Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్ఐసిసి టి-20: స్కాట్లాండ్, బంగ్లాదేశ్ విజయం

ఐసిసి టి-20: స్కాట్లాండ్, బంగ్లాదేశ్ విజయం

ఐసీసీ టి-20 పురుషుల వరల్డ్ కప్ లో నిన్న జరిగిన రెండు గ్రూప్ మ్యాచ్ ల్లో పీఎన్జీపై స్కాట్లాండ్ 17 పరుగులతో; ఒమన్ పై బంగ్లాదేశ్ 26 పరుగులతో విజయం సాధించాయి.

ఒమన్ లోని అల్ అమరాత్ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన మొదటి మ్యాచ్ లో స్కాట్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 22 పరుగులకే మొదటి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే మరో ఓపెనర్ కూడా ఔటయ్యాడు. ఈ దశలో మాథ్యూ క్రాస్-45 (36 బంతుల్లో 2 ఫోర్లు, 2సిక్సర్లు);  రిచీ బెరింగ్టన్-70 (49 బంతుల్లో 6ఫోర్లు, 3 సిక్సర్లు)  రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేయగలిగింది. పీఎన్జీ బౌలర్ కబువా మోరియా చివరి ఓవర్లో హ్యాట్రిక్ నమోదు చేయడం విశేషం. కబువాకు మొత్తం నాలుగు వికెట్లు దక్కాయి.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పీఎన్జీ వెంట వెంట వికెట్లు కోల్పోయింది. 35  పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో సేసే బావు, నార్మన్ వానువాలు కాస్త ఫర్వాలేదనిపించారు. వానువా-47; బావు-24 పరుగులు చేశారు.  చివరకు 19.3 148 పరుగుల వద్ద పీఎన్జీ ఆలౌట్ అయ్యింది. స్కాట్లాండ్ బౌలర్లలో జోష్ డేవీ నాలుగు వికెట్లు తీశాడు.

70 పరుగులు చేసిన స్కాట్లాండ్ బ్యాట్స్ మెన్ రిచీ బెరింగ్టన్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

అదే స్టేడియంలో నిన్న జరిగిన రెండో మ్యాచ్ లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ మహమ్మద్ నయీం-53 బంతుల్లో 3ఫోర్లు, 4 సిక్సర్లతో 64;  షకీబ్ అల్ హసన్ 29 బంతుల్లో 6 ఫోర్లతో 42, కెప్టెన్ మహ్ముదుల్లా 10 బంతుల్లో 1ఫోర్, 1సిక్సర్ తో 17 పరుగులతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఒమన్ బౌలర్లలో బిలాల్ ఖాన్, ఫయాజ్ భట్ చెరో మూడు వికెట్లు, కరీముల్లా రెండు, జీషాన్ ఒక వికెట్ పడగొట్టారు.

ఒమన్ బ్యాట్స్ మెన్ లో జతిందర్ సింగ్-40, కశ్యప్ కుమార్-21 మాత్రమే రాణించారు. దీనితో 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులు మాత్రమే చేయగలిగింది. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజూర్-4, షకీబ్-3, సైఫుద్దీన్, మహేది హసన్ చెరో వికెట్ పడగొట్టారు.

42 పరుగులతో పాటు మూడు వికెట్లు పడగొట్టిన షకీబ్ అల్ హసన్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్