Monday, January 27, 2025

మన భాష- 4

మాతృభాష మాట్లాడడంలో ఎవరికీ కష్టం ఉండదు. ప్రతి వ్యక్తీ తన సామాజిక పరిధిలో భాషను తన అవసరాలకు అనుగుణంగా ఉపయోగించగలడు. కాని కొన్ని ప్రత్యేక పరిస్థితులలో భాషను అందరూ ఒకేవిధంగా ప్రయోగించలేరు. మామూలుగా బాగా మాట్లాడే వ్యక్తి వేదికనెక్కి మాట్లాడవలసివస్తే నోటమాటరాకపోవచ్చు. ఇటువంటి పరిస్థితికి సభాకంపం ఒక కారణమయితే, తను సరిగా మాట్లాడుతున్నాడో లేదోనన్న అనుమానం మరో కారణం. మాట్లాడడంలో ఏ సమస్యా లేనివారికి రాసేటప్పుడు సమస్యలు వస్తాయి. రాసేభాషకూ మాట్లాడే భాషకూ తేడా ఉండడమే దీనికి కారణం. ప్రతిభాషలోనూ ఈ తేడా ఉంటుంది.

తల్లిదండ్రులనుండీ, పరిసరాలనుండీ పిల్లలు భాష మాట్లాడడం సహజంగా నేర్చుకుంటారు. రాయడం ఇలా అప్రయత్నంగా వచ్చేది కాదు. ప్రయత్నించి నేర్చుకోవాలి. ప్రయత్నించి నేర్చుకొనే ఏ విషయమయినా ఎంత నేర్చుకుంటామన్నది నేర్చుకొనే వ్యక్తి అవస రాన్నిబట్టి, సామర్ధ్యాన్నిబట్టి ఉంటుంది. పూర్వం చదువుకున్న వాళ్ళు అంటే గురువుద్వారా ఏదో ఒక శాస్త్రాన్ని అధ్యయనం చేసినవాళ్ళు. వాళ్ళకు రాయడమూ, చదవడమూ రాకపోయినా పండితులే. కాని ఇప్పుడు చదువుకున్నవాళ్ళు అంటే రాయడమూ, చదవడమూ వచ్చినవాళ్ళని అర్థం. సంతకం పెట్టడం వస్తే అక్షరాస్యులయిపోయే కాలంకదా ఇది. అందువల్ల రాతకు చాలా ప్రాధాన్యం ఉంది.

ప్రాచీన కాలంలో విద్యాభ్యాసం అంతా మౌఖికంగా జరిగేది. శాస్త్రం తేలికగా కంఠస్థం కావాలంటే పద్యరూపంలో ఉండాలి. అందువల్ల శాస్త్రరచన కూడా పద్యంలోనే జరిగేది. బహుశా ఆ రోజుల్లో పత్రికలుండి ఉంటే అవికూడా పద్యరూపంలో వచ్చి ఉండేవేమో. శాస్త్రవేత్తలు కూడా ఛందస్సు నేర్చుకుని ఛందోబద్ధంగా శాస్త్రరచనలు చేశారు. ముద్రణ లేదు కాబట్టి పుస్తకాలు అందుబాటులో ఉండేవికాదు. చదువుకొనేవాళ్ళ సంఖ్య కూడా చాలా పరిమితంగా ఉండేది. ఇప్పుడట్లాకాదు కదా. ఇది సార్వజనీన విద్య. అందరూ చదువుకోవాలి. వివిధ భాషల్లో కోట్ల గ్రంథాలు ప్రచురితమై ప్రపంచమంతటా వ్యాప్తిలో ఉన్నాయి. రకరకాల గ్రంథాలతోపాటు అసంఖ్యాకంగా పత్రికలూ వ్యాప్తిలో ఉన్నాయి. చదివే విషయ బాహుళ్యం వల్ల చదివిందంతా కంఠస్థం చేయడం సాధ్యంకాదు. అందువల్ల పద్యంలోనే రచన చేయవలసిన అవసరం పోయింది.

ఆనాడు చదువుకున్న ప్రతి వ్యక్తికీ పద్యరచన తెలుసుకాబట్టి కవిత్వంతో పాటు అన్ని విషయాలు పద్యంలో ఉండేవి. గద్యం కూడా ఒక సాహిత్య ప్రక్రియగానే ప్రధానంగా వాడుకలో ఉంది. తెలుగుకవులు పద్యరచనలో ఎన్నో నియమాలు పెట్టుకున్నారు. పద్యం ఎంతక్లిష్టంగా ఉంటే అంత గొప్ప. కందం రాసినవాడే కవి అన్న నానుడి అందుకే ఏర్పడింది. కంద పద్యానికి నియమాలు ఎక్కువ. కవులు భాషతో ఆటలాడుకున్నారు. పద్యంలో కవిత్వం ఉన్నాలేకపోయినా అందులో ఉండే లయవల్ల అందంగా ఉంటుంది. వినేవాడికి అందులో ఏదో గుణం కనిపించక పోదు. వచనం అట్లాకాదు. వచనం రాసి మెప్పించడం కష్టం. అందుకే ‘గద్యం కవీనాం నికషం వదంతి’ అనే నానుడి ఏర్పడింది.

ఇది వచన యుగం. పద్యం కవిత్వానికే పరిమితమయింది. కవిత్వం కూడా ఛందోనియమాల్ని విడిచిపెట్టి వచన రూపం తీసుకున్న కాలం. అందువల్ల నేటి అవసరం వచనరచన. పుస్తకాలూ, పత్రికలూ విస్తారంగా పెరిగాయి. కాబట్టి రాయవలసిన అవసరమూ, రాసేవాళ్ళ అవసరమూ కూడా పెరిగింది.

తెలుగులో వెయ్యేళ్ళ లిఖిత సాహిత్యం ఉంది. వెయ్యేళ్ళ కింద స్థిరపడిన రచనాభాష ఎటువంటి అవాంతరాలూ లేకుండా ఈ శతాబ్దం ప్రారంభందాకా కొనసాగింది. ఛందోబద్ధమైన పద్యరచన నేటికీ కొనసాగుతూనే ఉంది. ఈ శైలి ఆధునిక అవసరాలకు సరిపోదనే అభిప్రాయంతో గత శతాబ్దాంతంలో వ్యావహారిక భాషోద్యమం ప్రారంభమయింది. ప్రస్తుతం గ్రాంథికభాషలో వచన రచన చేసేవాళ్ళను వేళ్ళమీద లెక్కించవచ్చు. ఆధునిక రచనాభాష ఈ వందేళ్ళలోనూ అభివృద్ధి చెందింది.

పూర్వం సంస్కృతం విద్యామాధ్యమంగా ఉండడంవల్లా, తెలుగులో సాహిత్యరచన చాలా వరకు సంస్కృత సాహిత్యం మీద ఆధారపడడంవల్లా వేలకొద్దీ సంస్కృత పదాలు తెలుగులోకి వచ్చి చేరాయి. పూర్వం దక్షిణాపథం అంతా ఒకేపాలనలో ఉండడంవల్ల కొన్ని ప్రాకృత పదాలు వచ్చిచేరాయి. మధ్యయుగాలలో కొన్ని తమిళ, కన్నడ పదాలు చేరాయి. పదమూడో శతాబ్దం నుండి ఉర్దూ, అరబిక్, పర్షియన్ పదాలూ డచ్చి, పోర్చుగీసు, ఫ్రెంచి, ఇంగ్లీషు పదాలు చేరాయి. ఈ ఆధునిక కాలంలో శాస్త్రరచనలో పరిభాషను కల్పించుకోవడంలో మనం ఇంకా సంస్కృతం మీదే ఆధారపడి ఉన్నాం. అట్లాగే ఇంగ్లీషు నుండి కూడా యథేచ్ఛగా పదాలు అరువుతెచ్చుకుంటున్నాం.

ఇప్పుడు తెలుగులో రాస్తున్న వాళ్ళు చాలామంది ముఖ్యంగా పత్రికారచయితలు కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తున్నది. గత వెయ్యేళ్ళ గ్రాంథిక భాషా ప్రభావం నుండి బయట పడడం ఒక సమస్య. ఇతర భాషల నుండి అరువుతెచ్చుకున్న, తెచ్చుకుంటున్న మాటల్ని తెలుగు లో రాసేపద్ధతి రెండో సమస్య. అవసరమయిన కొత్త పదాల్ని కల్పించుకోవడం ఎలా అన్నది మూడో సమస్య. తెలుగు రచయితలకు తెలుగుభాషా సంప్రదాయంతోపాటు, కొంత సంస్కృత భాషా సంప్రదాయం కూడా తెలిసి ఉండాలి. సంస్కృత పదాలు, పదబంధాలు విస్తృతంగా వాడతారు కాబట్టి సంస్కృత పదనిర్మాణం, సంధి, సమాస నిర్మాణాలకు సంబంధించిన మౌలిక పరిజ్ఞానం తెలుగురచయితకు అదనపు భారం. దీనితోపాటు ఆధునిక రచనాభాషా సంప్రదాయాన్ని తెలుసుకోవడానికి అవసరమయిన సామగ్రి కూడా అంతంతమాత్రమే. వాళ్ళు ఎక్కువగా తాము చదివిన జ్ఞాపకంమీద తమ వివేచనాశక్తి మీదే ఆధారపడవలసి వస్తుంది. పొరపాట్లూ దొర్లుతూ ఉంటాయి. అందువల్ల ఆధునిక రచనాభాషకు ఒక నిర్దుష్ట సంప్రదాయం ఏర్పడ వలసిన అవసరం ఉంది.

-డి. చంద్రశేఖర రెడ్డి
98661 95673

రేపు:-
మన భాష- 5
“రాతలో దొర్లే పొరపాట్లు”

RELATED ARTICLES

Most Popular

న్యూస్