Thursday, December 12, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంహిందూపురం కథలు-7

హిందూపురం కథలు-7

తెలుగుదేశం పార్టీ 1983లో పుట్టింది. ఎన్ టీ రామారావు 83లో తిరుపతి, గుడివాడ రెండుచోట్ల గెలిచి తిరుపతికి రాజీనామా చేశారు. 1985లో హిందూపురం, గుడివాడ రెండు చోట్ల గెలిచి గుడివాడకు రాజీనామా చేశారు. 89లో హిందూపురం, కల్వకుర్తిలో పోటీచేసి కల్వకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి చిత్తరంజన్ దాస్ చేతిలో ఓడిపోయి…హిందూపురంలో గెలిచారు. (అనంతపురం జిల్లాలో ఎన్ టీ ఆర్ కు అభిమానులు ఎక్కువగా ఉండడం; హిందూపురంలో పేరున్న పెద్ద నాయకులు ఎవరూ లేకపోవడం; బీ సీ ఓటు బ్యాంక్ అత్యధికంగా ఉండడం; ఫ్యాక్షన్ గొడవలు లేకపోవడం; చెప్పినట్లు విని ఉంటారన్న నమ్మకం కుదరడంతో బయటివారికి భద్రమైన చోటు అయ్యింది. నిజానికి హిందూపురంలో నాయకత్వం ఎప్పటికీ ఎదగకపోవడానికి ఇదే ప్రధాన కారణం). ఎన్ టీ ఆర్ కన్నుమూశాక 96 ఉప ఎన్నికలో నందమూరి హరికృష్ణ హిందూపురం ఎమ్మెల్యే అయ్యారు. 2014, 2019, 2024 ఎన్నికల్లో వరుసగా మూడు పర్యాయాలు నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యే అయ్యారు. మధ్యలో 1999 లో సి సి వెంకట్రాముడు, 2004లో పి . రంగనాయకులు, 2009లో అబ్దుల్ ఘని టీ డి పి తరపున ఎమ్మెల్యేలయ్యారు.

ఎన్ టీ ఆర్ వల్లే హిందూపురానికి పేరు వచ్చింది. కొన్ని విద్యాసంస్థలు వచ్చాయి. పారిశ్రామిక వాడ వచ్చింది. 1989లో అధికారం పోయాక ఎన్ టీ ఆర్ హిందూపురానికి రావడం బాగా తగ్గించారు. పైగా ఒకసారి పెనుగొండ దగ్గర ఏదో ఆశ్రమంలో పూజకు బెంగళూరు నుండి రోడ్డు మార్గాన వెళుతూ హిందూపురంలో ఆగరని ఆయన టూర్ షెడ్యూల్ వచ్చింది. నేనప్పుడు హిందూపురంలో విలేఖరిని. “తారకరమన్నా! తప్పించుకుపోకన్నా!” అని వార్త రాశాను. స్థానిక టీ డి పి నాయకులకు కోపం వచ్చింది. దాదాపు రెండొందలమంది కార్యకర్తలు నామీద దాడి చేసినంత పని చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఆయన. ఈ ఊరిమీదుగా వెళుతూ ఇక్కడ ఆగకపోవడమేమిటి? మనం అడగకపోవడమేమిటి? అని నా రాతమీద నేను గట్టిగా నిలబడ్డాను. ఏమనుకున్నారో ఏమో మౌనంగా వెళ్ళిపోయారు. తరువాత ఎప్పుడో ఒకసారి హిందూపురం వచ్చినప్పుడు “సార్! మీరు మా ఎమ్మెల్యే. మీరలా హిందూపురానికి రాకుండా పెనుగొండ వెళ్ళడం బాగోలేదు. మమ్మల్ని అవమానించినట్లు. ఇక్కడందరూ మీ అభిమానులే. వారి మనసు గాయపడింది” అని నేను ఆయనకే చెప్పాను. కోపంగా మొహం పెట్టి అది వేరే పని అన్నారు. ఏ పని అయినా హిందూపురమే మీ మొదటి హాల్ట్ కావాలి అన్నాను. వెంటనే మెత్తబడ్డారు. “నిజమే. రావాల్సింది బ్రదర్! ఇకపై అలా జరగదులెండి!” అన్నారు. వెంటనే బెల్ కొట్టి కాఫీ తెప్పించి కాసేపు హిందూపురం గురించి పిచ్చాపాటీ మాట్లాడారు. ఒక ఓటరుగా మిమ్మల్ని అడిగే హక్కు లేదా? అన్నాను. ఎందుకు లేదూ! అన్నారు. ఇక్కడ మీ శిష్యపరమాణువులు నామీద కోప్పడుతున్నారు…మీమీద ఈగ వాలనివ్వరు…మీరంటే హిందూపురానికి అంత ఇష్టం సార్! అన్నాను. పొంగిపోయారు.

తరువాత కూడా “చూడు చూడు అన్నకోట” పేరిట ఒక సీరీస్ రాశాను. హిందూపురంలో ఆగిన అభివృద్ధి, పార్టీలో అంతర్గత కలహాలగురించిన కథనాలవి. ఈసారి నామీదకు ఎవరూ రాకపోవడానికి కారణం ఎన్ టీ ఆరేనని తెలిసి ఆశ్చర్యపోయాను. ఆయన అవన్నీ చదివి వాటికి వివరణ ఇవ్వండి అని నాదగ్గరికి స్థానిక ఇన్ ఛార్జ్ ను పంపారు. తరువాత ఎప్పుడో ఒకసారి హిందూపురం వచ్చినప్పుడు “సార్! మీవారిని చాలా ప్రజాస్వామ్యపరాయణులను చేశారు” అన్నాను. మీవార్తలు నేను చదువుతున్నాను అని తెలిశాక వారిలో మార్పు అది అన్నారు. హిందూపురం విలేఖరులు మాత్రం లోపల ఉండి మిగతావారందరూ గది బయటికి వెళ్ళిపోండి అని మాతో చాలాసేపు మనసు విప్పి మాట్లాడారు. ఎన్ టీ ఆర్ తెలుగు వినడం ఒక అదృష్టం. తెలుగు, సంస్కృత పారిభాషిక పదాలను అలవోకగా వాడతారు. సౌమనస్యం, సౌహార్దమ్, సంవిధాన స్రవంతి, భగీరథుడి తపః ఫలం, ఎడారిలో మోడులు చిగురించడానికి చినుకుల చిరు సంకల్పం లాంటి మాటలు ఆ ఫ్లోలో వింటుంటే నాకైతే భువవిజయంలో కృష్ణదేవరాయల ముందు కూర్చున్నట్లు ఉండేది. తరువాత హిందూపురం వదిలి హైదరాబాద్ వచ్చేసినా నందమూరి హరికృష్ణతో కూడా ఆ చనువు కొసాగింది.

  • ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ వల్ల హిందూపురానికి గొల్లపల్లి నుండి పైప్ లైన్ ద్వారా యాభై కిలోమీటర్లు ప్రయాణించి మంచినీళ్ళు వచ్చాయి. ఈవిషయంలో హిందూపురం ఎప్పటికీ బాలకృష్ణకు రుణపడి ఉంది.
  • వై ఎస్ ఆర్ సీ పి అధికారంలో ఉండగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు హిందూపురం జిల్లా కేంద్రంగా ఉండాలన్న స్థానికుల ఆందోళనలో బాలకృష్ణ కూడా పాల్గొన్నారు. ఇప్పటి పరిస్థితుల్లో కొత్త జిల్లాలు ఏర్పాటవుతాయా? కొత్తగా ఏర్పడ్డ సత్యసాయి జిల్లాకు ఇప్పటికే ఉన్న పుట్టపర్తిని కాదని హిందూపురాన్ని కేంద్రంగా చేయగలరా? అన్నది సందేహమే. కానీ స్థానికులకు ఇంకా జిల్లా కేంద్రంమీద బాలకృష్ణ వల్ల ఆశ ఏదో అలాగే ఉన్నట్లుంది.
  • హిందూపురంలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభిస్తానని బాలకృష్ణ ఒక సందర్భంలో హామీ ఇచ్చినట్లున్నారు.

  • ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల తప్ప హిందూపురంలో ఉన్నత విద్యకు ప్రయివేటు కళాశాలలే దిక్కు. ప్రభుత్వ జె ఎన్ టీ యూ, ఇతర డిగ్రీ, పి జి కాలేజీల ఏర్పాటుకు బాలకృష్ణ ప్రయత్నించాలని స్థానికులు కోరుతున్నారు.
  • మంచినీటి సమస్య కొంతవరకు తీరినా బాలకృష్ణ పట్టుపడితే హిందూపురానికి ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని స్థానికుల ఆశ.
  • హిందూపురం పట్టణంలో ఇరుకుగా ఉన్న రోడ్లను వెడల్పు చేయడం, కూడళ్ళను విస్తరించడం, సుందరీకరించడం లాంటి పనులకు ఈమధ్యే బాలకృష్ణ చొరవతో ప్రతిపాదనలు సిద్ధమై మునిసిపల్ కౌన్సిల్ ఆమోదం పొందాయి.

(దీనితో హిందూపురం కథలు సమాప్తం. రేపటినుండి కందుకూరి రమేష్ బాబు కనుగొన్న “సామాన్యశాస్త్రం” ధారావాహిక)

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్