అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. గువహటి రాజ్ భవన్ లో గవర్నర్ జగదీష్ ముఖి బిశ్వతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, సినియర్ నేతలు హాజరయ్యారు. సర్బానంద్ సోనోవాల్ స్థానంలో హిమంతకు బిజెపి అవకాశం కల్పించింది.
అస్సాంలో బిజెపి అధికారాన్ని నిలబెట్టుకోవడంలో హిమంత కీలక పాత్ర పోషించారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన హిమంత 2015లో బిజెపిలో చేరారు. 2016లో జరిగిన ఎన్నికల్లో బిజెపి విజయం సాధించడంలో హిమంత విశేష కృషి చేశారు. అస్సాం లోనే కాకుండా ఈశాన్య రాష్ట్రాల్లో కమలం వికాసానికి హిమంత పాటుపడ్డారు.
ముఖ్యమంత్రి పదవి కోసం సర్బానంద్ సోనోవాల్, హిమంత పోటి పడ్డారు, ఆదివారం ఢిల్లీ లో జరిగిన సమావేశంలో హిమంత పేరును జెపి నడ్డా ఖరారు చేశారు. బిజెపి శాసనసభా పక్షం హిమంతను తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. శర్బనంద్ సోనోవాల్ కు కేంద్ర కేబినేట్ లో స్థానం కల్పిస్తామని బిజెపి పెద్దలు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. హిమంతకు ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, బిజెపి నేతలు అభినందనలు తెలిపారు.