Saturday, September 21, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపేరులోనే ఉన్నది పెన్నిధి

పేరులోనే ఉన్నది పెన్నిధి

Name & Brand:
“పేరిడి నిను పెంచిన వారెవరే?
వారిని చూపవే! శ్రీరామయ్యా!
సార సారతర తారకనామమును పేరిడి…”
రాముడికి పేరు పెట్టిన వసిష్ఠుడిని, ఆయనతో పాటు పెంచి పెద్ద చేసిన కౌసల్యా దశరథులను తలచుకుని, తలచుకుని త్యాగయ్య కీర్తించాడు.

“త్వయైక తారితాయోధ్య,
నామ్నాతు భువనత్రయం”
రామా! నువ్వు ఒక్క అయోధ్యనే పాలించావు. నీ పేరు ముల్లోకాలను రక్షించి, పాలిస్తోంది. నీకంటే నీ పేరే గొప్పది- అని హనుమంతుడు రాముడితోనే అన్నాడు.

Name

కృష్ణుడికి ఆ పేరు పెట్టినవాడు గర్గ మహాముని. నందవ్రజానికి గర్గుడు ఈ నామకరణం కోసం వెళ్లినప్పుడే...నందుడు అన్న మాటను
“ఊరక రారు మహాత్ములు
వా రధముల యిండ్ల కడకు వచ్చుట లెల్లం
గారణము మంగళములకు
నీ రాక శుభంబు మాకు నిజము మహాత్మా !”
అని పోతన తెలుగు పద్యంలో రికార్డ్ చేశాడు. తరువాత “ఊరకరారు…” అన్న మాట తెలుగు భాషకు ఒక వాడుక మాట అయ్యింది.

పురాణాల్లో అవతారపురుషులకు పేర్లు పెట్టడానికి ఋషులు తపః పుణ్యం మూటగట్టుకుని పుట్టేవారు. ఇప్పుడు మన అవతారాలకు రుషుల అవసరమే రాదు. ఉన్నా ఉపయోగించుకోము.

ఈరోజుల్లో-
ముద్దులు మూట కట్టినట్లున్న ఒక పాపకు తల్లిదండ్రులు పరవశించి పెట్టుకున్న పేరు- అనాయ!

విహంగమై గగనంలో ఎగురుతుందనుకుని మరొక జంట తమ గారాల పట్టికి పెట్టుకున్న పేరు- విహాయ!

తమ బిడ్డ పెదవుల మీద ఎప్పటికీ చిరునవ్వు చెరిగిపోదనుకుని ఒక జంట నవ్వుతూ నామకరణం చేసిన తెలుగుపేరు- సుహాయ!

భువనగిరి పార్లమెంటు మాజీ సభ్యుడు, చేయి తిరిగిన వైద్యుడు బూర నరసయ్య ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీలో ఒక వ్యాసం రాశారు. పేరు- కులం ఒక బ్రాండ్ గా ఎలా మారిపోతుందో లోతుగా చర్చించారు. నరసయ్య అన్న తన పేరుకు ఎదురయిన చేదు అనుభవాలనే ఉదాహరణగా చెప్పుకున్నారు. మొరటు పేర్లు, గ్రామీణ నేపథ్యాన్ని సూచించే పేర్లు, కొన్ని వృత్తులను సూచించే పేర్లతో వచ్చే చిక్కులేమిటో వివరించారు. వినడానికి విచిత్రంగా ఉన్నా…నిజానికిది పెద్ద పేరు గొప్ప సమస్య.

పేరు వల్ల తన గుండెకు తగిలిన కొన్ని గాయాలేవో నరసయ్య వెంటపడినట్లున్నాయి. సామాజిక హోదా, కెరీర్ ఉన్నతికి- పేరుకు, కులానికి ఉన్న అవినాభావ సంబంధాలను ఆయన అనేక కోణాల్లో విశ్లేషించారు.

నరసయ్య గమనించారో లేదో కానీ…ఇప్పుడందుకే అందరూ ట్రెండీగా ఉన్న పేర్లకోసం చేయని ప్రయత్నం లేదు.

అసహాయ
నిర్లిప్త్
నిస్సహాయ
నీరస్
నిరాశ్
నిర్మాల్య్
కైవల్య్
లాంటి ట్రెండీ పేర్లకు కూడా రేపు పరమ పవిత్ర భావంతో నామకరణాలు జరగవచ్చు.

పెంటయ్య
పుల్లయ్య
కోటయ్య
మల్లమ్మ
ఎల్లమ్మ…
పేర్లను కూడా ప్రయత్నిస్తే కొంచెం ట్రెండీగా మార్చుకోవచ్చు.

పెంట్
పెంటన్
పుల్లన్
కోటన్
ఏలే ఎం
ఎం మాల్

ఇలా చివర అమ్మ, అయ్య, అన్న, అప్ప లేకుండా న్, ల్, అని పొల్లు వస్తే చాలు. ఉత్తర భారత టచ్ వచ్చి పరమ ట్రెండీ అయి మన పేరు మనకే ముద్దొస్తుంది.

Name

అజంత, హలంత భాషల లక్షణాలు, ఆ భాషోచ్చారణలకు సొంతమయిన పద్ధతుల గురించి మనకెందుకు?

కుక్కలకు టామీ, సోనీ అని అర్థరహితమయిన శబ్దప్రధానమయిన పేర్లు పెడుతుంటాం. దానికి ఆ పేర్ల మీద అభ్యంతరం ఉన్నట్లు ఇప్పటిదాకా మనకు తెలియదు. మనుషులకయినా అంతే. వారికి అభ్యంతరం లేనంతవరకు- పెట్టే పేర్లకు అర్థం లేకపోయినా పెద్ద అనర్థమేమీ జరగదు.

సరళ అని పేరున్న మహిళ చాలా కఠినంగా ఉండవచ్చు. హిమాంషు అన్నవాడు ఎప్పుడూ నిప్పులుగక్కుతూ చిటపటలాడుతుండవచ్చు. ధవళ్ పెద్దయ్యాక సింగరేణి బొగ్గు కంటే నలుపెక్కవచ్చు. నరసింహ గ్రామసింహానికే బెదిరిపోవచ్చు. శారద పదో క్లాసు మెట్లయినా తొక్కకపోవచ్చు. వీణ గొంతెత్తితే చెవుల్లో రక్తం కారవచ్చు.

నారాయణ, గోవిందా, దుర్గ, లక్ష్మి, ఉమ…అన్న పేర్లు పెడితే…పదే పదే ఆ పేరు పెట్టి పిలిచినందువల్ల నామోచ్చారణ పుణ్యం మన అకౌంట్లో పడుతుందని మన పోతన అజామిళోపాఖ్యానంలో అంటాడు. ఆ పుణ్యం ఎక్కడ వస్తుందో అన్న భయంతో హాయిగా మనం-
వంకర్
టింకర్
అంధ్
చే
వే
గే
లాంటి వినూత్న పేర్లు పెట్టుకుని పొంగిపోతున్నాం. ఆ పేర్లకు వారు సార్థకనామధేయులో? లేక పెరిగి పెద్దయి ఆ పేరుకు తగినట్లు ఉంటున్నారో? ఉండాలన్న సంకల్పంతోనే ఇలా నామకరణం చేస్తున్నారో?
ఏమో ఎవరికెరుక?
ఏ పేరులో ఏముందో?

-పమిడికాల్వ మధుసూదన్

ఇవి కూడా చదవండి:

పిల్లల అల్లరి అందం

ఇవి కూడా చదవండి:

ఓ తల్లి శిక్ష!

RELATED ARTICLES

Most Popular

న్యూస్