నైరుతి రుతుపవనాల రాకతోనే కేరళలో కుండపోత వర్షాలు మొదలయ్యాయి. ఉత్తర భారతదేశం వడగాలులకు అల్లాడిపోతుండగా.. రెండు రోజులుగా కేరళలో ఎడతెరిపి లేని వర్షాలు పడుతున్నాయి. తిరువనంతపురం, కొచ్చి, త్రిస్సూర్, కోజికోడ్, ఎర్నాకులం, పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఇడుక్కి, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, వయనాడ్ సహా పలు ప్రధాన నగరాలు పూర్తిగా జలమయమయ్యాయి.
కేరళ వ్యాప్తంగా భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఏడు జిల్లాలకు శనివారం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తిరువనంతపురం, కొల్లాం, అలప్పుజా, ఎర్నాకులం, కోజికోడ్, కన్నూర్, కాసర్‌గోడ్ జిల్లాలకు ఐఎండీ ఎల్లో హెచ్చరికలు ఇచ్చింది. ఆయా జిల్లాల్లో 6 సెంటీమీటర్ల నుంచి 11 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
కేరళ నుంచి బయలు దేరే విమానాలు, రైళ్ళు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఉదయం 9 గంటలకు వెళ్ళాల్సిన రైళ్ళు, విమానాలు మధ్యాహ్నం ఒంటి గంట దాటినా బయటకు వచ్చే పరిస్థితి కనిపించటం లేదు. మరో 24 గంటలు ఎడతెరిపి లేని వానలతో రవాణా వ్యవస్థ స్థంభించింది.
భారీ వర్షం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 11 మరణాలు నమోదయ్యాయి. 11 మందిలో ఆరుగురు నీటిలో గల్లంతై మరణించగా.. క్వారీ ప్రమాదంలో ఇద్దరు, పిడుగుబాటుకు ఇద్దరు, ఇల్లు కూలి ఒకరు మరణించినట్లు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. నీటి ప్రవాహాలు, తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.
మరొవైపు ఉత్తరాదిలో సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. రాజస్థాన్‌లోని బార్మర్‌లో 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాదిలో దేశంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదేనని ఐఎండీ చెప్పింది. రాజస్థాన్‌లోని బార్మర్లో గరిష్ట ఉష్ణోగ్రత 48.8° సెల్సియస్ గా నమోదైనట్లు తెలిపింది. ఎండల తీవ్రతకు దాదాపు 8మంది చనిపోయారని అధికారులు తెలిపారు. ఎండలో ఇబ్బందులు పడుతున్న వాహనదారులకు ఉపశమనం కల్పించేందుకు అధికారులు జంక్షన్లలో గ్రీన్ మెష్ షెడ్ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సిగ్నల్స్ పడినప్పుడు గ్రీన్ మెష్ నీడ వాహనదారులకు ఎండ నుంచి ఒకింత ఉపశమనం దొరుకుతోంది. కొన్నిచోట్ల రోడ్లపై నీళ్లు చల్లుతున్నారు.
వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో నాలుగు రోజుల పాటు వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్రలలో ఎండల తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాజస్థాన్, గుజరాత్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో రానున్న ఐదురోజుల పాటు ఉష్ణోగ్రతలు 44డిగ్రీల కంటే ఎక్కువగానే నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
-దేశవేని భాస్కర్