Saturday, January 18, 2025
HomeTrending Newsవర్షాలతో గుజరాత్ లో రైళ్ళు రద్దు..ముంబైకి ఆరంజ్ అలర్ట్

వర్షాలతో గుజరాత్ లో రైళ్ళు రద్దు..ముంబైకి ఆరంజ్ అలర్ట్

దేశవ్యాప్తంగా కుండపోతగా వర్షాలు పడుతున్నాయి. జమ్ముకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక సహా దక్షిణాది రాష్ట్రాలు భారీ వర్షాలకు విలవిలలాడిపోతున్నాయి. అదే సమయంలో గుజరాత్​పై వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. వర్షాలకు అనేక ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి.

దక్షిణ, మధ్య గుజరాత్ లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. వర్షాలకు ఇప్పటివరకు 64మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 33మంది ఉరుములు పడటంతో మరణించారు. 8మంది గోడ కూలిన ఘటనలో మృతిచెందారు. 16మంది నీట మునిగి తుదిశ్వాస విడిచారు. ఆరుగురు.. చెట్లు కూలిన ఘటనలో ప్రాణాలు వీడారు. విద్యుత్ ఘాతంతో ఒకరు మరణించారు. వర్షాలతో రాజ్​కోట్​లో గత రాత్రి నగరంలోని అనేక ప్రాంతాలు నీటమునిగాయి. 24 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. డాంగ్​, నవ్సారి, వల్సాద్​, తాపి, సూరత్​లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఫలితంగా అనేక స్కూళ్లు, కళాశాలలు మూతపడ్డాయి.

వర్షాలు అహ్మదాబాద్​ను కుదిపేస్తున్నాయి. సోమవారం మూడు గంటల్లో రికార్డు స్థాయిలో 115ఎంఎంల వర్షపాతం నమోదైంది. ఆ ప్రాంతంలో ఒక్క రోజులో ఇంత వర్షం పడటం.. ఐదేళ్లల్లో ఇదే తొలిసారి. ఫలితంగా వరదలు ముంచెత్తాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడతెరిపి లేని వర్షాలతో గుజరాత్ లో అనేక రైళ్ళను రద్దు చేశారు.

అటు ఢిల్లీలో మంగళవారం ఉదయం వర్షాలు ప్రజలను పలకరించాయి. ఉరుములతో కూడిన వర్షాలతో ఢిల్లీ దద్దరిల్లింది. ఫలితంగా.. సాధారణ వర్షానికే దేశ రాజధాని రోడ్లు నీటమినిగిపోయాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముంబైలో వరుణుడి ప్రతాపం గత వారం రోజులుగా కొనసాగుతోంది. మంగళవారం సైతం ముంబైలో వర్షాలు పడుతున్నాయి. ముంబై, పరిసర ప్రాంతాలకు మూడు రోజుల పాటు ఆరెంజ్​ అలెర్ట్ ప్రకటించారు. ముంబైలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ఉత్తరాఖండ్ లో వరదలు

ఉత్తరాఖండ్​లోని డెహ్రాడూన్​, పౌరి, చంపావట్​, నైనిటాల్​, ఉధమ్​ సింగ్​ జిల్లాలకు యెల్లో అలర్ట్​ జారీ చేసింది ఐఎండీ. కేదార్​నాథ్​, హల్ద్వాని, పిథోర్​గఢ్​, డిడిహట్​, కిచ్చ ప్రాంతాల్లో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఉత్తర్​ప్రదేశ్​, హరియాణాలో మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్