Sunday, February 23, 2025
Homeస్పోర్ట్స్శ్రీలంకకు ఎల్బీ అయిన నెదర్లాండ్స్

శ్రీలంకకు ఎల్బీ అయిన నెదర్లాండ్స్

శ్రీలంక బౌలింగ్ ధాటికి నెదర్లాండ్స్ జట్టు దాసోహం అయ్యింది. ఐసిసి టి-20 వరల్డ్ కప్ చివరి లీగ్ మ్యాచ్ లో శ్రీలంక 8 వికెట్ల తేడాతో నెదర్లాండ్స్ పై ఘనవిజయం సాధించింది. లంక బౌలర్లు చెలరేగిపోయారు. మొత్తం ఐదుగురు నెదర్లాండ్స్ బ్యాట్స్ మెన్ ఎల్బీగా ఔటయ్యారు. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించి సూపర్ 12  కు చేరుకున్న లంక నేడు జరిగిన మూడో మ్యాచ్ లోకూడా గెలుపొంది గూప్ ఏ లో అగ్రస్థానం దక్కించుకుంది. ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లు ఉన్న గ్రూప్-1 లో శ్రీలంక చేరింది.

షార్జా క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదటి ఓవర్ నుంచే నెదర్లాండ్స్ పతనం మొదలైంది. కొలిన్ అకేర్మేన్ చేసిన 11  పరుగులే జట్టులో అత్యధిక స్కోరు కావడం గమనార్హం. కేవలం 10 ఓవర్లలో 44 పరుగులకే కుప్పకూలింది. లంక బౌలర్లలో లహిరు కుమార, హసరంగ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. మహీష్ తీక్షణ రెండు, చమీర్ ఒక వికెట్ దక్కించుకున్నారు.

అతి స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టులో ఓపెనర్ నిశాంక డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత చరిత్ అసలంక 6 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ పెరీరా-33 పరుగులతో అజేయంగా నిలిచాడు. 7.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది.

మూడు ఓవర్లలో కేవలం ఏడు పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టిన లహిరు కుమారకు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

రేపు (అక్టోబర్ 23) శనివారం నుంచి సూపర్ 12 మ్యాచ్ లు ఆరంభం కానున్నాయి. మొదటి మ్యాచ్ ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య అబుదాబీలోను, ఇంగ్లాండ్-వెస్టిండీస్ మధ్య రెండో మ్యాచ్ దుబాయ్ లోను జరుగుతాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్