Friday, April 19, 2024
HomeTrending Newsఈశాన్య రాష్ట్రాల వైపు మావోయిస్టుల మార్చ్!

ఈశాన్య రాష్ట్రాల వైపు మావోయిస్టుల మార్చ్!

మావో కీలక నేతల మరణాలు, లొంగుబాట్ల నేపథ్యంలో ఉనికి కోసం మావోయిస్టు పార్టీ వ్యూహం మారుస్తోందా? కేడర్ ను కాపాడుకునేందుకు ఈశాన్య రాష్ట్రాలకు ‘మార్చ్’ చేస్తోందా?  అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కొన్నాళ్లపాటు ఛత్తీస్ గఢ్, ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతాలను వదిలేయాలని ఆ పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఛత్తీస్ గఢ్ మీదుగా పశ్చిమబెంగాల్ ద్వారా నాగాలాండ్ చేరువవ్వాలని నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాలు నుంచి సమాచారం అందింది. పార్టీ కార్యకలాపాల నిర్వహణకు ఏమాత్రం అనుకూలంగా లేని వాతావరణం కావడంతో ఉన్న నేతలను, కేడర్ ను కాపాడుకునే పనిలో మావోయిస్టు పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. ఏవోబీలో ఉన్న ఆరు కమిటీలను రెండు కమిటీలుగా, ఛత్తీస్ గఢ్ లోని నాలుగు కమిటీలను రెండు కమిటీలుగా మార్చేసిన మావోయిస్టు పార్టీ.

మావో నేత హిడ్మా దండకారణ్యం దాటినట్టు సమాచారంతో ఏజెన్సీ జల్లెడపడుతున్న పోలీసులు

మావోయిస్టు పార్టీలో మరో అగ్రనేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ-1 కమాండర్ హిడ్మా దండకారణ్యం దాటి బయటకు వచ్చారన్న సమాచారంతో మూడు రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టు అగ్రనాయకుడు రామకృష్ణ (ఆర్ కె)ను పరామర్శించడానికి ఈనెల 8 తేదీన చతీష్ ఘడ్ బస్తర్ ప్రాంతం నుంచి ఏవోబి  ప్రాంతంలోకి వచ్చినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఆర్కే మృతిచెందిన సందర్భంలో అంతిమ యాత్ర సమయంలో కూడా అక్కడే ఉన్నారని పోలీసులకు సమాచారం వచ్చింది. మరో పక్క అయన  అనారోగ్యానికి గురై వైద్యం కోసం వచ్చారని భావిస్తున్నా.. దీని వెనుక మరేదైన వ్యూహం ఉందా అన్న కోణంలోనూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా పోలీసులు ఆరా తీస్తున్నారు.

తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన ఏటూరునాగారం, కన్నాయిగూడెం, వెంకటాపురం, వాజేడు అడవుల్లోకి వచ్చి చికిత్స పొందుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఏజెన్సీలోని పోలీసులు ఏటూరునాగారం ఏఎస్పీ గౌస్ ఆలం నేతృత్వంలో అడవులబాట పట్టారు. హిడ్మా ఏజెన్సీలోని అడవుల్లో, గొత్తికోయగూడేల్లో తలదాచుకొని చికిత్స పొందుతున్నారనే కోణంలో ఆయా ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. స్పెషల్ పార్టీ పోలీసులతోపాటు గ్రేహౌండ్స్ బలగాలు అడుగడుగునా తనిఖీలు చేస్తున్నాయి. హిడ్మా _ఆచూకీ కోసం జాగిలాలు, డ్రోన్ కెమెరాలను రంగంలోకి దింపాయి. ఈ ఏడాదిన్నరలో కరోనా, తదనంతర అనారోగ్య సమస్యలతో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు హరిభూషణ్, పూర్ణేందు ముఖర్జీలతోపాటు ఇటీవల ఆర్కే మృతిచెందారు. ఇప్పుడు హిడ్మా అనారోగ్య సమస్య మావోయిస్టు పార్టీని మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

ఏదైనా వ్యూహం ఉందా ?

దండకారణ్య ప్రాంతంలో ఆరు నెలలుగా హిడ్మా కదలికలపై ఎలాంటి సమాచారం లేదు. ఆపరేషన్ సమాధాన్లో భాగంగా దండకారణ్య ప్రాంతాన్ని చుట్టుముట్టిన పోలీసు బలగాల దృష్టి మళ్లించేందుకు హిడ్మా బయటకు వచ్చారా.. ఎక్కడైనా మెరుపుదాడి చేసి ఉనికి చాటుకోవాలని భావిస్తున్నారా అనే అనుమానాలు పోలీసులకు కునుకు పట్టనివ్వకుండా చేస్తున్నాయి. ఆర్కే మృతి తరువాత ఏవోబీలో మావోయిస్టు పార్టీని మళ్లీ బలోపేతం చేసే సన్నాహాల్లో భాగంగా వచ్చారా… ఇలా పలు కోణాల్లో పోలీసులు విశ్లేషిస్తున్నారు.

ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ (AOB) నుంచి బాలకృష్ణ

RELATED ARTICLES

Most Popular

న్యూస్