Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంవాడుకున్న ఆక్సిజన్ ను మొక్కలు నాటి తిరిగి ఇవ్వండి!

వాడుకున్న ఆక్సిజన్ ను మొక్కలు నాటి తిరిగి ఇవ్వండి!

—————–

“చెట్టునురా -చెలిమినిరా
తరువునురా – తల్లినిరా
నరికివేయబోకురా
కరువు కోరుకోకురా
అమ్మనురా అమ్మకురా
కొడుకువురా కొట్టకురా
—-
నేలతల్లి గుండెలో విత్తనాల గొంతులో పసిపెదవుల నా గీతం ప్రకృతికి సుప్రభాతం
మీకు నచ్చలేదటరా పచ్చనాకు సంగీతం
—–

చంటిపాప కాళ్లతో ఎదపై తన్నినా
దీవెనగా తల్లి ఆనందాశ్రులు రాల్చినట్లు
రాళ్లను విసరే మీకు పళ్ళను అందిస్తున్నా
—–

పనికిరాని గాలిని ప్రాణవాయువొనరించి
కాలుష్యం నుండి మిమ్ము కాపాడాలి
మా పుట్టుక నుండి మీపైనే కద జాలి
—–

సూర్యరశ్మి బువ్వగా లవణాలే పాలుగా
కలిపి ఉగ్గుపాలపిండి తిండి చేసినానురా
కడుపునింపు మాతకు కడుపుకోత పెట్టకు
—–

చనిపోయిన మనుషులకై మమ్ము నరికి చితి పేర్చి తగలేసే నాగరికత మీది
బతుకంటే త్యాగమనే బాధ్యత మాది
——

మా తనువులు తెంచినా వేళ్ళు భూమిలో మిగుల్చు
మళ్ళీ మీకోసం చిగురించు దారి ఉంచు
పెకలించాలంటే మొదట పది చెట్లను పెంచు”
—————-

సుద్దాల అశోక్ తేజ సినిమా పాటల రచయిత కాబట్టి పరిచయం అక్కర్లేదు . అయితే ఈ చెట్టు పాడే పాట సినిమా పాట కాదు . సినిమాల్లో వాడలేదు .అయినా, సినిమా ఇంత వాస్తవికతను, సందేశాన్ని సహించదు. సహించాలని కోరుకోకూడదు. దాని మర్యాదలు దానివి.
కొట్టు కొట్టు చెట్టే కొట్టు చెట్టు చెట్టు పట్టే కొట్టు -లాంటి ప్రాసల ప్రయాసల ప్రయత్నాలకు సినిమా ఊగిపోతుంది. దాని బలం, బలహీనత అది. ఆ చర్చ మనకనవసరం.

ఇది సుద్దాల ప్రైవేట్ సాంగ్. అక్కడక్కడా ప్రకృతి ప్రేమికులయిన భాషా ప్రేమికుల నోళ్ళలో మాత్రమే నానుతున్న పాట. ఇంకా బాగా ప్రచారం కావాల్సిన పాట.
—————
నల్గొండ జిల్లా సుద్దాల పుట్టిన ఊరు ఇంటిపేరయిన సుద్దాల హనుమంతు చరిత్ర మరో సందర్భంలో చెప్పుకుందాం. ఆయన పాట పల్లెటూరి పిల్లగాడా! ఎన్ని దశాబ్దాలయినా, ఇంకెన్ని శతాబ్దాలయినా కన్నీరు ఒలికిస్తూనే ఉంటుంది. ఆ పాటలో బాధ, పేదరికం, ఆవేదన, నిస్సహాయత, దైన్యం చెప్పాలంటే మాటల గుండెలు బరువెక్కుతాయి.
ఆ సుద్దాల హనుమంతు కుమారుడే మన అశోక్ తేజ. కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసి – పాటల పాఠాలు చెప్పదలిచి సినిమాల్లోకి వచ్చాడు. జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు.
పుట్టి పెరిగిన వాతావరణం, గ్రామీణ నేపథ్యం, తండ్రి వారసత్వం ఊరికే ఉండనీయవు. అంతరిస్తున్న వృక్షసంపదమీద దృష్టి పడింది. ఈ పాట పుట్టింది.
చెట్టు మనతో చెప్పుకునే పాట ఇది.
——————

సరళమయినభాషలో అందరికీ అర్థమయ్యేలా రాశారు కాబట్టి నిజానికి విశ్లేషణ అనవసరం.

చెట్టును, చెలిమిని, తల్లిని. మీరు నా పిల్లలు. నన్ను కొట్టకండి. కొట్టి కట్టెలుగా అమ్మకండి. నేలతల్లి గుండెలో నుండి విత్తనం గొంతుకతో ప్రకృతి సుప్రభాతగీతం పాడుతూ పసిపెదవులతో నేను మోసులెత్తుతాను. కొమ్మలు రెమ్మలు ఊపుతూ నేను పాడే పచ్చనాకు సంగీతం మీకు నచ్చలేదా? రాళ్లతో నన్ను కొట్టినా నా పిల్లలే కదా అనుకుని పళ్ళను ఇస్తున్నాను. పనికి రాని గాలి పీల్చి మీకేమో ప్రాణవాయువునిస్తున్నాను. కాలుష్యాన్ని తగ్గిస్తూ మా పుట్టుకను మీకోసమే త్యాగం చేశాను. ఎండవేడిని తిని, పత్రహరితాన్ని తయారు చేసుకుని, వేరునీరు తాగి మీకు ఫలాలను ఇస్తున్నాను. నేనేమో మీ కడుపు నింపితే, మీరేమో నా కడుపు కోస్తారు . చనిపోయిన వారి చితికి, బతికి ఉన్న మమ్మల్ను చంపే నాగరికత మీది. మీచావు మా చావుకొచ్చినా భరించే త్యాగం మాది. ఒకవేళ మా శరీరాలను తుంచాలనుకుంటే కనీసం వేళ్లనయినా అలా వదిలేయండి. మళ్ళీ మీకోసమే చిగురిస్తాం. ఒక చెట్టును కొట్టాలంటే ముందు పది చెట్లను పెంచండి.
—————–

రుద్రంలో వృక్షేభ్యో – హరికేశేభ్యో అని స్పష్టంగా ఒక మాట ఉంది. చెట్టు, చెట్టు కొమ్మల్లో ఆకుల పత్రహరితం – అంతా శివమయం. ఒక్కో చెట్టు ఒక్కో దేవుడికి స్థానం. ఒకే చెట్టులో శివ కేశవులు ఇద్దరూ కొలువయినవి ఉన్నాయి.
చెట్టు లేక పొతే తిండి లేదు, గాలి లేనే లేదు .
మనకేమో చెట్టూ పుట్ట లేకుండా ఫ్రెష్ కూరలు, పళ్లు, ఆకులు, ఫ్రెష్ గాలి కావాలి.
ఎలా వస్తాయో? ఎక్కడినుండి వస్తాయో?
నరికేసిన చెట్టుపాడే ఈ పాటను అడగండి – సమాధానం ఇస్తుందేమో ?

“చెట్టునై పుట్టి ఉంటే ఏడాదికొక్క వసంతమయినా మిగిలేది- మనిషినై పుట్టి అన్ని వసంతాలు కోల్పోయాను”
అన్నాడు గుంటూరు శేషేంద్ర. రాముడు వనవాసానికి వెళుతుంటే అయోధ్యావాసులందరూ సరయూ నది దాకా వెళ్లి వీడ్కోలు ఇచ్చి వచ్చారు. వేళ్ళున్నందుకు కదల్లేక చెట్ల కొమ్మలచేతులు రాముడు వెళ్ళినవైపు తిప్పి విలపించాయన్నాడు వాల్మీకి.
——————-

 

మహారాష్ట్ర నాగపూర్ లో డాక్టర్ రాజేష్ స్వర్ణకార్ రోగులతో మొక్కలు నాటించేలా వినూత్నమయిన ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. కోవిడ్ దెబ్బకు మహారాష్ట్రలో అన్ని ఆసుపత్రులు విలపిస్తున్నాయి. ఐ సి యూ ల్లో చోటు దొరకడం లేదు. వెంటిలేటర్లమీద ఉన్నవారితోపాటు, కరోనా రోగులకు చాలామందికి కృత్రిమంగా ఆక్సిజన్ అందించాల్సి వస్తోంది. దీనితో ఆక్సిజన్ కు మునుపెన్నడూ లేనంత కొరత ఏర్పడుతోంది. ఐ సి యూ లో వారం రోజులున్న ఒక మహిళకు లక్షా పద్నాలుగు వేల లీటర్ల ఆక్సిజన్ ను ఎక్కించారు. ఆమె కోలుకుని డిస్ చార్జ్ అయి వెళ్లేప్పుడు- “మీరు వాడుకున్న ఆక్సిజన్ ను తిరిగి ఇవ్వాలి. అందుకు మీరు పది మొక్కలు నాటి, వాటిని సంరక్షిస్తే చాలు” అని డాక్టర్ రాజేష్ అభ్యర్థించారు. ఆమె బాధ్యతగా అంగీకరించారు.

ఇలాగే డిస్ చార్జ్ అయి వెళ్లే మిగతా రోగులను కూడా మొక్కలు నాటాల్సిందిగా డాక్టర్ కోరుతున్నారు. ఈ వార్త ఆ నోటా ఈ నోటా పడి జాతీయ వార్త అయ్యింది. నానా చెత్త వార్తలతో పోలిస్తే- ఈ చెట్ల వార్త, చెట్లు ఇచ్చే ప్రాణవాయువు వార్త, పుడమికి చెట్టు శాఖోపశాఖలుగా ప్రాణాధారమయిన వార్త బాగా ప్రసారం కావాలి.

 

డాక్టర్ రాజేష్ అభినందనీయుడు. ఆయన ప్రయత్నానికి నారుపోసి, నీరు పోయాలి. ఆయన ఆశయానికి ఊపిరులూదాలి. ఆయన కోరుకుంటున్నట్లు మనం వాడుకున్న ఆక్సిజన్ ను తిరిగి ఇవ్వాలి.

-పమిడికాల్వ మధుసూదన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్