Beauty of Konaseema:
”ఆంధ్ర భూభవన మధ్యము పుండరీకంబు /
సప్తగోదావర జలము తేనె /
బ్రహ్మవేద్యాది బహుతీర్థములు రేకులు / అకరులు చారు దివ్యస్థలములు / నాళంబు లవణాబ్ధి వేలా విభాగంబు / కల్యాణ భోగమోక్షములు తావి /దక్షవాటీ మహాస్థానంబు కర్ణిక / హంసంబు భీమనాయకుడు శివుడు గౌతమీసింధు కౌంతేయ కణ్వ నదులు తుల్య భాగమునేలేరు తుమ్మి కొనలు / భువన సంభావ్యమైన ఈ పుణ్యభూమి యనఘ సంసార తాప శాంత్యౌషధంబు” అంటూ భూమండలం మధ్యలో పద్మంలా భీమేశ్వర క్షేత్రం ఉంది అంటాడు భీమఖండంలో శ్రీనాథుడు.
పట్టిసం వీరభద్రస్వామి, కోటిపల్లి సోమేశ్వరుడు, కోనసీమ కుండలేశ్వర దైవక్షేత్రాలతో విలసిల్లే ప్రాంతాలు భీమఖండంలో మనోజ్ఞంగా ఉంటాయి. ప్రతిఏటా భీమేశ్వరాలయంలో జరిగే వసంతోత్సవాలలో భీమేశ్వరుడు ధరించే కట్టాణి ముత్యాల కంఠమాల, మాణిక్య ఖచిత కేయూరం, హీరాంకురంబుల ఉంగరం, ప్రవాళంబుల ఒడ్డాణం ఆభరణాలను శ్రీనాథుడు పూసగుచ్చినట్టుగా ప్రస్తావించాడు.
ఎన్నో ఏళ్లుగా ఈ పద్యం చదువుకోవడమే తప్ప ఈ దక్షవాటికి వెళ్లలేకపోయాను. రాజమండ్రి, కాకినాడ, యానాం, అమలాపురాల దాకా ఎన్నోసార్లు వెళ్లినా దాక్షారామం వెళ్లడం కుదరలేదు. ఒక ఏకాదశి సోమవారం రోజు అక్కడికి దగ్గరలో పనిమీద వెళ్లినప్పుడు…ఒక మిత్రుడు నాకోసం ప్రత్యేకంగా కారు పంపి…దాక్షారామం గుడికి మళ్లించాడు. ఆయన పంపిన కారు డ్రయివర్ సొంత ఊరు ద్రాక్షారామం కావడంతో దారి పొడుగునా ఆ విశేషాలను మైమరచి చక్కటి గైడ్ లా చెప్పాడు.
బండలు పగిలే ఎండా కాలంలో మబ్బులు కమ్మి పట్టపగలు చిరు చీకట్లు కమ్మిన వేళ. చిరు చినుకులు కురుస్తున్న వేళ. దారి పొడవునా అటు ఇటు ప్రఖ్యాత కడియం నర్సరీల పచ్చదనం. పూల రంగులు పుడమికి వేసిన ముగ్గులు. కాన్వెంటు పిల్లల్లా బుద్ధిగా, పద్ధతిగా, ముద్దుగా పెరుగుతున్న మొక్కలు. ఎన్నెన్ని నగరాలకు ఈ కడియం పచ్చటి ప్రకృతి శోభను కప్పుతోందో? ఎన్నెన్ని ఇళ్లకు కొమ్మల అందాన్ని గుమ్మాలకు కడుతోందో? లారీల్లోకి మొక్కలు నడిచి వెళుతున్నాయి. వేళ్లున్నందుకు కదల్లేక…సరయూ తీరం దాకా వెళ్లలేక…రాముడు వెళ్లిన వైపు కొమ్మల చేతులు చాచి అయోధ్యలో చెట్లు నమస్కరించాయి అన్నాడు వాల్మీకి. ఇక్కడ కడియం వేళ్ళున్నందుకు లారీలే వచ్చి మొక్కలను అల్లారు ముద్దుగా తీసుకెళుతున్నాయి. నర్సరీల పేర్లు కూడా ఎంత అందంగా ఉన్నాయో? వసిష్ఠ, వైనతేయ, గోదావరి, కోనసీమ, సత్యదేవ నర్సరీలట.
మెయిన్ రోడ్డు దాటి ఏటి ఒడ్డు మీదుగా వెళుతుంటే కుడి వైపు వెంట వచ్చే తళతళల గోదావరి, ఇసుక తిన్నెల అందం. ఎడమవైపు వెంట వచ్చే కాలువ…కొబ్బరి, అరటి చెట్ల అందం. అల్లంత దూరాన వరి పొలాలు. పైన నీలి ఆకాశం. మాటల్లో చెప్పలేని ఆ ప్రకృతి గీచిన చిత్రాన్ని అలా చూస్తూ ఉన్నానంతే. ఈలోపు బెంగళూరునుండి ఒక మిత్రుడు ఫోన్ చేసి పెన్నేటి పాట పద్యాలు పాడమన్నాడు. నీళ్ళపొంగు గోదావరి గట్టు మీద గంతులేస్తుంటే ఎడారి పెన్నేటి పద్యం అడగడంలో ఏదో అంతరార్థం ఉందనుకుని నాలుగు పద్యాలు పాడాను. “సార్ మీరు తెలుగు పండితులా?” అని డ్రయివర్ భయం భయంగా అడిగాడు. పద్యాలకు జడుసుకున్నాడేమో అనుకుని “కాదు” అన్నాను. భలే ఉన్నాయి సార్ ఆ పద్యాలు. మా చిన్నప్పుడు స్కూల్లో తెలుగు టీచర్ గొప్పగా పద్యాలు పాడేవాడు అని అన్నాడు. తెలుగులో ఊపిరి పీల్చుకున్నాను. కోటిపల్లి రేవులో కాసేపు ఆగి వెళదామన్నాడు. అలాగే అని దిగాను. గోదావరి నీళ్లు నెత్తిన చల్లుకుని…ఆంధ్ర ప్రశస్తిలో విశ్వనాథ సత్యనారాయణ చెప్పిన “గోదావరీ పావనోదార…” పద్యం చెప్పుకుని కారెక్కాను.
కాకినాడ- కోటిపల్లి ఒకే ఒక కంపార్ట్ మెంట్ రైలు అందచందాలను పులకించి చెప్పాడు. సార్ నేరుగా గుడికి వెళ్లకుండా మా ఇంటికి వెళదాం…ఎలాగూ గుడి మధ్యాహ్నం మూడు వరకు తెరవరు అని మొహమాటపెట్టాడు. సరే అన్నా. ఇంట్లో వాళ్ళమ్మను పరిచయం చేశాడు. దాక్షారామం గుడి చూడ్డానికి వచ్చారు…చాలా సంతోషం అని…ఆమె చక్కటి కాఫీ ఇచ్చింది. వాళ్ళ నాన్న కూడా డ్రయివరే. రాజమండ్రి వెళ్ళాడట.
గుడిలో ఆణువణువూ దగ్గరుండి చూపించడానికి ఒక మిత్రుడు ఏర్పాట్లు చేశాడు. పూజ అయి బయటికి రాగానే ఏకాదశి సోమవారం యజ్ఞం చేసిన చోటుకు తీసుకెళ్లి నాచేత మైకులో శ్రీనాథుడి భీమఖండం దక్షవాటి పద్యాలు పాడించారు. భీమేశ్వరుడి ముందు భీమఖండంలో పద్యాలు పాడడంకంటే అదృష్టం ఏముంటుంది అనుకున్నా. గుడి మంటపంలో కూర్చోబెట్టి పురోహితులు వేదాశీర్వచనం చేసి…ప్రసాదం చేతిలో పెట్టారు.
ఇలా కాదు…ఈసారి సతీసమేతంగా వచ్చి రామచంద్రాపురంలో మా ఇంట్లో ఉండి…సాయంత్రం గుడిలో భీమేశ్వరుడిని గురించి మాట్లాడాలి అని ఆ నియోజకవర్గ ప్రతినిధి, మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రేమపూర్వకంగా షరతు పెట్టారు. సరేనన్నాను. అప్పుడప్పుడు ఫోన్ చేసి బాగా నచ్చిన శ్లోకాలు, పద్యాలు పాడమని నన్నడుగుతూ…విని మైమరచిపోయే ఆస్తికుడు, సాహిత్యాభిమాని ఆయన.
మళ్లీ అదే అందాల దారిలో విమానాశ్రయానికి వస్తూ…మధ్యలో ఒక మిఠాయి దుకాణంలో ఆత్రేయపురం నేతి డ్రయ్ ఫ్రూట్స్ పూతరేకులు కొన్ని తిని…రెండు డబ్బాలు బ్యాగులో వేసుకుని వచ్చా. స్వీట్లు కనపడగానే ఆగడం, ఆగి తినడం, రుచిగా ఉన్నవి పార్శిల్ కట్టించుకోవడం అసంకల్పితంగా జరుగుతూ ఉంటాయి.
కావ్యాల్లో ఉన్నది దాక్షారామం/దక్ష వాటి. దక్షయజ్ఞ సంబంధమయినది దాక్షారామం/ దక్ష వాటి. కాలక్రమంలో జనశ్రుతి వల్ల ద్రాక్షారామం అయ్యింది. స్థానికులు గోదావరి యాస వేగంలో ద్రాక్షారం అని కూడా అంటున్నారు. అధికారిక బోర్డుల మీద కూడా ద్రాక్షారామం అనే ఉంది. తెలుగులో పండుగా ద్రాక్ష ఒకటుంది. భీమేశ్వరుడు ద్రాక్షారసంలా సులభంగా, మధురంగా శీఘ్ర ఫలమిస్తున్నాడని ద్రాక్షారామం అయ్యిందని అనుకుందాం. తప్పు లేదు.
-పమిడికాల్వ మధుసూదన్
[email protected]