Friday, November 22, 2024

డబ్బే డబ్బు

‘Bhagya’ Nagaram: ధనం మూలం ఇదం జగత్… ధనమున్నా, లేకపోయినా, పుట్టుబీదవాళ్లైనా, ఆగర్భ శ్రీమంతులైనా, నడమంత్రపు సిరితో ఎగిరిపడేవాళ్లైనా… సుమారు అందరికీ తెలిసి ఉండే తెలుగు సామెత ఇది. అయితే కాలానుగుణ మార్పులతో పాటే… ఈ నానుడీ విస్తరిస్తోంది.  సాధారణంగా బళ్లో వేసిన్నాట్నుంచి ఏ డిగ్రీనో, పీజీనో పూర్తయ్యేవరకూ పిల్లల బాధ్యత తల్లిదండ్రులదైతే… ఆ తర్వాత సంపాదన బాధ్యత పిల్లలదే.

ఈ క్రమంలో ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా… ఎవరి చదువులను బట్టి వారికుద్యోగాలు దక్కే అవకాశాలుంటాయి. అయితే అవకాశాలు మాత్రమే ఉంటాయిగానీ… అందరికీ అనుకున్న ఉద్యోగాలు దక్కాలనీ లేదు. ఎవరి ప్రతిభను బట్టి వారికి ఆయా రంగాల్లో కచ్చితంగా అవకాశాలు మాత్రం ఉండకపోవు. ఉపయోగించుకున్నవారికి ఉపయోగించుకున్నంత! అయితే ఎంత మారుతున్న కాలానుగుణంగా గొర్రెధాటి సమాజం నుంచి మరింత భిన్నంగా యోచించి లాటరల్ థింకింగ్ చేస్తున్నారన్నదాన్ని బట్టే మనుషులు తమదైన ఒక శైలితో ముందుకెళ్లి సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకోగల్గుతారు. అయితే ఆ శైలే ఒక్కోసారి విఫలయత్నమూ కావొచ్చు! కానీ, ఏదైనా అడుగు పడితేనేగా తెలిసేది.. అది విఫలమో, సఫలమో..?

తినడానికి తిండి, కట్టుకోవడానికి గుడ్డ, ఉండడానికింత నీడ కూడా లేని దైన్యస్థితిలో నుంచి అసలెవరూ వారి వైపు కూడా చూడనంత స్థాయిలో ఆర్థికంగా ఎదిగి శ్రీమంతులైనవారూ ఉన్నారు. వారెంచుకున్న భిన్న ఆలోచనలు విఫలమై కుప్పకూలినవారూ కనిపిస్తారు. సో… మనమనుకున్నది సక్సెస్సా, ఫెయిల్యూరా అన్నది పక్కనబెడితే… ఓ అడుగు ముందుకు పడందే నాల్గడుగుల దూరమైతే నడువలేమన్నది జగమెరిగిన సత్యం. అయితే అలా ఒక్కో అడుగు వేసుకుంటూ వైఫల్యాలనూ అధిగమిస్తూ… ఇవాళ ఆర్థికంగా ఆకాశమంతెత్తుకెదగడమంటే అదేమంత మాట్లాడుకున్నంత వీజీ కాదు. అలాంటి వారితో తన పేరును సార్థకం చేసుకుంటోంది మన భాగ్యనగరం.

ఆర్థిక రాజధాని ముంబై తర్వాత మొత్తం భారతావనిలోనే మన హైదరాబాద్ సంపన్నులెక్కువగా ఉన్న నగరంగా నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ -2022 కుండబద్ధలు కొట్టిందంటే… నిజంగా ఇది భాగ్యనగరమని పెట్టుకున్నందుకు సార్థక నామధేయమైనట్టే మరి! 2021 గతేడాది నికర ఆస్తి 30 మిలియన్ డాలర్లు అంటే 227 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా ఉన్నవారి జాబితా కోసం పరిగణనలోకి తీసుకుంది నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్. మరెంతమందున్నారు అన్ని కోట్లున్నోళ్లన్నదే మొట్టమొదటగా వచ్చే అనుమానమైతే… జాబితాలో దేశంలోనే మొట్టమొదటి స్థానాన్ని దక్కించుకున్న ముంబైలో 1596 మందుంటే… మనం హైదరాబాద్ గా పిల్చుకుంటున్న భాగ్యనగరంలో ఈ సంఖ్య ఇప్పుడు 467. అంతేకాదు.. మనం ముందే చెప్పుకున్నట్టు ధనం మూలం ఇదం జగత్ అనే నానుడిలెగైతే విస్తరిస్తుందో… అదే స్థాయిలో 2026 వరకు ఈ సంఖ్య మన తెలంగాణా రాజధాని హైదరాబాద్ లో 728కి పెరుగుతుందని కూడా ఈ నివేదిక వేసిన ఓ అంచనా! గత ఐదేళ్ల క్రితం వరకూ 314 మంది వరకే ఉన్నఈ ధనికుల జాబితా ఈ ఐదేళ్ల కాలంలో ఏకంగా 48.7 శాతానికి పెరిగి ఇప్పుడేకంగా 467 అయ్యింది. అయితే ఇంతలా భాగ్యనగరంలో భాగ్యవంతులు పెరిగి పోవడం ఎలా సాధ్యమవుతోంది…?

ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుందంటూ ఓ అడ్వర్టైజ్ మెంట్ చూస్తుంటాం. అచ్చూ కొందరి జీవితాలూ అలాగే. వారెంచుకున్న రంగాల్లో చేసే హార్డ్ వర్క్ కు తోడు… ఎక్కడ పెట్టుబడులు పెడితే ఎక్కువ మొత్తం రాబడి ఉంటుందో తెలిసిన మదుపరి స్మార్ట్ వర్కే వారిని ఇంతంతై అన్నట్టుగా ఇప్పుడు  శ్రీమంతుల జాబితాలో నిలబెట్టిందన్నది మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం. రియల్ ఎస్టేట్, వాణిజ్య భవనాలు, కార్యాలయాల స్థలాల కొనుగోళ్లు, ఈక్వీటీలు, రీట్స్ లో పెట్టుబడులు, స్థిరాస్థులకే ఎక్కువ మొత్తం కేటాయించడాలు, నాన్ ఫంజిబుల్ టోకెన్స్, క్రిప్టోకరెన్సీ వంటివాటిల్లో తెలివిగా మార్కెట్ ఒడిదుడుకులను బట్టి పెట్టే పెట్టుబడులే ఇదిగో ఇంతింతై అన్నట్టుగా ఎదుగుతున్న శ్రీమంతులకు కలిసివస్తున్న అంశాలన్నవి మార్కెట్ చర్చ!

వాస్తవానికి ఆర్థిక అసమానతలూ, సామాజిక అంతరాలు ఇవీ ఎప్పటికీ సమాజంలో వింటూ చూస్తూ ఒకింత బాధపెడ్తున్న అంశాలే అయినప్పటికీ.. కాలానుగుణంగా వస్తున్న మార్పులకనుగుణంగా కొత్త సాంకేతికతనూ, డిజిటల్ విప్లవాన్ని ఉపయోగించుకోవడంలో అటు భారత్ వృద్ధి రేటు గణనీయంగా పెరుగుతోందన్న అంచనా కూడా నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ చెబుతుండగా… అది మన భాగ్యనగరంలోనూ మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఒకింత ఎక్కువగా కనిపిస్తుండటం నిజంగా ఆహ్వానించదగ్గ ఓ శుభ విశేష పరిణామమే! ఆప్ లు స్టార్టప్ ల కాలంలో స్మార్ట్ వర్క్ బాగా తెలిసిన యువత విభిన్నమైన ఆలోచనలతో ముందుకొస్తుండటంతో… ఒక ఆటో తోలే వ్యక్తీ అద్భుతాలు సృష్టిస్తున్న సక్సెస్ కథలూ చదువుతున్నాం… మరోవైపు ఐఐటీల్లో చదివి గ్రామీణ నేపథ్యాన్నెంచుకుని ఆయా ప్రాంతాల వృద్ధితో పాటు… వ్యక్తిగతంగా ఎదుగుతున్నవారి విజయగాధలూ వింటున్నాం.

High Net Worth

ఏదేమైనా దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకుని జనం మీద పడో, అవినీతో, అక్రమాలతోనో సొమ్ము కూడబెట్టుకునే వాళ్ల స్టోరీలూ వింటున్న ఈ కాలంలో కక్కుర్తికి చోటివ్వకుండా తామనకున్న లక్ష్యాలను ఛేదిస్తూ ఆర్థికంగా ఆకాశమెత్తెదుగుతూ సంపన్నుల జాబితాలో మన వాళ్ల పేర్లుండటం.. మన వాళ్ల పేర్లతో మొత్తంగా తెలుగు రాష్ట్రాలే గర్వించేలా పేరును సార్థకం చేసుకున్న భాగ్యనగరంగా నిలవడం కచ్చితంగా చెప్పుకోవాల్సిన విశేషం. వచ్చే ఐదేళ్లలో మరో 28 శాతం వృద్ధి ఉండనున్నట్టుగా కూడా ఆర్థికసంస్థల సర్వేలు చెబుతున్న క్రమంలో… ఆ దిశగా భారత్ అడుగులేయటం.. ఆ అడుగుల్లో మన భాగ్యనగరమూ ముందుండటం మనందరమూ గర్వించదగ్గ విషయమూ, హర్షించదగ్గ విషయమూ! మళ్లీ ఆ ధనంతోనే మన భాగ్యనగరమూ ఆ గుర్తింపు పొందింది కాబట్టే… ధనం మూలం ఇదం జగత్!

-రమణ కొంటికర్ల

Also Read :

పేద భారతం

Also Read :

మంచి మంత్రికి ఆయన పిఆర్ఓ తుది వీడ్కోలు నివాళి ఇది

RELATED ARTICLES

Most Popular

న్యూస్