పశ్చిమాసియాలో రగులుతున్న మంటతో అమాయకులు సమిధలవుతున్నారు. మతోన్మాదుల దుశ్చర్యతో రక్తం ఏరులై పారుతోంది. హమాస్ ఉగ్రదాడితో కలవరానికి గురైన ఇజ్రాయిల్ భీకర దాడులతో జులు విదిల్చింది. ఈ దఫా ఇజ్రాయల్ – పాలస్తీనా సమస్య ప్రపంచానికి చుట్టుకునేలా ఉంది. అరబ్బు దేశాలతో ఇజ్రాయల్ దౌత్య సంబంధాలు బలపడటం ఇష్టంలేని ఇరాన్, టర్కీ, లెబనాన్ దేశాలు హమాస్ తో ఈ ఘాతుకానికి ఒడిగట్టాయని అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు.
హమాస్ ఉగ్రమూకలను ఏరివేసేందుకు రంగం సిద్దం చేసిన ఇజ్రాయల్ చతురంగ బలగాల్ని గాజా సరిహద్దుల్లో మోహరించింది. ఇదే తరుణంలో గాజాలో ఆస్పత్రి మీద దాడి ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. వందల మంది చావుకు మీరంటే మీరు కారణమని హమాస్ – ఇజ్రాయల్ ఆరోపణలు చేసుకుంటున్నాయి.
అసలు కారకులు ఇస్లామిక్ జిహాద్ గ్రూప్ అని అనుమానిస్తున్నారు. ఇస్లామిక్ జిహాద్‌ను అధికారికంగా పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ అంటారు. ఇది సున్నీ ఇస్లామిస్ట్ టెర్రర్ గ్రూపు. పాలస్తీనా స్థావరాలను ఆక్రమిస్తున్న ఇజ్రాయిలీలపై పోరాటం కోసం ఈ గ్రూపును ఏర్పాటు చేశారు. స్వాతంత్య్ర పాలస్తీనా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడమే ఆ గ్రూపు లక్ష్యం. 1970 దశకంలో పీఐజేను స్థాపించారు. పాలస్తీనాలోని సాయుధ దళాల్లో ఈ గ్రూపును అత్యంత రాడికల్‌గా భావిస్తారు.
ఇజ్రాయల్ ను అంతర్జాతీయంగా అప్రతిష్ఠ పాలు చేసేందుకు ఇస్లామిక్ జిహాద్ గ్రూప్ దారుణానికి ఓడిగట్టిందని ప్రాథమిక అంచనా. యూదు బలగాలు గాజాలోకి వస్తే హమాస్ సొరంగ మార్గాలు బయటపడతాయి. ఉగ్రవాదుల అంతమే లక్ష్యంగా వస్తున్న సైన్యం ఎంతకైనా తెగిస్తుంది.
హమాస్ ను కాపాడి…అంతర్జాతీయంగా దృష్టి మళ్ళించేందుకు గాజా ఆస్పత్రి దాడి కుట్ర జరిగింది. నిన్న మొన్నటి వరకు హమాస్ ఉగ్రవాదులను అంతం చేయాలన్న గొంతులు… ఇప్పుడు పాలస్తీనా ఆక్రందనలు అని కొత్త పల్లవి అందుకున్నాయి. ఈ మార్పు కోసమే మతోన్మాదులు వారికి మద్దతు ఇస్తున్న ఇరాన్, టర్కీ దేశాలు వేచి చూస్తున్నాయి.
హామాస్ – ఇజ్రాయల్ సమస్యను అంతర్జాతీయ సమస్యగా మార్చేందుకు వీళ్ళు కుట్ర చేస్తున్నారు. గాజాలోకి ఇజ్రాయిల్ బలగాలు అడుగుపెట్టగానే… దాన్ని సాకుగా చూపి ఇరాన్, టర్కీ, జోర్డాన్ దేశాలు నేరుగా యద్ధానికి దిగటం… ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్ దేశాలు తెరచాటు మంత్రాంగం చేసేందుకు సిద్దంగా ఉన్నాయి.
చైనా దన్నుతోనే ఈ దేశాలు కయ్యానికి కాలు దువ్వుతున్నాయని… ఇజ్రాయల్ మీద దాడికి ఉత్తర కొరియాకు చెందిన ఎఫ్-7 రాకెట్ గ్రేనేడ్లను హమాస్ వాడినట్లు తెలుస్తోంది. హమాస్‌కు చెందిన కొన్ని ఆయుధాలను ఇజ్రాయిల్ సీజ్ చేసింది. దానికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. అయితే ఆయుధ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. హమాస్ ఉగ్రవాదులు ఉత్తర కొరియాకు చెందిన ఎఫ్-7 రాకెట్ గ్రేనేడ్లను వాడినట్లు తెలుస్తోంది. భుజంపై నుంచి కాల్చే ఆ ఆయుధాలను సాధారణంగా ఆర్మీ వాహనాలను పేల్చేందుకు వాడుతుంటారు.
ఎవరు ఏమనుకున్నా ఇజ్రాయల్ తగ్గేట్టుగా కనిపించటం లేదు. మనుగడ కోసం పోరాటం(struggle for existence)అన్న రీతిలో శత్రువును తుదముట్టించడానికి ముందుకు కదులుతోంది.
-దేశవేని భాస్కర్