‘దయచేసి సినిమా మధ్యలో ఫోన్ చూడకండి’
ఇది ఇటీవల ఓటీటీ లో విడుదలైన ‘హోమ్’ మలయాళ సినిమా ప్రారంభంలో తెరపై కనిపించే మాట. అప్పుడు అర్థం కాకున్నా కాసేపటికి తెలుస్తుంది ఎందుకలా చెప్పారో. సోషల్ మీడియాలో కూరుకుపోయిన కొడుకులు, వారి ప్రపంచంలో తనని గుర్తించాలని ఆశ పడే తండ్రి. ఇదే కథ. కానీ ఇంకా ఎన్నో పాఠాలున్నాయీ సినిమాలో.
పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడే పుట్టదు
జనులా పుత్రుని కనుగొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందును సుమతీ!సరిగ్గా ఈ పద్యం లానే ఉంటుంది సినిమా. ఇందులో ప్రధాన పాత్ర
సిల్విస్టర్ ఒక సామాన్యుడు. ఏ ప్రత్యేకతా లేనివాడు. కాలంతో పోటీ పడలేక వ్యాపారం మానేసినవాడు. తన అసమర్ధతను కుటుంబం వేలెత్తి చూపుతుంటే నవ్వుకుని వదిలేసేవాడు. కొడుకుగొప్పవాడైతే మురిసినవాడు. అన్ని విధాలా ఇంట్లో భార్యకు చేదోడు వాదోడుగా ఉంటూ ఏ ఆధిక్యతా చూపనివాడు. కొడుకు తనను గుర్తిస్తే చాలని తపించినవాడు. వేరొకరికి దగ్గరవుతుంటే బాధను అణచుకుని నవ్వేసేవాడు.
…ఇదంతాకూడా ‘హోమ్’ సినిమా కథే. అయితే ఎక్కడా సినిమా చూస్తున్నట్టు కాకుండా మన కథే అన్నట్టు లీనమైపోతాం. ఈ సినిమాలో పెద్ద స్టార్స్ లేరు. హంగులు, ఆర్భాటాలు ఉండవు. అంతా మనకి తెలిసినవాళ్ళే అనిపిస్తారు. మాములుగా ఉండే ఒక బక్క పల్చటి మధ్యవయసు వ్యక్తి జీవితమే ఈ సినిమా. స్మార్ట్ ఫోన్ల లోనే జీవితం గడిపే పిల్లలకు దగ్గర కావాలని తానూ స్మార్ట్ ఫోన్ తీసుకుని ఆపై వచ్చే ఇబ్బందులని ఎలా ఎదుర్కొన్నాడన్నదే సినిమా ఇతివృత్తం. చివరలో వచ్చే ట్విస్ట్ చూసి తీరాల్సిందే. గడువులోగా కథ పూర్తి చేయకపోతే సినిమా ఛాన్స్ పోతుందనే కొడుక్కి ఎలాగైనా సహాయపడాలనుకునే తండ్రి పాత్ర తన కొడుకుతో పాటు మన గుండె లోతులనూ తడుముతుంది. మధ్యతరగతికి చెందిన మంచి వ్యక్తి జీవితం నిస్సారం కాదని నిరూపిస్తుంది. ఒక సామాన్యుడి అసామాన్యత కళ్ళ ముందుంచుతుంది. ఈ కాలం పిల్లలు ఆ కాలం పెద్దలు అందరూ చూడాల్సిన సినిమా ‘హోమ్’. అమెజాన్ ప్రైమ్ లో ఉంది.
-కె. శోభ