నగర వీధులన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాలతో ముంబైలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దాదర్‌ లో రోడ్లతో పాటు రైలు పట్టాలు ముంపునకు గురయ్యాయి. కార్లు రోడ్లపై నీటిలో తేలియాడుతున్నాయి.

ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం మధ్యాహ్నం 2.22 నుంచి 3.40 గంటల వరకు రన్‌వే కార్యకలాపాలను నిలిపివేసింది. 50కి పైగా విమానాలు రద్దు చేసి అహ్మదాబాద్‌, హైదరాబాద్‌, ఇండోర్‌కు మళ్లించారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్