Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంచిత్రకారుడు కావాలనుకున్న హిట్లర్

చిత్రకారుడు కావాలనుకున్న హిట్లర్

Artistic ambition of Hitler, actually he wanted to become a professional artist : 

జర్మనీ నియంతగా ముద్రవేసుకున్న అడాల్ఫ్ హిట్లర్ మొదట్లో చిత్రకారుడు. హిట్లర్ తొలి రోజుల్లో చిత్రకారుడు కావాలనే కలలు కన్నాడు. అయితే అది నెరవేరలేదని చరిత్రపుటలు తిరగేస్తే తెలిసింది. కానీ యవ్వనప్రాయంలోనూ,  సమయం దొరికినప్పుడు హిట్లర్ బొమ్మలు గీయడాన్ని అలవాటుగా చేసుకున్నాడు. అతను తన జీవితకాలంలో రెండు వేలకుపైగా బొమ్మలు గీశాడు.

అప్పుడప్పుడూ హిట్లర్ గీసిన బొమ్మలలో కొన్ని వేలం వేస్తుంటారు. హిట్లర్ సంతకంతో కూడిన బొమ్మలకు ప్రజల నుంచి విశేషమైన ఆదరణ ఉంది. ఈ క్రమంలోనే జర్మనీ రాజధాని బెర్లిన్ లో ఓమారు పురాతన పెయింటింగ్స్ వేలం వేసే కేంద్రంలో హిట్లర్ గీసిన చిత్రాలంటూ ఓ మూడు వేలానికొచ్చాయి. అవి, నది, పర్వతం, చెట్టు. ఈ మూడు బొమ్మలలోనూ హిట్లర్ సంతకాలున్నాయి. ఆ సంతకాలను చేతిరాత నిపుణులు క్షుణ్ణంగా పరిశీలించి అవి హిట్లర్ సంతకాలే అని నిర్ధారించారుకూడా. అయితే ఆ మూడు చిత్రాలు నకిలీవని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై బెర్లిన్ పోలీసులు దర్యాప్తు జరిపారు. సంతకమైతే హిట్లర్ దేనని, కానీ బొమ్మలు అతనిది కావని పోలీసులు తేల్చారు.Artistic ambition of Hitler

మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు హిట్లర్ వియన్నాలో ఓ కూలీగా పని చేశాడు. అలాగే పోస్టుకార్డు సైజులో బొమ్మలు గీసేవాడు. వియన్నా ఫైన్ ఆర్ట్స్ అకాడమీలో సీటు కోసం రెండు సార్లు ప్రయత్నించాడు. కానీ తిరస్కృతికి గురయ్యాడు. ఐనా బొమ్మలు గీయడంపై హిట్లర్ తనకున్న మక్కువ వీడలేదు. ఒక్కొక్కప్పుడు రోజుకి మూడు బొమ్మలు గీసినట్టు తన జీవిత చరిత్రలో రాసుకున్నాడు.

అధికారంలోకొచ్చాక హిట్లర్ తన పెయింటింగ్సుని సేకరించమని అధికారులను ఆదేశించి వాటి ఆచూకీ లేకుండా చెరిపించేశాడు. అప్పటికీ కొన్ని వందల పెయింటింగ్స్ అప్పుడప్పుడూ బయటపడుతున్నాయి. అలా దొరికిన వాటిని వేలం వేస్తున్నారు. నాజీ చిహ్నాలు లేని హిట్లర్ పెయింటింగ్సుని అమ్ముకోవచ్చని జర్మనీలో చట్టపరంగా వెసులుబాటు కల్పించారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిశాక హిట్లర్ పెయింటింగ్స్ ఎన్నింటినో అమెరికా సైన్యం స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. అయితే వాటిని ఎప్పుడూ ఎక్కడా ప్రదర్శనకు ఉంచలేదు. వాటిలో కొన్నింటిని ఇప్పటికీ అమెరికాలోని రెండవ ప్రపంచ యుద్ధం అంతర్జాతీయ మ్యూజియంలో చూడవచ్చు.  2014లో దక్షిణ జర్మనీలోని న్యురెంబెర్గ్ లో హిట్లర్ గీసిన ఓ వాటర్ కలర్ పెయింటింగుని ఒకరు లక్షా నలభై ఎనిమిది వేల డాలర్లకు కొనుగోలు చేశారు.యూదులపై ద్వేషాన్ని పెంచుకున్న హిట్లర్ ఫ్యామిలీ డాక్టర్ ఓ యూదు కావడం ఆశ్చర్యమే. కరడుగట్టిన నియంతగా పేరు పొందిన హిట్లర్ హృదయమూ మృదువైనదంటూ ఓ తమిళ పుస్తకం పేర్కొంది. అందులో హిట్లర్ ప్రేమ వ్యవహారం కూడా ఉంది.

– యామిజాల జగదీశ్

Also Read : తల ఎత్తి నిలిచిన ఒలింపిక్స్ హెడ్డింగులు

RELATED ARTICLES

Most Popular

న్యూస్