Friday, March 29, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంరాయినయినా కాకపోతిని...

రాయినయినా కాకపోతిని…

How Rama became Lord Srirama:

నారదుడు- వాల్మీకి- త్యాగయ్య

పల్లవి:
లక్షణములు కల రామునికి ప్ర
దక్షిణ మొనరింతాము రారే…Iలక్షI

అనుపల్లవి:
కుక్షిని బ్రహ్మాండము లున్నవట వి
చక్షుణుడట దీక్షాగురుడట శుభ…Iలక్షI

చరణం:
లక్షణ లక్ష్యము గల శ్రుతులకు ప్రత్యక్షంబౌనట గురు
శిక్షుతుడై సభను మెప్పించు భక్తరక్షకుండౌనట
అక్షరస్థులైన భజనపరులకే అంతరంగుడౌనట
సాక్షియై వెలయు త్యాగరాజు పక్షుoడౌనట ముప్పది రెండు… Iలక్షI

త్యాగరాజు కీర్తనల్లో పెద్దగా ప్రచారంలో లేని కీర్తన ఇది. ఒక పల్లవి, అనుపల్లవి, ఒకే ఒక చరణంలో సమస్త వేదసారాన్ని బంధించడం త్యాగరాజుకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే అవి కచేరీల్లో పాడుకునే ఒట్టి స్వరాల కీర్తనలు కావు; వేదమంత్రార్థ ప్రతిపాదితాలయిన త్యాగోపనిషత్తులు అన్నారు. ఈ కీర్తనలో 32 లక్షణాలున్న రాముడి చుట్టూ ప్రదక్షిణలు చేద్దాం రమ్మంటున్నాడు త్యాగయ్య. ఆ లక్షణాలేమిటో చెప్పలేదు. చెప్పడు. అదే తమాషా. మనకు రుచి చూపించి వదిలేస్తాడు. అదేమిటో చెప్పు స్వామీ! అని మనమే వెంటపడాలి. లేదా…ఫలానా త్యాగయ్య రాముడికి 32 లక్షణాలన్నాడు…అవేమిటి? అని మనమే వెతుక్కోవాలి. ఆధ్యాత్మిక పరిభాషను పద్ధతిగా అన్వయించుకోవాలి. పల్లవి ఎత్తుగడలో లక్షణాలు అని మాత్రమే చెప్పి…కీర్తన చివరి మాటలో 32 లక్షణాలు అని స్పష్టంగా చెప్పడంలో త్యాగయ్య చాలా ఔచిత్యం పాటించాడు. పాడేప్పుడు ముప్పది రెండు లక్షణములు కల రాముడికి ప్రదక్షిణలు చేద్దాం రారండి అనే ముగించాల్సి వస్తుంది. రాశిపోసిన సకల సద్గుణాలకు, సల్లక్షణాలకు రాముడే లక్ష్యం. లక్షణ లక్ష్యమయిన శ్రుతులు- వేదాలకు ప్రతిరూపంగా రాముడిని త్యాగయ్య చూడగలిగాడు. మనకు చూపించగలిగాడు.

ఇంతకూ-
త్యాగయ్య చెబుతున్న రాముడి 32 గుణాలు ఎక్కడివి? ఏవి?

రామాయణం ప్రారంభంలోనే నారదుడిని వాల్మీకి అడిగిన ప్రశ్న ఇది.

“కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్|
ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః”

1. సకల సద్గుణసంపన్నుడు,
2. ఎట్టి విపత్కర పరిస్థితుల్లో తొణకని వాడు,
3. సామాన్య విశేష ధర్మాలు తెలిసినవాడు,
4. శరణాగతవత్సలుడు,
5. ఎట్టి క్లిష్టపరిస్థితుల్లో అయినా ఆడితప్పనివాడు,
6. నిశ్చలమైన సంకల్పం కలవాడు ఈ క్షణం భూమండలంలో ఎవరయినా ఉన్నారా?

“చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః|
విద్వాన్ కస్సమర్థశ్చ కశ్చ ఏక ప్రియదర్శనః|”

8. సదాచారసంపన్నుడు,
9. సకలప్రాణులకు హితం చేసేవాడు,
10. సకలశాస్త్ర కుశులుడు,
11. సర్వకార్యధురంధరుడు

తనదర్శనంతో అందరికీ సంతోషం గూర్చు మహాపురుషుడెవడు?

“ఆత్మవాన్ కో జిత క్రోధో ధ్యుతిమాన్ కః అనసూయకః|
కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే “

12. ధైర్యశాలి
13. క్రోధాన్ని (అరిషడ్వర్గాలను) జయించినవాడు,
14. శోభలతో విలసిల్లేవాడు,
15. ఎవ్వరిపైనా అసూయ లేనివాడు,
16. రణరంగంలో కుపితుడైతే…దేవాసురులను కూడా భయకంపితులను చేసే మహాపురుషుడు ఎవడు?

Greatness Lord Rama :

ఈ పదహారు గుణాలతో శోభిల్లే మనిషి ఈ క్షణాన, ఈ భూమండలం మీద ఎవరయినా ఉన్నారా? అన్న ప్రశ్నకు… ఓర్నాయనోయ్! ఇన్ని మంచి లక్షాణాలతో పుట్టినవాడు దొరకడం చాలా కష్టం…అయితే ఒకే ఒకడు ఉన్నాడు…అయోధ్యలో దశరథుడి కొడుకుగా పుట్టి పెరుగుతున్న రాముడు…అని మొత్తం రామాయణమంతా చెప్తాడు నారదుడు. అలా నారదుడి ద్వారా తెలుసుకున్న కథనే వాల్మీకి గ్రంథస్థం చేశాడు.

“ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైః శ్రుతః|
నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ|
బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మీ శ్రీమాన్ శత్రు నిబర్హణః|
విపులాంసో మహాబాహుః కంబు గ్రీవో మహాహనుః|
మహోరస్కో మహేష్వాసో గూఢ జత్రుః అరిందమః|
ఆజాను బాహుః సుశిరాః సులలాటః సువిక్రమః|”

1. మనోనిగ్రహం గలవాడు,
2. గొప్ప పరాక్రమవంతుడు,
3. మహాతేజస్వి,
4. ధైర్యశాలి,
5. జితేంద్రియుడు,
6. ప్రతిభామూర్తి,
7. నీతిశాస్త్ర కుశలుడు,
8. చిఱునవ్వుతో మితంగా మాట్లాడంలో నేర్పరి,
9. షడ్గుణైశ్వర్యసంపన్నుడు,
10. శత్రువులను సంహరించేవాడు,
11. ఎత్తైన భుజాలు గలవాడు,
12. బలిష్ఠమైన బాహువులు గలవాడు,
13. శంఖంలా నునుపైన కంఠం గలవాడు,
14. ఉన్నతమైన హనువులు (చెక్కిలి) గలవాడు,
15. విశాలమైన వక్షఃస్థలం గలవాడు,
16. బలమైన ధనుస్సు గలవాడు,


17. పుష్టిగా గూఢంగా ఉన్న సంధియెముకలుగలవాడు,
18. అంతశ్శత్రువులను అదుపు చేయగలవాడు,
19. ఆజానుబాహువు,
20. అందమైన గుండ్రని శిరస్సు గలవాడు,
21. అర్ధ చంద్రాకారంలో ఎత్తైన నొసలు గలవాడు,
22. ఏనుగులా గంభీరమైన నడక గలవాడు,

“సమః సమ విభక్తాoగః స్నిగ్ధ వర్ణః ప్రతాపవాన్|
పీన వక్షా విశాలాక్షో లక్ష్మీవాన్ శుభ లక్షణః|
ధర్మజ్ఞః సత్యసంధశ్చ ప్రజానాం చ హితే రతః|
యశస్వీ జ్ఞానసంపన్నః శుచిర్వశ్యః సమాధిమాన్|
ప్రజాపతి సమః శ్రీమాన్ ధాతా రిపు నిషూదనః|
రక్షితా జీవలోకస్య ధర్మస్య పరి రక్షితాI
రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా|
వేద వేదాఙ్గ తత్త్వజ్ఞో ధనుర్వేదే నిష్ఠితః
సర్వ శాస్త్రార్థ తత్త్వజ్ఞో స్మృతిమాన్ ప్రతిభానవాన్|
సర్వలోక ప్రియః సాధ్వదీనాత్మా విచక్షణః|”

23. అంతగా పొడవుగాని పొట్టిగాని గాక ప్రమాణమైన శరీరం గలవాడు,
24. సమానమైన కరచరణాది – అవయవ సౌష్ఠవం గలవాడు,
25. కనువిందు చేసే దేహకాంతి గలవాడు,
26. పరాక్రమశాలి,
27. పరిపుష్టమైన వక్షఃస్థలం గలవాడు,
28. విశాలమైన కన్నులుగలవాడు,
29. పొంకమైన అవయవాల పొందిక గలవాడు,
30. సాటిలేని శుభ లక్షణాలు గలవాడు,
31. ఆశ్రయించిన వారిని ఆదుకోవడమే పరమ ధర్మంగా కలిగినవాడు,
32. ఆడిన మాటను తప్పనివాడు

నారదుడు చెప్పిన రాముడి గుణాలు ఈ 32. మరికొన్ని కూడా వర్ణనలో తోడయి ఉన్నాయి. వాల్మీకి పదహారు అడిగితే నారదుడు 32 ఎందుకు చెప్పాడు? అని మనం జుట్లు పీక్కోవాల్సిన పనిలేదు. భక్తి సూత్రాలను నిర్వచించిన నారదుడికి వాల్మీకి సందేహాలకు ఎంత విస్తారంగా సమాధానం చెప్పాలో ఒకరు చెప్పాల్సిన పనిలేదు. అలా చెప్పడం వల్లే వాల్మీకి పులకించి, జన్మ చరితార్థం అయ్యేలా మనకు ఆది కావ్యం ఇచ్చాడు.

త్యాగరాజస్వామికి సంగీత శాస్త్ర రహస్యాలను బోధించినవాడు నారదుడే. నారదుడిచ్చిన “సంగీత స్వరార్ణవము” త్యాగయ్యకు దారి దీపం. అందుకే నారదగురురాయా! అంటూ నారద భక్తిని అనేక కీర్తనల్లో త్యాగయ్య ప్రస్తావించాడు. కాబట్టే నారదుడు చెప్పిన రాముడి 32 గుణాలు త్యాగయ్యకు శిరోధార్యం. ఆ గుణాల్లో కొన్ని మనకు అలవడినా జన్మ ధన్యం.

సీతారాముల కల్యాణానికి తెలుగు పేరంటం


“సీతారాముల కళ్యాణం చూతము రారండి
శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి.. 
సిరి కళ్యాణపు బొట్టును పెట్టి బొట్టును పెట్టి
మణి బాసికమును నుదుటను కట్టి నుదుటను కట్టి..
పారాణిని పాదాలకు పెట్టి
పెళ్ళికూతురై వెలసిన సీతా కళ్యాణం చూతము రారండి..
శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి

సంపగి నూనెను కురులను దువ్వి కురులను దువ్వి..
సొంపుగ కస్తూరి నామము తీర్చి నామము తీర్చి
చెంపకు వాసిగ చుక్కను పెట్టి
పెళ్ళికొడుకై వెలసిన రాముని కళ్యాణం చూతము రారండి

శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి
జానకి దోసిట కెంపుల ప్రోవై కెంపుల ప్రోవై
రాముని దోసిట నీలపురాశై నీలపురాశై
ఆణిముత్యములు తలంబ్రాలుగా
ఇరవుల మెరిసిన సీతారాముల కళ్యాణం చూతము రారండి
శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి”

సముద్రాల రాఘవాచార్య ఎన్నో గొప్ప పాటలు రాశారు. ఈ పాట సీతారాముల కళ్యాణానికి తెలుగు శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం. సుశీలమ్మ గొంతు అమృతం ఈ పాటకు తోడయ్యింది. మళ్లీ మళ్లీ వినాలనిపించే సంగీతం.

దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే. పాట వింటుంటే మనమే దగ్గరుండి సీతారాముల కళ్యాణం చేయిస్తున్నట్లుంటుంది. త్రేతాయుగంలో అయోధ్యలో జరిగిన ఆ జగదానందకారకుడి పెళ్లి ఇప్పుడు మన కళ్ల ముందు జరుగుతున్నట్లుంటుంది.

జనని జానకి తల్లి దోసిట్లో తలంబ్రాలు- ఎర్రటి కెంపులు. రాముడి దోసిట్లో తలంబ్రాలు- నీలపు రాశి. ఇందులో గొప్ప సౌందర్యాన్ని, చమత్కారాన్ని బంధించాడు సముద్రాల. ఎరుపు ప్రేమకు ప్రతిరూపం. సీతమ్మలో ముప్పిరిగొన్న ప్రేమకు దోసిట్లో తలంబ్రాలు ఎరుపెక్కాయి. కెంపులయ్యాయి. రాముడు నీలమేఘశ్యాముడు. ఆయన చేతిలో తలంబ్రాలు ఆయన వర్ణాన్ని పులుముకున్నాయి.

రాయినయినా కాకపోతిని!

పల్లవి:
రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా
బోయనైనా కాకపోతిని పుణ్యచరితము పాడగా
పడవనైనా కాకపోతిని స్వామికార్యము తీర్చగా
పాదుకైనా కాకపోతిని భక్తిరాజ్యము నేలగా

చరణం 1:
అడవిలోపల పక్షినైతే అతివ సీతను కాచనా
అందువలన రామచంద్రుని అమిత కరుణకు నోచనా
కడలి గట్టున ఉడతనైతే ఉడత సాయము చేయనా
కాలమెల్లా రామభద్రుని వేలిగురుతులు మోయనా

చరణం 2:
కాకినైనా కాకపోతిని ఘాతుకమ్మును చేయుచూ
గడ్డిపోచను శరము చేసె ఘనత రాముడు చూపగా
మహిని అల్పజీవులే ఈ మహిమలన్నీ నోచగా
మనిషినై జన్మించినానే.. మత్సరమ్ములు రేపగా
మదమత్సరమ్ములు రేపగా…

ఆరుద్ర రచన. కె వి మహదేవన్ సంగీతం. సుశీలమ్మ గానం. రామాయణ సారాన్ని మనకు ఎలా అన్వయించుకోవాలో తెలియజెప్పే గొప్ప పాట ఇది. రాయి, బోయ, పడవ, పాదుక, పక్షి, ఉడుత, కాకి, గడ్డిపోచలే తరించిపోయాయి. అల్పజీవులకే మహిమ సిద్ధించింది. మనుషులమై పుట్టి మదమత్సరాలతో ఏమీ సాధించలేకపోతున్నామని తెలుసుకోవడానికి ఉపయోగపడే పాట ఇది. ఎన్నిసార్లు విన్నా తనివి తీరని పాట ఇది. సకల ఆధ్యాత్మిక సాధనా మార్గాలకు దారిదీపం లాంటి పాట ఇది.

విశ్వనాథ రామాయణం

Greatness Lord Rama

“మరలనిదేల రామాయణంబన్నచో
నీప్రపంచక మెల్లనెల్ల వేళ
దినుచున్న యన్నమే దినుచున్న దిన్నాళ్ళు
తనరుచి బ్రతుకులు తనవిగాన
చేసిన సంసారమే సేయుచున్నది
తనదైన యనుభూతి తనదిగాన
తలచిన రామునే తలచెద నేనును
నాభక్తి రచనలు నావిగాన”

“వ్రాసిన రామచంద్రు కథ వ్రాసితివీవనిపించుకో వృథా
యాసముగాక కట్టుకతలైహికమా! పరమా యటంచు దా
జేసిన తండ్రియాజ్ఞయును జీవునివేదన రెండు నేకమై
నాసకలోహ వైభవ సనాథము నాథకథన్ రచించెదన్”

తెలుగు వాల్మీకి మన విశ్వనాథ సత్యనారాయణ. రామాయణ కల్ప వృక్షం ఆయన మనకిచ్చిన అనన్యసామాన్యమయిన గ్రంథం. ఇంతమంది ఇన్ని యుగాలుగా ఇన్ని రామాయణాలు రాస్తున్నారు కదా? మళ్లీ రామాయణమే ఎందుకు రాస్తున్నానంటే? అని ఆయనకు ఆయనే ప్రశ్న వేసుకుని…ఆయనే తిరుగులేని సమాధానం కూడా చెప్పుకున్నారు.

ఈ లోకం రోజూ తింటున్న అన్నమే తింటోంది. చేస్తున్న సంసారమే చేస్తోంది. తన రుచి తనది. అలా నాదయిన భక్తి రచన నాది కాబట్టి తలచిన రాముడినే తలచుకుంటాను…రాస్తే రాముడి కథ రాసి నిలబడు…పాడు కట్టు కథలు దేనికి? అని మా నాన్న చెప్పిన మాట; నాలో జీవుడి వేదన రెండూ కలగలిసి రాముడినే స్మరిస్తున్నాను…అని రామాయణం తెలుగుసేత మొదలుపెట్టారు విశ్వనాథ.

Greatness Lord Rama

శ్రీరామనవమి పూట-
నారదుడు వాల్మీకికి చెప్పిన ఆ ముప్పయ్ రెండు లక్షణాలు గల రాముడి చుట్టూ త్యాగయ్యతో పాటు మనం కూడా ప్రదక్షిణ చేద్దాం. సముద్రాలతో పాటు పెళ్లి పెద్దగా దగ్గరుండి సీతారాముల దోసిళ్లకు ఆణిముత్యాల తలంబ్రాలు అందిద్దాం. రామపాదం రాక రాళ్లమై పడి ఉన్నాం కాబట్టి…మదమాత్సర్యాలను వదిలించుకుని…రామ పాదుకలమయినా అయి భక్తి రాజ్యాలను ఏలుదాం. విశ్వనాథ చెప్పినట్లు రోజూ తినే అన్నమే అయినా…మళ్లీ మళ్లీ అదే తింటున్నాం కాబట్టి…రోజూ అదే రాముడిని మళ్లీ మళ్లీ తలచుకుందాం.

(“త్యాగరాజు కీర్తనల్లో భక్తి తత్త్వం” అన్న అంశంపై పి హెచ్ డి చేసిన మా నాన్న పమిడికాల్వ చెంచు సుబ్బయ్య ఇచ్చిన సమాచారం ఆధారంగా…)

శ్రీరామనవమి శుభాకాంక్షలతో…

-పమిడికాల్వ మధుసూదన్

ఇవి కూడా చదవండి:

మేనేజ్మెంట్ పాఠం

ఇవి కూడా చదవండి:

యాంగర్ మేనేజ్ మెంట్

 

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్