Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఅన్నమయ్య పద చిత్రాలు

అన్నమయ్య పద చిత్రాలు

పల్లవి:-
వీధుల వీధుల విభుడేగీ నిదే
మోదము తోడుత మొక్కరో జనులు
॥వీధుల॥

చరణం-1
గరుడధ్వజ మదె కనకరథం బదె
అరదముపై హరి యలవాడె
యిరుదెసల నున్నారు యిందిరయు భువియు
పరగ పగ్గములు పట్టరో జనులు
॥వీధుల॥

చరణం-2
ఆడే రదివో అచ్చరలెల్లరు
పాడేరు గంధర్వపతులెల్లా
వేడుకతో వీడె విష్వక్సేనుడు
కూడి యిందరును కొలువరో జనులు
॥వీధుల॥

చరణం-3
శ్రీవేంకటగిరి శిఖరము చాయదె
భావింప బహువైభవము లవే
గోవింద నామపు ఘోషణ లిడుచును
దైవం బితడని తలచరో జనులు
॥వీధుల॥

తాళ్ళపాక అన్నమాచార్యుల వేన వేల కీర్తనల్లో బహుళ ప్రచారంలో ఉన్న కీర్తన ఇది. అన్నమయ్య కీర్తనలకు తన గాత్రం ద్వారా మరింత మాధుర్యం అద్దిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గానం.

తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్నమయ్య కళ్లతో ఒక్కసారి ఆ వైభవాన్ని చూడడానికి ఈ కీర్తనను సాధనంగా చేసుకుందాం.

ఎవరయినా ఒక విషయం మీద రెండో సారి చెబితే విషయం చర్విత చర్వణంగా మనకు చప్పగా ఉంటుంది. అవే పడికట్టు పదాలు, అవే భావనలు. ఆ విషయం మీద వారెలా మాట్లాడతారో మనమే చెప్పేయగలుగుతాం. అలాంటిది జీవితకాలంలో పదహారో ఏట మెదలు పెట్టి 94 ఏట తుది శ్వాస వదిలేవరకు అన్నమయ్య రాసి…పాడిన కీర్తనలు అక్షరాలా ముప్పయ్ రెండు వేలు. పోయినవి పోగా మనకు దొరికినవి 14,800. ఇవి కాక సంకీర్తన లక్షణ శాస్త్రం, ఇతర శతకాలు కూడా రాసినట్లు అన్నమయ్య మనవడు చినతిరుమలాచార్యులు స్పష్టంగా చెప్పాడు.

ప్రతి కీర్తనలో వెంకటేశ్వర స్వామే వర్ణనీయ వస్తువు. అలా రోజుకొక కీర్తన, కొన్ని సార్లు రోజుకు రెండు, మూడు కీర్తనలు రాస్తూ 32,000 కీర్తనలు దేనికది ప్రత్యేకం. ఎత్తుగడ భిన్నం. ముగింపు భిన్నం. భావన వైవిధ్యం. మాటల పొందిక ప్రత్యేకం. మనం ఈరోజుల్లో పంచ్ డైలాగులు అని చెప్పుకున్నట్లుగా తెలుగు భాషకు అన్నమయ్య పల్లవులన్నీ శాశ్వతమయిన పంచ్ డైలాగులే.

ఒక్క అన్నమయ్య వల్ల తెలుగు భాష ఎంత సుసంపన్నమయ్యిందో చెబితే దానికదిగా ఒక సాహిత్య చరిత్రే అవుతుంది. నీ వలన నాకు పుణ్యము- నా వలన నీకు కీర్తి అని సాక్షాత్తూ వెంకన్నతోనే అన్నమయ్య చనువుగా అన్నాడు. వెంకన్న కాదనలేదు. అన్నమయ్య లాంటివారు ప్రపంచ సాహిత్య చరిత్రలో అన్నమయ్యకు ముందు లేరు, ఇక ముందు పుడతారన్న నమ్మకమూ లేదు.

శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞాన సారంబులై
యతి లోకాగమ వీధులై వివిధ మంత్రార్థంబులై నీతులై
కృతులై వెంకట శైల వల్లభ రాత్రిక్రీడా రహస్యంబులై
నుతులై తాళులపాక అన్నయ వచో నూత్న క్రియల్ చెన్నగున్”

అని అన్నమయ్య మనవడు చిన తిరుమలాచార్యులు చెప్పినట్లు అన్నమయ్య ఒక్కో కీర్తన ఒక్కో కావ్యంతో సమానం. ఇంతటి సంకీర్తనా చార్యుడిని తన కోసం వెంకన్నే పుట్టించి తెలుగు భాషను మంత్రమయం చేశాడు.  ఇప్పుడంటే మనం అన్నమయ్య కీర్తలను పరవశించి గానం చేస్తున్నాం. అందులో సాహితీ వైభవాన్ని విశ్లేశిస్తున్నాం. మంతార్థాలను వ్యాఖ్యానిస్తున్నాం. జానపద శైలుల జాజరాలకు మురిసిపోతున్నాం. మాండలికపు మాధుర్యానికి పొంగిపోతున్నాం. అదివో అల్లదివో అంటూ అన్నమయ్య చూపిన తిరుమలనే కనులారా చూస్తున్నాం. వినరో భాగ్యము విష్ణుకథ అని అన్నమయ్య వినిపించిన విష్ణు కథనే చెవులారా వింటున్నాం. అన్నమయ్య సాహిత్యానికి కొత్త కొత్త బాణీలు కూడా కడుతున్నాం. కానీ, ఇంతటి గొప్ప సాహిత్యం కనీసం మూడువందల యాభై ఏళ్ళకు పైబడి తిరుమల గోపురం గూట్లో మట్టి కప్పుకొని మౌనంగా ఉండిపోయింది. 1922 నుండి ఈ కీర్తనలు వెలుగులోకి రావడం మొదలయ్యింది. తొలి రోజుల్లో సాధు సుబ్రమణ్య శాస్త్రి ఆపై వేటూరి ప్రభాకర శాస్త్రి, రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ ఆ రాగి రేగులను అధ్యయనం చేసి కీర్తన ప్రతులను లోకానికి అందించారు.

గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ అన్నమయ్య కీర్తనలను గానం చేయడానికే పుట్టినవారు. నా శ్రేయోభిలాషి. నాకు అత్యంత ఆప్తులు. కొన్నేళ్లుగా అన్నమయ్య సాహిత్యంలో సందేహాలుంటే మా నాన్న తరువాత నేను వారినే సంప్రదిస్తుంటాను.ఇప్పుడు మా నాన్న లేరు కాబట్టి ఈ విషయంలో వారే పెద్ద దిక్కు. అన్నమయ్య సాహిత్యం చాలా వైవిధ్యమయినది. జనం భాషగా తేలిగ్గా ఉన్నా…మంత్రార్థాలు, అప్పటి మాండలికాలు, అప్పటి కడప మండలం పొత్తపినాటి ఉచ్చారణ అయిన చేసీని…చూసీనీ...లాంటి మాటలు తెలిస్తే తప్ప…ఆ అందం పలికించలేరు. ఆ విషయంలో బాలకృష్ణప్రసాద్ గారి తపన, కృషి చాలా గొప్పది. వారి గాత్ర వైభవంలో మనకు దొరికిన అన్నమయ్య గురించి నాకు అర్థమయినంతవరకు విడిగా మరో వ్యాసం రాస్తాను.

ఈ కీర్తనలో- అన్నమయ్య మనకు బ్రహ్మోత్సవ రథోత్సవాన్ని చూపిస్తున్నాడు. ఇది పదం కాదు- పద చిత్రం. శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం.

తిరుమల వీధుల్లో వెంకన్న కలియదిరుగుతున్నాడు. పొంగిపోయి మొక్కడమే మనం చేయాల్సిన పని. గరుడధ్వజం ఉన్న బంగారు రథం మీద ఇరుపక్కల శ్రీదేవి భూదేవి ఉండగా స్వామి ఊరేగుతున్నాడు. పట్టుకోండి ఆ తేరు పగ్గాలు.

యక్ష కిన్నెర కింపురుష సిద్ధ సాధ్య గంధర్వ దేవతలందరూ పరవశించి పాడుతున్నారు. ఆడుతున్నారు. ఇదిగో విషక్సేనుడు కూడా వేడుకల్లో మునిగి తేలుతున్నాడు.

బహు వైభవాల
సప్తగిరి శిఖరాలు…అదివో!
కనపడుతున్నాయా?
భక్తుల గోవింద నామాల ఘోషలు అల్లదివో!
వినపడుతున్నాయా?

మీరు తెలుగువారయితే…మీకు తెలుగు అర్థమయితే…అన్నమయ్యను వింటే…మీ కళ్ల ముందు కనిపించే బ్రహ్మాండనాయకుడి బ్రహోత్సవ దృశ్యాన్ని దేవుడే దిగివచ్చినా చెరిపేయలేడు.

అది-
కట్టెదుట వైకుంఠము కాణాచయిన
అన్నమయ్య ఆవిష్కరించిన తిరుపదముల కొండ. వేదములే శిలలై వెలసిన కొండ. యుగయుగాల విష్ణువిద్యకు అచ్చతెలుగు అండాదండ.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్