High Court Dissatisfied With Enforcement Of Corona Rules :

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టుకు నివేదిక సమర్పించిన డీహెచ్ శ్రీనివాసరావు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 3.16 శాతంగా ఉందని, రాష్ట్రంలో ప్రస్తుతం రాత్రి కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధించే పరిస్థితులు లేవని వివరణ ఇచ్చారు. పాజిటివిటీ 10 శాతం దాటితే రాత్రి కర్ఫ్యూ వంటి ఆంక్షలు అవసరమని, గత వారం నుంచి ఒక్క జిల్లాలోనూ పాజిటివిటీ రేటు 10శాతం లేదని, మెదక్ లో అత్యధికంగా 6.45, కొత్తగూడెంలో అతి తక్కువగా 1.14 శాతం పాజిటివిటీ రేటు ఉందన్నారు. జీహెచ్ ఎంసీలో 4.26, మేడ్చల్ లో 4.22 శాతం పాజిటివిటీ రేటు ఉందని, ఐసీయూ, ఆక్సిజన్ పడకల ఆక్యుపెన్సీ 6.1శాతంగా ఉందని పేర్కొన్నారు.

ముందు జాగ్రత్తగా జనం గుమిగూడకుండా ఈనెల 31 వరకు ఆంక్షలు పొడిగింపు ఉంటుందని, వారం రోజులుగా రోజుకు లక్షకు పైగా కరోనా పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహిస్తోందని ఆరోగ్యశాఖ సంచాలకులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి జ్వరం సర్వే జరుగుతోందని, మూడు రోజుల్లోనే లక్షణాలున్న 1.78 లక్షల మందికి కిట్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. 18 ఏళ్ల లోపు వారికి 59 శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయిందని, 2.16 లక్షల మందికి ప్రికాషన్ డోసు పంపిణి జరిగినట్టు వెల్లడించారు.

అయితే ప్రభుత్వం తప్పుడు గణాంకాలు సమర్పిస్తోందని ఈ సందర్భంగా పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు. మూడు రోజుల్లో 1.70 లక్షల జ్వర బాధితులు వెలుగు చూడటం పరిస్థితి తీవ్రతకు నిదర్శనమన్న న్యాయవాదులు. ప్రభుత్వ కిట్ లో పిల్లల చికిత్సకు అవసరమైన మందులు లేవని న్యాయవాదుల ఆరోపణ.

ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటోదన్న ఏజీ ప్రసాద్. అయితే మాస్కులు, భౌతిక దూరం కూడా అమలు కాకపోవడం దురదృష్టకరమని హైకోర్టు వ్యాఖ్యనించింది. కోవిడ్ నిబంధనలను జీహెచ్ ఎంసీ, పోలీసులు కఠినంగా అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. పరిస్థితి వివరించేందుకు డీహెచ్ శ్రీనివాసరావు తదుపరి విచారణకు హాజరు కావాలని ఆదేశం. కరోనా కేసులపై విచారణ ఈ నెల 28కి వాయిదా వేసిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *