Tuesday, January 28, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంహిందూపురం కథలు- 5

హిందూపురం కథలు- 5

ఇది పూర్తిగా మా ఊరు తిండి తినే విషయం. ఇష్టం లేనోళ్లు చదవద్దు. మేము మాత్రం తినేది ఇడిసెల్లే. మేము పుట్టిండేదే తినేకి. వాసవీ ధర్మశాల రోడ్డు పుట్టిండేదే మాకు తిండి పెట్టేకి.

దినమంతా తింటానే ఉంటాము. స్వీట్ ఎక్కువయితే కొంచెం కారం తిని మళ్లీ స్వీట్ తింటాం. కారం ఎక్కువయితే కొంచెం స్వీట్ తిని కారం తింటాం.

బారా మసాలా, కట్ మిర్చి ఆకలయి తినెల్లె. ఊరికే టైమ్ పాస్ కు తినేది. శాండ్ విచ్ ఊరికే టేస్ట్ చూసేకి. సాయంత్రం దోసెలు తినకపోతే ఏమి బాగుంటుందప్పా? దోసెలు యేసి ఇచ్చేకి అయిదు నిముషాలు టైమ్ అయితుంది కదా? ఆ గ్యాప్ లో నిప్పట్ మసాలా, దాల్ మసాలా, పానీ పూరీ, కట్లెట్, చాట్, బేల్ పూరీ ఇస్తే తినల్లా? వద్దా? తినకపోతే పానీ పూరీ బండి అతను ఎంత ఫీలయితాడు? ఆయప్ప ఫీల్ కాకుండా ఉండేకే మేము తింటా ఉండేది. ఆకలయి కాదప్పా.

ఇంట్లో ఆయిల్ ఫుడ్, బయట ఆయిల్ ఫుడ్ అని ఊరికే దిష్టి పెట్టద్దు.
ఏమి- ఊరి నిండా ఆసుపత్రులు లేవా?
తక్కువ పడితే బెంగళూరులో ఆసుపత్రులు లేవా?

రాండా!
ఊరికే కూర్చునే బదులు…
అట్ల పోయి…పితికిబ్యాడ్ల పప్పు దోసె తిని …ఆమీటికి వెజిటబుల్ శాండ్ విచ్ తిని…ఇంటికొచ్చి…అన్నం తిందాము!!

హిందూపురంలో తిరుగుతున్న ప్రతిసారీ కొన్ని సమాధానం లేని ప్రశ్నలు నన్ను వేధిస్తుంటాయి.

  • హిందూపురం ముందు పుట్టి…చిరు తిళ్లు తరువాత పుట్టాయా? చిరు తిళ్లు ముందు పుట్టి తరువాత హిందూపురం పుట్టిందా?
  • రెండు లక్షల జనాభా ఉన్న హిందూపురం చిరు తిళ్లకు ఒక్క వాసవీ ధర్మశాల రోడ్డు స్ట్రీట్ ఫుడ్ ఎలా సరిపోతోంది?
  • హిందూపురంలో ఇళ్లల్లో అసలు ఏమయినా వండుకుంటారా? లేక రోడ్ల మీదే తినేసి ఇళ్లకెళ్లి పడుకుంటారా?

  • యాభై, అరవై ఏళ్లుగా హిందూపురం తిన్న బజ్జీలెన్ని? పానీపూరీలు ఎన్ని? దాల్ మసాలా, బారా మసాలాలు ఎన్ని టన్నులు? శాండ్ విచ్చులెన్ని? నిప్పట్ మసాలాలు ఎన్ని హాంఫట్ అయ్యాయి? చాట్లు, భేల్ పూరీలు ఎన్ని స్వాహా అయ్యాయి?
  • మల్లెపువ్వు మెత్తటి ఇడ్లిలు ఎన్ని కోట్లు అరిగిపోయాయి? మసాలాదోసెలు ఎన్ని కోట్లు ఆవిరయ్యాయి? పితికి బేడల పప్పు ఎన్ని క్వింటాళ్లు జీర్ణమయ్యింది?
  • కోవా కూరిన ఓళిగలు(బొబ్బట్లు) ఎన్ని నాలుకమీద నామరూపాల్లేకుండా పోయాయి?
  • చక్కిలాలు, నిప్పట్లు, కోడిబేళ్లు ఎన్ని లారీలు అయిపోయి ఉంటాయి?

  • మిగతా ప్రాంతాలవారికి అర్థం కాని…ఏనాడూ వినని…రుచి చూడని…అన్నన్ని ఐటమ్స్ కనుక్కున్న, కనుక్కుంటున్న హిందూపురం పాక శాస్త్ర ప్రావీణ్యాన్ని ప్రపంచం ఎందుకు గుర్తించలేదు?
  • రోడ్డుమీద మనుషులతో పాటు ఆవులు, ఎద్దులు, ఎనుములు(గేదెలు) ఇతర జంతువులు కూడా తినుబండారాల స్టాళ్ళ చుట్టూ నిలుచున్నా సహృదయంతో సర్దుకుపోయే హిందూపురం ఔదార్యం, హృదయ వైశాల్యం ఎందుకు చరిత్ర పుటల్లోకి ఎక్కలేదు?
  • అంత దుమ్ము ధూళిలో తింటున్నా హిందూపురం ఆరోగ్యాలు చక్కగా ఉండడం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రత్యేకంగా గుర్తించాల్సిన విషయం ఎందుకు కాలేదు?

కొసమెరుపు:-
ఇది ఏ మాత్రం నెగటివ్ కాదు. పరమ పాజిటివ్. ఇరవై అయిదేళ్లపాటు హిందూపురవాసిగా నేను కూడా ఇలాగే…ఇంతకంటే ఉధృతంగా…కరువుతీరా…తిన్నాను కాబట్టే…ఆ పులకింత కొద్దీ చెప్పగలుగుతున్నాను. ఇలా ఎలా తింటారు? అని మీరు ఆశ్చర్యపోయినా…పోకపోయినా...మా హిందూపూర్ ఇలాగే తింటుంది. తిని అరిగించుకుంటుంది.

దమ్ముంటే…
మీ నాలుకకు శక్తి ఉంటే…
మీ పొట్టలో చోటు ఉంటే…
మీరూ తినండి…
రండి…ఒకసారి హిందూపురం వాసవీ ధర్మశాల రోడ్డుకు.

రేపు:-
హిందూపురం కథలు- 6
“హిందూపురం వ్యాపారం”

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్