Friday, March 29, 2024
Homeతెలంగాణఓ తల్లి శిక్ష!

ఓ తల్లి శిక్ష!

Pathetic:  బిడ్డను పది నెలలు కడుపులో పెట్టుకు మోసే తల్లి,

ప్రసవకాలంలో వచ్చే ఆపుకోలేని బాధను పంటి బిగువున భరిస్తూ  బిడ్డకు జన్మనిచ్చే తల్లి

బిడ్డను కనే సమయంలో శరీరం కళను కోల్పోయి శుష్కించినా పట్టించుకోకుండా బిడ్డ కోసం బ్రతికే తల్లి..

బిడ్డ మల-మూత్రాలతో శయ్య, శరీరం మలినమైనా ఆ కష్టాన్ని సహిస్తూ, బిడ్డను కంటికి రెప్పలా కాపాడే తల్లి…

బిడ్డకు చెడు దృష్టి శోకకూడదని బుగ్గన నల్ల చుక్క పెట్టి, బిడ్డను కళ్ళలో పెట్టుకొని కాపాడుకొనే తల్లి..

తన కడుపు మాడినా, ఆడుతూ, పాడుతూ.. బిడ్డ కడుపు నింపాలని చూసే తల్లి..

అటువంటి తల్లి కన్న బిడ్డనే  చంపాలను కొన్నదంటే..

తల్లి ఆ బిడ్డ కు బ్రతుకు కంటే చావు లోనే సుఖం ఉందనుకొన్నదేమో?

ముగ్గురు బిడ్డల తల్లి.. మొగుడు ఈ సంసారం ఈదలేనని అర్ధాంతరంగా తనువు చాలిస్తే..

తానూ చస్తే.. బిడ్డల భవిష్యత్ ఏమిటని.. బ్రతక లేక బిడ్డల కోసం బ్రతికే బ్రతుకు..

అన్నెంపున్నెం ఎరుగని అమాయకపు బిడ్డలతో ఒక “అబల” ఒంటరిగా బ్రతుకు పోరాటం..

నాలుగిళ్ళలో రెక్కలు ముక్కలు చేసుకొని బిడ్డల కడుపు నింపాలని ఆరాటం.

ఒక బిడ్డ.. పుట్టు గుడ్డి.. దానికి తోడు మానసిక వికలాంగుడు..

తోటి బిడ్డలతో.. కలవలేడు.. ఆడుకోలేడు..

స్కూల్లో చేర్చుకోరు.. ఇంట్లో ఉండి చూసుకోవాలంటే .. పొట్ట నిండదు!!

మాయదారి రోగం. బిడ్డ ను  తిండి తిననియ్యదు. నిద్ర పోనీదు.

ఆకలి బాధ ను తట్టుకోలేక బిడ్డ అరిచే అరుపులు ఆ తల్లి గుండె భరిచలేక పోయేందేమో?

నిద్ర పోలేక ఆ బిడ్డ పడే కష్టాన్ని చూడలేక పోయిందేమో ఆ తల్లి ప్రాణం..

ఆ బిడ్డ వేదనను చూడలేక ఆమె హృదయం ఎంత రోదించిందో?

ఆ బిడ్డకు ఆ బాధల నుండి శాశ్వతం గా విముక్తి ఇవ్వాలని నిర్ణయించుకొన్నదేమో!

ఆ పేగు బంధాన్ని శాశ్వతంగా తెంచుకోవాలని నిర్ణయించుకోవడానికి ఆ తల్లి గుండె పడ్డ వేదన ఎంతో?

గుండె ను బండ చేసుకొని.. ఆ బిడ్డను తన చేతులతో తనే “కాల్వ లోకి” తోసేసే దైర్యం చేయడానికి ఆ తల్లి అనుభవించిన క్షోభ ఎంతో?

బిడ్డ సుఖం కోసం, బిడ్డ పడే బాధ చూడ లేక.. బిడ్డను చంపేసు కొనేంత  ప్రేమేమో ఆ తల్లిది!

బిడ్డ పై ఆ  ప్రేమే ఇప్పుడు నేరమైంది.

ఆ బిడ్డతో పాటు తను కడతేరాలని మనసు ఉవ్విళ్లూ తున్నా ..

“మిగుల్చుకొన్న బిడ్డలను కాపాడే బాధ్యత” ను ఆ తల్లి హృదయం మరిచిపోలేదేమో?

బిడ్డను చంపుకొన్న తల్లిగా అయినా మిగలాలనే నిర్ణయించుకొన్నదంటే..

ఆ తల్లి నిర్ణయం వెనుక ఉన్న “విషాదం”, జీవచ్ఛవం లా బ్రతకడానికి నిర్ణయించుకొన్న ఆ తల్లి హృదయ “ఆక్రోశం”..

అర్ధం చేసుకోగలిగే హృదయం వైశాల్యం ఈ సమాజానికి ఉందా?

ఆ తల్లి ని తప్పు పట్టగలిగే నైతికత ఈ సమాజానికి ఉందా?

తల్లీ!! నీ ప్రేమ కు వందనాలమ్మా!!

.. శ్రీ వెంకట సూర్య ఫణి తేజ

RELATED ARTICLES

Most Popular

న్యూస్