Monday, July 8, 2024

పెన్నేటి పాట-4

ఇప్పుడంటే రంగడిలా ఎకరం పొలం సాగు చేయడానికే అష్టకష్టాలు పడుతున్నాడు కానీ… ఒకప్పుడు వాళ్ల నాన్న నారపరెడ్డి పెద్ద జమిందారు. ఇంటి నిండా పనివాళ్లు. ఇంటి ముందు లెక్కలేనన్ని గుర్రబ్బండ్లు. ఎడ్ల బండ్లు. ఇంటికొచ్చి అడగనివాడు పాపాత్ముడు. చేతికి ఎముకలేనట్లు సాయం చేసినవాడు. పేదసాదలను ఆదుకున్నవాడు. ఊళ్లో దేవాలయంలో పూజలకు ధనం సమకూర్చిన పుణ్యవంతుడని, దక్షిణలో వెండి కాసులు వేసినవాడని ఇప్పటికీ జనం గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు.

“సై సై నారపరెడ్డి నీ
పేరే బంగరు కడ్డిరా!
పారబోస్తివి ధాన్యమంతా
ఊరడిస్తివి పెదవోళ్లను!
కోరమీసం మెలీపెడితే
సీరాముడు నీవేనయ్యా!”
లాంటి ఎన్నెన్నో పాటలు ఇప్పటికీ జనం పాడుకుంటూ ఉన్నారు.

అవి పల్లె పాటలు. పల్లె మదిలో మాటలు. మొదలుంటుంది కానీ తుది లేని పాటలు. పది నోళ్ళల్లో పడి పది రకాలుగా మారే పాటలు. కదిలే కవితలు. కమ్మని ఊటలు.

ఊళ్లో పద్యం రాయగలిగిన కవులు ఇద్దరు నారపరెడ్డిని వేనోళ్ల పొగుడుతూ పంచ రత్నాలను రాశారు. ఒక శుభదినాన గుళ్లో ఆ అయిదు పద్యాలను చదివి జనం సమక్షంలో నారపరెడ్డికి బహూకరించారు. ఇద్దరికి నారపరెడ్డి పదహారు, పదహారు రూపాయలు తాంబూలంలో పెట్టి ఇచ్చి…నమస్కారం పెట్టాడు.

ఊరి పొగడ్తలకు నారపరెడ్డి ఉబ్బిపోయేవాడు. నారపరెడ్డి కొడుకును కూడా జనం గౌరవంగా చూసుకునేవారు.

చూస్తుండగానే నారపరెడ్డి సంపద హారతి కర్పూరంలా కరిగిపోయింది. వచ్చి పోయే ప్రభుత్వ ఉద్యోగులను చూసుకోవడానికి కొంత, కోర్టు కేసుల్లో లాయర్లకు కొంత, గుర్రాలను మేపడానికి కొంత, ఇంటినిండా పనివాళ్లను పోషించడానికి కొంత, పేరుకు తగ్గట్టు కట్టుకున్న పెద్ద ఇంటికి కొంత, ఇతరుల అప్పులు మీద వేసుకున్నందుకు కొంత, ఒకదాని తరువాత ఒకటి తన నాలుగు పెళ్లిళ్లకు కొంత…ఇలా కొంత కొంతే ఖర్చు కొండంత అయ్యింది.

ఎదిగిన కూతుర్లు ఇద్దరి పెళ్లిళ్లు ఎనిమిది రోజులు వైభవంగా చేశాడు. ఆ పెళ్లిళ్లల్లో తిన్న నేతి వంటకాల గురించి చుట్టూ పది ఊళ్లు నోరారా చెప్పుకునేవి.

ఒక భార్య చెరువు కట్టమీద వెళుతూ ప్రమాదంలో మరణించింది. ఒక భార్య ఇంట్లో కాలుజారి పడి మరణించింది. ఒక భార్య రెండో కాన్పులో కూతురిని కని చనిపోయింది. నాలుగో భార్య రామమ్మది చిన్న వయసు. ఆమె కన్నవాడు మన రంగన్న. తండ్రి ముసలి. గతవైభవం కొడిగడుతోంది. నగదు, నగలు కరిగిపోతున్నాయి. ఉన్న పొలాలు కరువుతో నెర్రెలు చీలి ఉన్నాయి. గాదెల్లో ధాన్యం లేదు. ఊళ్లో పైసా పుట్టే మార్గం లేదు. చేయి చాచి ఎవరినీ అడగలేడు. నారపరెడ్డి బాధ చూడలేక ఒకపనివాడు పొరుగూరిలో పొలం పత్రాలను తాకట్టు పెట్టి…పూటగడవడానికి నాలుగు రూపాయలు తెచ్చాడు.

ప్రకృతి కరుణించి నాలుగు వానలు కురిపించి ఉంటే ఎలా ఉండేదో కానీ…ప్రకృతి పగబట్టింది. చినుకు జాడ లేదు. వడ్డీలు కట్టడానికి కూడా నారపరెడ్డి అప్పులు చేయాల్సిన కాలం దాపురించింది.

ఆకాశాన్ని తాకే గడ్డివాములు కరిగిపోయాయి. పాతాళం లోతులు తాకిన గాదెల్లో ధాన్యం గింజలు మాయమయ్యాయి. ఇనప్పెట్టెల్లో ఉన్న ఆస్తి పత్రాలకు రెక్కలొచ్చాయి. అక్కడా ఇక్కడా డబ్బాల్లో గుట్టుగా పెట్టుకున్న నగలకు కాళ్ళొచ్చి వెళ్లిపోయాయి. ఇంటి నిండా ఉన్న వేరుశెనగ అమ్మితే ఏదయినా అప్పు తీరుతుందేమో అనుకుంటే సరిగ్గా అమ్మే రోజు రేటు పావు వంతుకు పడిపోయింది. ఏనాడూ లేనిది నారపరెడ్డి ఇంట్లో మిగిలి ఉన్న కొర్రలు, జొన్నలు శేర్లతో కొలిచి అమ్ముకోవాల్సివచ్చింది.

పేరు ప్రతిష్ఠల కోసం పాకులాడి ఇక ప్రయోజనం లేదని నారపరెడ్డికి అర్థమయ్యింది. అప్పులవాళ్ళందరినీ ఇంటికి పిలిపించాడు. తన నాలుగు ఇళ్లు, చేతిలో మిగిలి ఉన్న పొలాలు, బండ్లు, గుర్రబ్బగ్గీలు, ఆవులు, ఎడ్లు, ఎనుములు అన్నీ లెక్కలు చెప్పాడు.

ఊరందరి ముందు పెద్ద పంచాయితీ జరిగింది. ఇప్పుడు లాక్కోకపోతే ఇంకెప్పటికీ అప్పు తీరదని ఊరి పెద్దలు తీర్మానం చేశారు. నారపరెడ్డి చేసిన మొత్తం అప్పులు, ఆ అప్పుకు వడ్డీలు అన్నీ లెక్కలు తేల్చారు. అణా పైసలతో పాటు అన్నీ తీర్చే సరికి నారపరెడ్డికి కట్టుబట్టలు తప్ప ఏమీ మిగల్లేదు. ఇంతటి నిజాయితీ మనిషిని కలియుగంలో చూడబోము అనుకుంటూ  అసలు, వడ్డీ, చక్రవడ్డీలు అన్నీ వసూలు చేసుకొని అప్పులవాళ్లు తృప్తిగా వెళ్లిపోయారు. ఆ రాత్రి నారపరెడ్డికి కాళరాత్రిలా గడిచింది.

ఈ వార్త దావానంలా చుట్టు పక్కల ఊళ్లకు వ్యాపించింది. ఇన్నేళ్ళుగా నారపరెడ్డిని కీర్తించిన నోళ్లే తెల్లారేసరికి “దివాలా రెడ్డి” అంటూ ఎగతాళి పాటలు పాడడం మొదలుపెట్టారు. ఆ అవమానం భరించలేక నారపరెడ్డి భార్య రామమ్మ వంటింట్లో తలుపేసుకుని చీరకొంగుకు అగ్గిపెట్టుకుని ఆత్మహత్య చేసుకుంది.

నారపరెడ్డి నారప్ప అయ్యాడు. ఊరి మోతుబరి ఊరు వదిలి…ఊరవతల పూరి గుడిసెలోకి చేరాడు. కుళ్లి కుళ్లి ఏడుస్తూ నులకమంచం మీద లేవలేక పడి ఉన్నాడు. కన్నీళ్లు కూడా ఇంకి ఒకనాడు ఆ నులకమంచం మీదే శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు.

రంగన్నకు ఇప్పుడు తల్లి లేదు. తండ్రి లేడు. నా అన్నవాళ్ళెవరూ లేరు. ఆదుకునేవారు లేరు. తన శరీరం తప్ప తన నీడ కూడా తనకు తోడు లేదు.

“రంగారెడ్డి” “రంగన్న” అయ్యాడు. “రంగన్న” “రంగడు” అయ్యాడు. దుర్భర దారిద్ర్యానికి “రంగడు” “రాంగాడు” అయ్యాడు. చివరికి తెలిసినవారింట్లో పశువులు కాచే పనితో పాటు, వారి ఇంటి పనులు చేసి పెట్టే కూలివాడయ్యాడు.

రేపు- పెన్నేటి పాట-5
“కరువు పాట

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్