ప్రపంచవ్యాప్తంగా ఉన్నా హిందువులు, భారతీయుల కోసం ఎడారి దేశంలో ఓ పుణ్యక్షేత్రం అందుబాటులోకి వస్తోంది. రాబోయే రోజుల్లో ఆ పుణ్యక్షేత్రం ప్రముఖ పర్యాటక ప్రాంతంగా అలరించనుంది. అబుదాబి రాజధానిగా ఉన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గల్ఫ్ దేశంలో దుబాయ్ క్రీక్ సమీపంలో ఇప్పటికే హిందూ దేవాలయం ఉంది. దుర్గాదేవి, శివుడు, శ్రీకృష్ణుడు, ఆంజనేయ స్వామి మందిరాలతో పాటు సిక్కు గురుద్వారా ఒకే ప్రాంతంలో నిర్వహిస్తున్నారు. దుబాయ్ రాజు కేటాయించిన భవన సముదాయంలో ఈ ఆలయాలు కొనసాగుతున్నాయి.
కొత్తగా స్వామీ నాయాయన్ సంస్థ నిర్మించిన మందిరంలో భారత దేశంలో ముఖ్యమైన ఆలయాల దేవుళ్ళను ప్రతిష్టించారు. విఘ్నేశుడితో మొదలుకొని దక్షిణాదిలో గురువాయుర్ నుంచి ఉత్తరాదిలో రాధాకృష్ణుల వరకు అందరు దేవుళ్ళు కొలువుదీరారు.
అబుదాబి , అజ్మాన్ , దుబాయ్ , ఫుజైరా , రస్ అల్ ఖైమా , షార్జా మరియు ఉమ్ అల్ క్వైన్ అనే ఏడు ఎమిరేట్ల (దేశాల) సమాఖ్య. ప్రతి ఎమిరేట్ కూ ఒక పాలకుడుంటాడు. ఇస్లాంమత రాచరికపు వ్యవస్థ. వీళ్ళందరూ ఏక కంఠంతో ఆమోదించి ప్రోత్సహించగా స్వామినారాయణ్ సంస్థ నిర్మించిన బొచ సన్యాసి అక్షర పురుషోత్తం స్వామి నారాయణ్(BAPS) హిందూ దేవాలయం.. దుబాయ్-అబుదాబి షేక్ జాయెద్ హైవేకి దూరంగా అల్ రహ్బాకు సమీపంలో ఉన్న అబు మురీఖా వద్ద ఉంది.
ముస్లిం పాలకుడు సమర్పించుకున్న భూమి, క్యాథలిక్ క్రిస్టియన్ రూపొందించిన ప్రాజెక్ట్. ప్రముఖ్ స్వామి ప్రేరణతో మరియు మహంత్ స్వామి మహారాజ్ ఆశీర్వాదంతో ఈ మందిరం నిర్మించారు. అరబ్ దేశాల సామాజిక, సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లబోతున్నది. UAE పశ్చిమాసియా లేదా మధ్యప్రాచ్యంలో నిర్మాణమైన మొదటి హిందూ మందిరమిది.
తెల్లని ఇటాలియన్ చలువరాళ్ళు రాజస్థాన్ నుండి గులాబీ రంగు ఇసుకరాళ్లు సేకరించారు. ఈ రాళ్ళు గుజరాత్, రాజస్థాన్ మరియు ఒరిస్సాలోని వివిధ ప్రాంతాల్లోని శిల్పకళా నైపుణ్యం కలిగిన వారసత్వ కళాకారులచే అతి సున్నితంగా, సూక్ష్మంగా శిల్పాలుగా రూపొందించబడ్డాయి.
ఆగష్టు 2015లో, UAE ప్రభుత్వం అబుదాబిలో మందిరాన్ని నిర్మించడానికి భూమిని అందించాలనే నిర్ణయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ మొదటి అధికారిక పర్యటన సందర్భంగా అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. 10 ఫిబ్రవరి 2018న, BAPS స్వామి నారాయణ సంస్థ ప్రతినిధులు షేక్ మొహమ్మద్ మరియు భారత ప్రధానిని రాష్ట్రపతి భవన్లో కలిశారు. మొత్తం రాజకుటుంబం మరియు 250 మందికి పైగా స్థానిక నాయకుల సమక్షంలో ఎంఓయూపై సంతకం చేశారు. శంకుస్థాపన కార్యక్రమం.. శిలాపూజ మరుసటి రోజు జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దుబాయ్ ఒపెరా హౌస్ నుండి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వేడుకను చూశారు.
యూఏఈలో ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ఆల్ నహ్యాన్ ఆలయ నిర్మాణానికి భూమిని కేటాయించగా. 2019లో యూఏఈ టాలరెన్స్ అండ్ కో-ఎగ్జిటెన్స్ మంత్రి షేక్ నహాయన్ ముబారక్ అల్ నహ్యాన్ ఈ ఆలయానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ఆ సమయంలో మంత్రితో పాటు పలువురు అరబ్ ప్రముఖులు పాల్గొన్నారు.
జనవరి 29, 2024న 42 దేశాల రాయబారులు, దౌత్యవేత్తలు ఆలయాన్ని సందర్శించారు. యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ ఈ పర్యటనను నిర్వహించారు.
సరిగ్గా ఐదు సంవత్సరాల తరువాత నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ ఆలయం ఫిబ్రవరి 14న ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త మహంత్ స్వామి మహరాజ్ సమక్షంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఆలయ ప్రారంభానికి ఒక రోజు ముందు, అబుదాబిలోని జాయెద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని భారతీయులను ఉద్దేశిస్తూ ఫిబ్రవరి 13న ‘అహ్లాన్ మోడీ’ గా ఏర్పాటు చేసిన ఒక భారీ సభలో ప్రసంగిస్తారు.
ఆలయ ప్రత్యేకతలు – విశేషాలు:
* గతంలో అనేక ఆలయాలు విధ్వంసం చేసిన వారి ఇప్పటితరం ఈ నిర్మాణానికి పూనుకోవడం ఒక విశేషం.
* అక్కడ 6శాతం ఉన్న హిందువులు మాత్రమే కాకుండా హిందూ జీవన శైలిని పోలిన వాటిని అనుసరించేవారు, ఆయుర్వేదం, శాకాహార సాత్వికాహారం తీసుకునేవారు, యోగాసనాలు ప్రాణాయామం వంటి అష్టాంగయోగను ఇష్టపడేవారు, భజనలు కీర్తనలు యజ్ఞము వంటి వాటిని నిర్వహిస్తూ ఆనందించేవారు, ప్రకృతి ఆరాధకులందరికీ ఈ ఆలయం కేంద్రం కాబోతున్నది.
* యూఏఈ లోని 7 ఏమిరేట్స్ ని ఆలయ ఏడు శిఖరాలు సూచిస్తాయి.
* మొత్తం 27 ఎకరాల్లో ఆలయం నిర్మితమైంది.
* యూఏఈలోని వేడిని తట్టుకునేందుకు రాజస్థాన్ నుంచి ఇటాలియన్ పాలరాయి, ఇసుకరాయిని తెప్పించి ఆలయ నిర్మాణంలో వాడారు.
* పూర్తిగా టెక్ ఫీచర్లు, సెన్సార్లు వంటి వాటిని ఆలయంలో అమర్చారు.
* ఆలయంలో రెండు గోపురాలు, 7 శిఖరాలు, 402 స్తంభాలు ఉన్నాయి.
* ప్రతీ శిఖరంపై భారతీయ ఇతిహాసాలు, గ్రంథాల కథలను చెక్కారు.
* ప్రార్థనా మందిరాలతో పాటు పిల్లలకు ఆట స్థలాలు, గార్డెన్స్, ఫుడ్ కోర్ట్స్, బుక్ స్టోర్స్, గిఫ్ట్ షాపులు ఉన్నాయి.
* మొత్తం ఆలయ ఎత్తు 108 ఫీట్లు
*40,000 క్యూబిక్ ఫీట్ల పాలరాయిని, 1,80,000 క్యూబిక్ ఫీట్ల ఇసుక రాయిని నిర్మాణంలో వాడారు.
* 18 లక్షల ఇటుకలను వాడారు.
* 300 సెన్సార్లను టెంపుల్ కాంప్లెక్స్‌లో అమర్చారు.
* 6,90,000 పని గంటలు పనిచేసి ఆలయాన్ని నిర్మించారు.
* 700 కోట్ల రూపాయలు ఖర్చు (అంచనా.) ఈ ఆలయానికి గుజరాత్ రాష్ట్రం నుంచి ఇతర దేశాల్లోని గుజరాతీలు భూరి విరాళాలు సమర్పించారు.
సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయ అనే ఋషి వాక్కును నిజం చేస్తూ…, ప్రజాహితం, ప్రకృతి హితకారకమైన జీవన పద్ధతిలో జీవించి సంపూర్ణమైన శాంతిని, ఆనందాన్ని సుఖాన్ని సంతోషాన్ని పొందాలని అందరం కోరుకుందాం.
-దేశవేని భాస్కర్