గాజాపై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో హమాస్‌కు మద్దతుగా యెమెన్ లోని హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలే లక్ష్యంగా వరుస దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా మరో నౌకపై దాడి చేశారు. హౌతీలు యెమెన్ నుండి ఎర్ర సముద్రంలోకి మూడు యాంటీ-షిప్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించారని, ఆయిల్ ట్యాంకర్‌కు స్వల్ప నష్టం వాటిల్లిందని యుఎస్ సెంట్రల్ కమాండ్ ధృవీకరించింది.
భారత్‌కు వస్తున్న ‘ఆండ్రోమెడా స్టార్’ అనే చమురు ట్యాంకర్ నౌకపై హౌతీ రెబల్స్ క్షిపణితో దాడి చేశారు. ఈ విషయాన్ని హౌతీ తిరుగుబాటుదారులే శనివారం ప్రకటించారు. పనామా జెండా ఉన్న నౌకపై దాడి చేసినట్లు హౌతీ ప్రతినిధి యాహ్యా సరియా తెలిపారు. ఈ దాడిలో నౌకకు నష్టం వాటిల్లినట్లు బ్రిటిష్ సముద్ర భద్రతా సంస్థ ఆంబ్రే తెలిపింది. ఇటీవలే ఈ నౌకను విక్రయించినట్టు షిప్పింగ్ డేటా ద్వారా తెలుస్తోంది. ఈ నౌక రష్యాలోని ప్రిమోర్క్ నుంచి గుజరాత్‌లోని వడినార్‌కు వెళ్తుండగా దాడి జరిగినట్లు ఆంబ్రే తెలిపింది.
పశ్చిమాసియ సంక్షోభాన్ని ప్రపంచ దేశాలకు చుట్టుకునేలా కుట్ర జరుగుతోంది. ఇజ్రాయల్ ను నేరుగా ఎదుర్కోలేని శక్తులు ఈ కుట్ర చేస్తున్నాయి. హమాస్, హిజ్బోల్లా ఉగ్రవాద మూకలు ఐసిసి సహకారంతో ఇజ్రయాల్ తో నేరుగా తలపడుతున్నాయి. తెరవెనుక ఈ రెండు గ్రూపులకు ఇరాన్ సహకరిస్తోంది.
వీరికి తోడుగా హౌతీలు యెమెన్ కేంద్రంగా ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులు చేస్తున్నారు. ఆ మార్గంలో వెళ్ళే నౌకలను హైజాక్ చేసి.. సిబ్బందిని కిడ్నాప్ చేయటం.. ఆపై హతమార్చటం జరుగుతోంది. ఇటీవల అమెరికా, బ్రిటన్, భారత్ నౌక బలగాలు హౌతీలు అనేక సందర్భాల్లో నిలువరించాయి. అయినా దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ మద్దతుతోనే హౌతీలు రెచ్చిపోతున్నారని అమెరికా, పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయి. పశ్చిమాసియా సంక్షోభానికి తొందరగా పరిష్కారం కనుగొనకపోతే ఎర్ర సముద్రంలో ఉగ్ర మూకల దాడులు నిత్యకృత్యం అవుతాయి.
-దేశవేని భాస్కర్