జమ్ముకశ్మీర్ రాష్ట్రంలో ఎడతెరిపి లేని స్నోఫాల్ తో జనజీవనానికి ఆటంకం ఏర్పడుతోంది. పొగమంచు కమ్ముకోవటంతో శ్రీనగర్ విమానాశ్రయంలో విమానాలు రద్దవుతున్నాయి. చాల విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. రాష్ట్రంలోని దిగువ ప్రాంతాల్లో వర్షాలు పడుతుండగా ఎగువ ప్రాంతాల్లో మంచు కమ్మేస్తోంది. రేయింబవళ్ళు పడుతున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. శ్రీనగర్ – జమ్ములను కలిపే 44వ నెంబర్ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచి పోయాయి. కొండచరియలతో పాటు మట్టిపెల్లలు పేరుకుపోయి వాహనాల రాకపోకలకు అనువుగా లేకపోవటంతో జమ్ము- శ్రీనగర్ రహదారితో పాటు మొఘల్ రోడ్డు, ఎస్.ఎస్,జి రోడ్డు, సింతాన్ రోడ్లను కూడా ముసివేస్తున్నట్టు కశ్మీర్ పోలీసులు ప్రకటించారు.
శీతాకాలం కావటంతో కాశ్మీర్ లోని పర్యాటక ప్రాంతాలకు పెద్దమొత్తంలో టూరిస్టులు చేరుకున్నారు. మంచులో ఎంజాయ్ చేసేందుకు వెళ్ళిన పర్యాటకులకు ఎడతెరిపిలేని వానలు, కొండచరియలు విరిగిపడి రోడ్లు మూతపడటం ఇబ్బందికరంగా మారింది. వివిధ రకాల సరుకులు, పర్యాటకులతో వెళుతున్న వాహనాలు పెద్దసంఖ్యలో నిలిచిపోయి ట్రాఫిక్ జాం ఏర్పడింది.
మరోవైపు వైష్ణోదేవి యాత్రకు భక్తులను ఈ రోజు నుంచి అనుమతిస్తున్నారు. ఈ మేరకు కాట్రలో పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు. ఇటీవల తొక్కిసలాట జరిగి భక్తులు చనిపోవటంతో కొద్ది రోజులు వైష్ణోదేవి మాత దర్శనం నిలిపివేశారు.
జమ్ముకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరఖండ్ రాష్ట్రాల్లో ఈ రోజు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో లోతట్టు ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను ప్రభుత్వాలు సురక్షితప్రాంతాలకు తరలించారు.
Also Read : వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట