భారీ వర్షాలు పాకిస్తాన్ ను అక్కడి ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలకు ఇప్పటికే అక్కడ 147 మంది ప్రాణాలు కోల్పోగా.. 163 మంది గాయపడినట్లు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఫోర్స్ ప్రకటించింది. పోర్ట్ సిటీ కరాచీలో పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాయి. నగరం వరదలకు అల్లాడుతోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 1000కి పైగా ఇళ్లు డ్యామేజ్ అయ్యాయి. రాజధాని ఇస్లామాబాద్ లో కూడా ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. భారీ వర్షాలకు వాతావరణ మార్పులే కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. కరాచీ నగరం వరదల ధాటికి చిన్నాభిన్నం అయింది. మురుగునీటి వ్యవస్థ సరిగా లేకపోవటంతో వర్షపు నీరు ఎక్కడికక్కడే నిలిచి పోయింది. దీంతో కరాచీ నగరం సముద్రాన్ని తలపిస్తోంది. నగరంలో సంపన్నులు ఉండే అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక సామాన్యుల కాలనీలు పట్టించుకునే నాథుడే లేడు.
బలూచిస్తాన్ ప్రావిన్షియల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (PDMA) అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. ప్రాణనష్టంతో పాటు వరదలు, భారీ వర్షాల వల్ల ప్రావిన్స్‌లో 50 మందికి పైగా గాయపడ్డారని చెప్పారు. కుండపోత వర్షాల కారణంగా ఏర్పడిన ఆకస్మిక వరదల వల్ల ప్రావిన్స్‌లోని వివిధ ప్రాంతాలలో చెక్ డ్యామ్‌లు, వంతెనలు కొట్టుకుపోయాయి. ఆఫ్ఘన్ సరిహద్దుకు సమీపంలోని కడాని డ్యామ్ విరిగిపడుతుందనే భయం నెలకొంది. కాగా.. జూలై 18-19 వరకు తట్టా, బాడిన్, హైదరాబాద్, టాండో ముహమ్మద్ ఖాన్, ఉమర్‌కోట్, మిర్‌పుర్‌ఖాస్‌తో పాటు కరాచీతో పాటు సింధ్‌లోని ఇతర ప్రాంతాలలో భారీ వర్షాలు, ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
అయితే పాకిస్థాన్ కు వర్షకాలం వరదలు కొత్తేం కాదు. ప్రతీ ఏడాది పాకిస్తాన్ ఈ వార్షిక రుతు పవనాలు వచ్చే సమయంలో ఇలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయి. ఈ వరదలను అరికట్టడానికి ప్రభుత్వం దగ్గర సరైన ప్లానింగ్ చేయడం లేదని విమర్శలు ఉన్నాయి. సింద్, బలూచిస్తాన్ రాష్ట్రాలను మొదటి నుంచి పాకిస్తాన్ ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదనే అపవాదు ఉంది.