Saturday, January 25, 2025

మన భాష- 13

సంస్కృతం నుండి మాటలు తెలుగులోకి వచ్చినప్పుడు కొన్ని మార్పులు పొందుతాయి. సంస్కృతమే కాదు ఏ భాష నుండి మరే భాషలోకి పదాలు వెళ్ళినా ఆ భాషా స్వభావానికి అనుగుణంగా కొన్ని మార్పులు పొందితీరుతాయి. సంస్కృతంలో ప్రతి పదమూ ప్రత్యయాంతమై ఉంటుంది. అంటే పదం చివర ప్రత్యయం ఉంటుంది. ఉదాహరణకు ఏదైనా ఒక నామవాచకాన్ని తీసికొన్నామనుకోండి. ఆ నామవాచకం ప్రథమావిభక్తిలో ఉందా మరేదైనా విభక్తిలో ఉందా, పుంలింగమా, స్త్రీలింగమా, నపుంసకలింగమా, ఏక వచనంలో ఉందా, ద్వివచనంలో ఉందా, బహువచనంలో ఉందా అన్నదాన్ని బట్టి దాని రూపం ఉంటుంది. విభక్తి, లింగం, వచనం తెలిపే ప్రత్యయం పదం చివర ఉంటుందన్నమాట. ఈ ప్రత్యయంతో ఉన్నపదాన్ని తెలుగులోకి యథాతథంగా తెచ్చుకోము కదా. ఆ మాటను తెలుగువాక్యంలో తెలుగు మాటలాగా వాడుకోవాలి. అందుకోసం ఆ మాటకు తెలుగు ప్రత్యయం చేర్చుకోవాలి. లేకపోతే తెలుగుమాటల రూపం కల్పించుకోవాలి.

సంస్కృతంలో ఒక పదం పుంలింగమా, స్త్రీలింగమా, నపుంసక లింగమా అనేది పదం స్వరూపం మీద ఆధారపడి ఉంటుంది. అర్థానికి సంబంధం లేదు. దారా అంటే భార్య. ఇది పుంలింగం. భార్య అనేమాట స్త్రీలింగం. కళత్రం అన్నా భార్యే. ఇది నపుంసకలింగం. వృక్ష శబ్దానికి చెట్టు అని అర్థం. ఇది పుంలింగం. నాసిక అంటే ముక్కు ఇది స్త్రీ లింగం. విద్యా అంటే చదువు. ఇది స్త్రీలింగం. మిత్ర శబ్దం నపుంసకలింగం.

తెలుగులో లింగం అర్థాన్ని బట్టి ఉంటుంది. పురుషుణ్ణి బోధించే పదాలను మహత్తులనీ, తక్కినవాటిని అమహత్తులనీ అంటాం. సంస్కృతంలో పుంలింగం అయి ఉండీ పురుషుణ్ణి బోధించని మాట తెలుగులో అమహత్తే అవుతుంది. సంస్కృతంలో నపుంసక లింగమయినా పురుషుణ్ణి బోధించేదయితే తెలుగులో మహత్తు అవుతుంది. ఈ కారణాలవల్ల సంస్కృత పదాలు తెలుగులో మార్పులను పొందుతాయి.

సంస్కృతం నుండి తెలుగులోకి వచ్చిన పురుషవాచకశబ్దాల చివర ‘డు’ ప్రత్యయం చేరుతుంది. రాముడు, కృష్ణుడు, భీముడు మొదలయిన పేర్లెన్నయినా చూపవచ్చు. ఇది అకారాంత శబ్దాలలో జరుగుతుంది. ‘రామ’కు ‘డు’ చేరి రామ లో మకారం మీది అత్వం ఉత్వం కావడం వల్ల రాముడు ఏర్పడుతుంది. ప్రాచీనకాలపు శాసనాలలో రామండు, భీమండు వంటి రూపాలు కూడా కనిపిస్తాయి. పదం చివరి ‘అ’, ‘ఉ’గా మారి ‘డు’ చేరని రూపాలు కూడా కనిపిస్తాయి. ఉదాహరణకు పండరంగు.

పూర్వం మనవాళ్ళ పేర్లు అయ/అయ్య, అన/అన్న, అప/అప్ప వంటి అనుబంధ పదాలతో కూడి ఉండేవి. నన్నయ, తిక్కన, కేతన, మారన, ఎర్రన, సోమన వంటి మన కవుల పేర్లు ఇందుకు ఉదాహరణలు. అధర్వణుడు, భాస్కరుడు, శ్రీనాధుడు, రామభద్రుడు, రామరాజభూషణుడు వంటి పేర్లు తరువాతి కాలంలో ప్రచారంలోకి వచ్చినా ఇప్పటికీ అయ్య/అన్న/అప్పలతో అంతమయ్యే పేర్లే ఎక్కువ.

కందుకూరి వీరేశలింగం పంతులుగారి ‘రాజశేఖర చరిత్ర’ నవలలోని నాయకుడు రాజశేఖరుడు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో డు ప్రత్యయాంతమయిన పేర్లు పెట్టుకుంటూనే ఉన్నారు. రాముడు, లక్ష్మణుడు, చక్రధరుడు వంటి పేర్లు కనిపిస్తూనే ఉంటాయి. యనమల రామకృష్ణుడు గారి పేరు ఇందుకు మంచి ఉదాహరణ. రామకృష్ణయ్య, రామకృష్ణప్ప, రామకృష్ణరావు, రామ కృష్ణశర్మ, రామకృష్ణమూర్తి, రామకృష్ణశాస్త్రి, రామకృష్ణుడు మొదలయిన విధంగా పేర్లు పెట్టుకోవచ్చు. కాని ఇప్పుడు రామకృష్ణ, రామచంద్ర, నారాయణ, కృష్ణ వంటి పేర్లు ఎక్కువగా కనిపిస్తు న్నాయి. శ్రీనివాస్, శంకర్, లక్ష్మణ్, ప్రసాద్ వంటి హలంతమయిన పేర్లు కూడా ఎక్కువవు తున్నాయి. ప్రసాద్ ని అజంతం చేసి ప్రసాదు అంటున్నాం. ప్రసాదం, ప్రసాదరావు, ప్రసాదుడు మొదలయిన వాటికి ముందు సామాన్యంగా ‘వర’ అనేమాట ఉంటుంది. వరప్రసాదం, వర ప్రసాదరావు, వరప్రసాదుడులాగా. ఎవరి వరం? అని ప్రశ్నించుకుంటే సత్యనారాయణ వర ప్రసాద్, కృష్ణవరప్రసాద్, వీరవేంకటసత్య వరప్రసాద్ వంటి పేర్లలో సమాధానం కనిపిస్తుంది. వర లేకుండా కేవలం కృష్ణప్రసాద్, రాంప్రసాద్, శివప్రసాద్, దుర్గాప్రసాద్ అని కూడా ఉంటాయి. ప్రసాదు అన్న మాటను సంక్షిప్తలేఖనంగా కొంతకాలం కిందట చమత్కరించిన వాళ్ళూ లేకపోలేదు.

ఏది ఏమయినా అయ్య/అన్న/ అప్ప/రావు/రెడ్డి/ నాయుడు/ శర్మ/ శాస్త్రి/ మూర్తి/ చౌదరి/ బాబు/ ఆచార్యులు వంటి అనుబంధ పదాలు కాని ‘డు’ ప్రత్యయం కాని లేని ఇటువంటి పేర్లు మన భాషకు సహజమయినవి కావేమో.

‘డు’ ప్రత్యయం లేకుండా గౌరవార్థకంగా బహువచన ప్రత్యయం ‘లు’ చేర్చి పేరు పెట్టుకొనే పద్ధతి కూడా ఉంది. శ్రీరాములు, వేంకటేశ్వర్లు, ఆంజనేయులు, శ్రీనివాసులు వంటి పేర్లు ఇటువంటివి.

పై మాటలన్నీ పేర్లకు సంబంధించినవి. ఇవి కాకుండా ‘డు’ ప్రత్యయం చేరేమాటలెన్నో ఉన్నాయి. నాయకుడు, భక్తుడు, వీరుడు, ధీరుడు, బుద్ధిమంతుడు, శక్తిమంతుడు, జ్ఞానవంతుడు, సాహసికుడు, బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు, వైద్యుడు, ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు, ఆచార్యుడు మొదలైనవన్నీ ‘డు’ ప్రత్యయం చేరి తత్సమాలయిన శబ్దాలే.

మంచినడవడి కలవాడు సచ్చరిత్రుడు, చెడు నడవడి కలవాడు దుశ్చరిత్రుడు. విమర్శ చేసేవాడు విమర్శకుడు. సమీక్ష చేసేవాడు సమీక్షకుడు. సభలో పాల్గొనేవాడు సభ్యుడు. ఇప్పుడు చాలామంది ఈ అర్థంలో వాడుతూ ఉన్న ‘సభికుడు’ అన్న మాటకు జూదగాడు అని అర్థం. సభ్యుడు, సదస్యుడు, సభాసదుడు అన్నమాటలు వాడవచ్చు. నటించేవాడు నటుడు. దర్శనం తెలిసినవాడు దార్శనికుడు. ఇట్లా అసంఖ్యాకంగా పదాలు ఏర్పరచుకోవచ్చు.

(ఇందులో వాడిన ఫోటోలు “FAMILY THINGS, Kasturi Venugopal ” యూట్యూబ్ వి. వారికి కృతఙ్ఞతలు)

-డి. చంద్రశేఖర రెడ్డి
98661 95673

రేపు:-
మన భాష- 14
భాషల పరస్పర ప్రభావం

RELATED ARTICLES

Most Popular

న్యూస్