రాజస్థాన్ లోని థార్ ఎడారి ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గలేదు. జూన్ మొదటి వారం గడిచినా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిప్పుల కొలిమిగా ఉన్న వాతావరణంతో ప్రజలు సతమతమవుతున్నారు. మరో నాలుగు రోజులపాటు భానుడి ప్రతాపం తగ్గదని వాతావరణ శాఖ వెల్లడించింది.
అగ్నికి వాయువు తోడైనట్టు పశ్చిమ రాజస్థాన్లో వడగాలులు ఉదృతంగా వీస్తున్నాయి. జోద్ పూర్ , బికనేర్ జిల్లాల్లో వడగాలుల తీవ్రత అధికంగా ఉంది. మరో నాలుగు రోజులు పాటు ఇదే పరిస్థితి కొనసాగనుంది. భరత్ పూర్ , ధోల్పూర్, ఝుంఝును, సికార్, శ్రీగంగానగర్, హనుమాన్ ఘడ్, చురు తదితర జిల్లాల్లో వడగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించటంతో రాజస్థాన్ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నగౌర్, బికనేర్, జైసల్మేర్, బర్మేర్ జిల్లాల్లో ఇసుక తుపాన్లు ప్రజా జీవనాన్ని స్తంభింప చేస్తున్నాయి. దీంతో థార్ ఎడారి సమీప ప్రాంతాల గ్రామాలు ఇసుక ధూళితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.
గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. శ్రిగంగానగర్ జిల్లాలో అత్యధికంగా 45 డిగ్రీలు నమోదైంది. వారం రోజుల నుంచి 43 డిగ్రీలు నమోదు కాగా ఒకేసారి మరో రెండు డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగింది.
మరోవైపు రాజస్థాన్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో పశ్చిమ గాలుల ప్రభావంతో వర్షం పడింది. హర్యానా ను అనుకోని ఉన్న జిల్లాల్లో వర్ష ప్రభావం ఉంది. జైపూర్, కోట, అజ్మీర్ జిల్లాల్లో ఒకటి నుంచి రెండు సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది.