Monday, January 27, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంశిథిలాలనుండి శిఖరాలకు- 4

శిథిలాలనుండి శిఖరాలకు- 4

చదువంటే ఐ ఐ టీ లో సీటు సంపాదించడం. చదువంటే నీట్ కోటగోడ దాటి వైట్ కోట్ వేసుకోవడం. చదువంటే సాఫ్ట్ వేర్ ఉద్యోగం సంపాదించడం. చదువంటే వందకు వంద మార్కులు సాధించడం. చదువంటే ఆలిండియా ఒకటో ర్యాంక్ సాధించి పేపర్లో అంకె పక్కన అనామకంగా మిగిలిపోవడం. చదువంటే సామాజిక చైతన్యం కోల్పోయి పుస్తకాల పురుగులు కావడం. చదువంటే రెక్కలు కట్టుకుని విదేశాలకు వెళ్ళిపోవడం. ఇంతకు మించి చదువుకు అర్థం- పరమార్థం లేని కాలంలో ఉన్నాం కాబట్టి కాలానికి ఎదురీది జీవనరంగంలో నిలబెట్టేది చదువు కానే కాదనుకుంటున్నాం.

ఇంటినుండి వెయ్యి రూపాయలతో వచ్చేసిన మున్నూరు నాగరాజు ముసురుకున్న ఆలోచనలతో హుబ్లీలో దిగి…టెలిఫోన్ బూత్ కు వెళ్ళి సదాశివపేటలో తను పనిచేసిన బట్టలషాపు యజమాని బంధువు హుబ్లీలో ఉంటున్న సంతోష్ కు ఫోన్ చేశాడు. సంతోష్ ఎం బి ఏ పూర్తి చేసి కోకాకోలా కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నాడు. కోకాకోలా కంపెనీలో నెలకు మూడు వేలరూపాయల జీతంతో సేల్స్ మ్యాన్ ఉద్యోగం ఇప్పించాడు సంతోష్. ఇక్కడిదాకా చాలామందికి ఎదురయ్యే అనుభవమే.

ఇక్కడినుండి నాగరాజు అందుకున్న వేగమే అనూహ్యం. కొద్దిరోజులకే కన్నడ నేర్చుకున్నాడు. కర్ణాటక- మహారాష్ట్ర సరిహద్దుల్లో తిరుగుతూ మరాఠీ నేర్చుకున్నాడు. హిందీ ఇంగ్లిష్ సరేసరి. పైవారి దృష్టిలో పడ్డాడు. ప్రమోషన్లు త్వరగా తెచ్చుకోగలిగాడు. కొన్నాళ్ళకు బ్రిటానియా కంపెనీలో ఇంకా మెరుగైన ఉద్యోగం రావడంతో బెంగళూరుకు మకాం మార్చాడు. ప్రపంచం మరింత పెద్దదయ్యింది. “కోటీశ్వరుడు కావడం ఎలా?” అన్న ప్రశ్న మాత్రం వికారాబాద్ లో రైలెక్కినప్పటినుండి నాగరాజును వెంటాడుతూనే ఉంది. పుస్తకాలు చదువుతున్నాడు. జీవితాలను చదువుతున్నాడు. కంపెనీల ఆర్థిక పాఠాలను చదువుతున్నాడు. స్టాక్ మార్కెట్ పాఠాలను చదివాడు. స్టాక్స్ లో పెట్టుబడులు పెట్టి నష్టపోకుండా జాగ్రత్తగా లాభాలు రాబట్టుకున్నాడు. జీవితమంతా ఉద్యోగిగా పనిచేస్తూ ఉండకుండా తన జీవిత లక్ష్యమైన “వందకోట్ల సంపాదన లక్ష్యం” వైపు అడుగులు వేయడానికి హాయిగా ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేసి సదాశివపేట వచ్చేశాడు.

ఆర్గానిక్ ఉత్పత్తుల వ్యాపారం ప్రారంభించాడు. చేతులు కాల్చుకున్నాడు. జనానికి ఆరోగ్యం కంటే రుచి ముఖ్యమని గ్రహించి మాంసం అమ్మే గొలుసుకట్టు దుకాణాలు ప్రారంభించాడు. డబ్బులు లెక్కపెట్టుకోవడానికి ఇప్పుడు నాగరాజుకు తీరికలేదు. “వంద కోట్ల లక్ష్యంలో ఎంతదాకా వచ్చావు?” అని నేను గుచ్చి గుచ్చి అడిగాను. ఏ సంవత్సరానికి ఎంత సంపాదించాలనుకున్నానో అంతకంటే ముందే ఆ నంబర్లు దాటేశాను అని స్పష్టంగా సమాధానమిచ్చాడు. బహుశా వందలో సగం దాటేసినట్లున్నాడు. ఒకస్థాయి వరకే సున్నాలకు లెక్క. తరువాత సున్నాలే సున్నాలను కలుపుకుంటూ ఉంటాయి.

“ధనవంతులు అవ్వాలంటే తెలుసుకున్న పాఠాలలో మొదటిది- ఒకటికన్నా ఎక్కువ ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదించడం. రెండవది- ఆ సంపాదించిన డబ్బును ఆదాయాన్ని అందించే సామర్థ్యం ఉన్న ఆస్తులను కొనుగోలు చేయడానికి లేదా ఆ ఆస్తులలో పెట్టుబడి పెట్టడానికి ఉపయోగించడం. మూడవది- ఈ పనులన్నింటిని ఎలా చేయాలి అని నిర్దేశించే ఆర్థిక ప్రణాళికతో కూడిన వ్యూహాన్ని రూపొందించుకోవడం” అని నాగరాజు ఒక నవీన “ఎస్ సి ఆర్-ప్లాన్” సూత్రాన్ని ఆవిష్కరించి…ఈ సూత్రాన్ని తన మీద తానే ప్రయోగించుకొని ఫలితం రాబట్టుకున్నాడు.

ఎస్- సేఫ్టీ
సి- కంఫర్టబుల్
ఆర్- రిచ్

ఇందులో మీకు ఏదైనా ఒకటే కావాలో లేక అన్నీ కావాలో మీరే నిర్ణయించుకుని…కోటీశ్వరులు అవ్వకుండా ఎప్పటికీ సేఫ్టీ జోన్లో గిరిగీసుకుని ఉంటారో! కొంచెం వెసులుబాటు ఉన్న కంఫర్టబుల్ జోన్లోకి వస్తారో! ఇంకా పైకి ఎగబాకి రిచ్ జోన్లోకి వస్తారో! మీకు మీరే నిర్ణయించుకోండి.

మీరు ప్రయత్నం మొదలుపెడితే నాగరాజుకు దొరికిన సంతోష్ లు మీకూ దొరకకపోరు. అప్పుడు మీముందు నాగరాజు చాలా చిన్నవాడు అవుతాడు.
ఆల్ ది బెస్ట్.

(“ఆలోచన మారితే జీవితం మారుతుంది” పుస్తకంలోనుండి మున్నూరు నాగరాజు స్వీయ అనుభవాలు ప్రస్తావించాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి కానీ…అన్నీ చెబుతూ పోతే పుస్తకం మొత్తాన్ని ఎత్తి రాయాలి. ప్రస్తుతానికి ఇది చాలు)

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

న్యూస్