Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్హైదరాబాద్ రికార్డు స్కోరు - పోరాడి ఓడిన బెంగుళూరు

హైదరాబాద్ రికార్డు స్కోరు – పోరాడి ఓడిన బెంగుళూరు

ఐపీఎల్ చరిత్రలో ఓ అరుదైన మ్యాచ్ కు బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా నిలిచింది. సన్ రైజర్స్ హైదరాబాద్- రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మధ్య నేడు జరిగిన మ్యాచ్ లో  హైదరాబాద్ ఇచ్చిన 288 పరుగుల రికార్డు లక్ష్య ఛేదనలో బెంగుళూరు పోరాడి ఓడిపోయింది. హైదరాబాద్ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. బెంగుళూరు ఓపెనర్లు విరాట్ కోహ్లీ, డూప్లెసిస్ తో పాటు దినేష్ కార్తీక్ లు అద్భుత బ్యాటింగ్ తో అసమాన పోరాట పటిమ ప్రదర్శించారు.  ఇరు జట్లూ కలిపి 549 పరుగులు చేయడం గమనార్హం.

టాస్ గెలిచిన బెంగుళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది. ట్రావిస్ హెడ్, క్లాసేన్, మార్ క్రమ్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మలు రాణించడంతో హైదరాబాద్ 287 పరుగుల రికార్డు స్కోరు చేసింది. అతి భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగుళూరుకు ఓపెనర్లు విరాట్ కోహ్లీ, కెప్టెన్ డూప్లెసిస్ లు శుభారంభం అందించినా… దినేష్ కార్తీక్ మరోసారి మంచి ఆట తీరుతో ఆకట్టుకున్నా భారీ స్కోరు ముందు తలవంచక తప్పలేదు.

తొలి వికెట్ కు ఓపెనర్లు 6.2 ఓవర్లలోనే 80 పరుగులు రాబట్టి ఎదురుదాడికి సంకేతాలు ఇచ్చారు. 20 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 పరుగులు చేసి మంచి ఊపు మీదున్న కోహ్లీ… మార్కండే విసిరిన చక్కటి బంతికి బౌల్డ్ కావడంతో వీరి దాడికి అడ్డుకట్ట పడింది. ఆ తర్వాత వచ్చిన టాపార్డర్ బ్యాట్స్ మెన్ విల్ జాక్స్ (7); రజత్ పటీదార్(9); సౌరవ్ చవాన్ (డకౌట్); లామ్రోర్(19) లు విఫలమయ్యారు. డూప్లెసిస్ 28 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 62 పరుగులు చేసి నాలుగో వికెట్ గా వెనుదిరిగాడు.  దినేష్ కార్తీక్ మరోసారి సత్తా చాటి 35 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో  83 పరుగులు చేసి 19వ ఓవర్లో ఔటయ్యాడు.

సెంచరీ సాధించిన హైదరాబాద్ ఆటగాడు ట్రావిస్ హెడ్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్