Sunday, May 19, 2024
Homeసినిమాసమిష్టి కృషి ఫ‌లిత‌మే భీమ్లా నాయ‌క్ సక్సెస్ : రానా

సమిష్టి కృషి ఫ‌లిత‌మే భీమ్లా నాయ‌క్ సక్సెస్ : రానా

Rana Daniel Shekhar : పవన్ కళ్యాణ్‌, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో సాగర్‌.కె.చంద్ర దర్శకత్వం వహించిన భారీ చిత్రం ‘భీమ్లానాయక్‌’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ మాటలు, స్ర్కీన్‌ప్లే అందించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకం పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈచిత్రం గత వారం విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయింది. ఈ వారంలో కూడా రికార్డ్‌ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఈ చిత్రంలో డ్యానియేల్‌ శేఖర్‌ పాత్రతో మెప్పించిన రానా సినిమా గురించి ఆయన పాత్రకు వస్తున్న స్పందన గురించి మీడియాతో మాట్లాడారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే…

భీమ్లానాయక్‌ విడుదల రోజు నేను ముంబైలో వేరే షూటింగ్‌లో ఉన్నా. షూట్‌ కంప్లీట్‌ అయ్యాక అక్కడ ఉన్న తెలుగు ఆడియన్స్‌ తో సినిమా చూశా. అప్పటికే సోషల్‌ మీడియాలో సినిమా సూపర్‌హిట్‌ అని హడావిడి జరుగుతోంది. మిత్రులు, సినిమా పరిశ్రమ నుంచి ప్రశంసలు, అభినందనలతో అప్పటికే చాలా మెసేజ్‌లు వచ్చాయి. చాలా ఆనందంగా అనిపించింది. కళ్యాణ్‌ గారి లాంటి పెద్ద స్టార్‌ వచ్చి ఇలాంటి జానర్‌ సినిమా ట్రై చేస్తున్నారంటే కొత్తగా, ఎగ్జైటింగ్‌గా అనిపించింది. త్రివిక్రమ్ గారు చాలా ఎగ్జైటింగ్‌ పర్సన్‌. ఏం మాట్లాడిన చాలా విలువైన మాటలాగా ఉంటుంది. నాలెడ్జ్‌ ఉన్న వ్యకి, భాష సంస్కృతి మీద మంచి పట్టు వుంది. మామూలుగా ప్రతి సినిమాతోనూ నేను చాలా నేర్చుకుంటాను. ఈ సినిమాతో త్రివిక్రమ్‌, పవన్ కళ్యాణ్‌ వల్ల చాలా నేర్చుకున్నాను. త్రివిక్రమ్‌తో పని చేయడం చాలా హ్యాపీ”

Bheemla Nayak Hindi Version

“కేరళ కథలకు, అక్కడి మనుషుల తీరు, సంస్కృతి మనతో పోల్చితే డిఫరెంట్‌గా ఉంటుంది. అక్కడి ప్రేక్షకుల అభిరుచి కూడా వేరు. అలాంటి నేటివిటీ కథను మన ప్రేక్షకులకు సులభంగా రీచ్‌ అయ్యేలా మార్పులు చేర్పులు చేశారు. ‘ఐరన్‌ మ్యాన్‌’ సినిమాలో రాబర్డ్‌డౌనీ పాత్ర ఆల్‌ టైమ్‌ ఫేవరెట్‌ నాకు. అందులో వాడు నచ్చని పనులు చేస్తాడు కానీ అవి మనకు నచ్చుతాయి. ఆ పాత్రకు డ్యాని పాత్రకు సిమిలర్‌గా అనిపించింది. ఈ సినిమా అనుకోగానే డ్యాని పాత్రకు ఎవర్నీ అనుకోకపోతే నేనే చేస్తానని అడిగాను”

“అసలు హీరో అంటే ఏంటి? అనేది ఈ సినిమాతో నేర్చుకున్నాను. సినిమాలో మధ్యలో పాటలు, ఫైటులు ఎందుకు అనుకుంటాను. పాటలొస్తే.. కథ నుంచి బయటకు వచ్చేస్తాను. ఎందుకో వాటికి సింక్‌ అవ్వలేను. మాస్‌ సినిమా చేయాలని అందరూ చెబుతుంటే.. ఎందుకా అనుకునేవాడిని. అవి సినిమాకు ఎంత అవసరమో పవన్ కళ్యాణ్‌ చూశాక తెలిసింది. అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ కల్ట్‌ సినిమా. దానిని ఈ తరహాకు మార్పులు చేయాలంటే నటించే హీరోను బట్టే ఉంటుంది”

“సాగర్‌ చాలా స్ట్రెయిట్‌ ఫార్వర్డ్‌ పర్సన్‌. అతన్ని చూస్తే జెలసీ ఉంటుంది. ఒకేసారి పవన్ కళ్యాణ్‌ లాంటి స్టార్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో పని చేసే అవకాశం అతనికి వచ్చింది. ఈ సినిమా సక్సెస్‌ క్రెడిట్‌లో ఎవరికి ఎంత అంటే చెప్పలేం. దర్శకుడిగా సాగర్‌ చేయాల్సింది చేశాడు, మాటలు, స్ర్కీన్‌ప్లే రైటర్‌గా త్రివిక్రమ్‌ చేసేది చేశారు. టీమ్‌ అందరి కృషితోనే మేం ఈ సక్సెస్‌ సాధించాం. ఈ సినిమా విడుదల లేట్‌ అయింది కానీ.. మొదటి నుంచి అన్నీబాగా కుదిరాయి. పాటలు విడుదల నుంచి సినిమాకు ఎలాంటి బజ్‌ వచ్చిందో తెలిసిందే”

“నేను చేసిన డ్యాని పాత్ర చూసి నాన్న చాలా సంతృప్తి చెందారు. ఆయన అలా చెప్పడం చాలా అరుదుగా జరుగుతుంది. ‘బాహుబలి’ తర్వాత మళ్లీ ఈ సినిమాకే చాలా గొప్పగా చెప్పారు. ఏదో ఒక రోజు పాటలు, ఫైటులు లేకుండా టాకీతోనే సినిమా తీసి హిట్‌ కొడతా అని మా నాన్నతో చెబుతుంటా. అలాంటి ప్రయత్నం చేస్తా. ఇక పై అవుట్‌ అండ్‌ అవుట్‌ కమర్షియల్‌ సినిమాలు చేస్తాను” అని భీమ్లా విజయంపై తన ఆనందం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్