Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకృష్ణశాస్త్రి మూగబోయిన వేళ...

కృష్ణశాస్త్రి మూగబోయిన వేళ…

ఓ చల్లని సాయంత్రం వేళ గోదావరి ఇసుక తిన్నెల మీద పొద్దుగుంకే సూర్యుడు పడి ఇసుక అరుణ వర్ణం పులుముకుంటోంది. నీటి తళతళలు కుంకుమ రాగాలు పాడుకుంటున్నాయి. పొద్దు వాలే వేళ పక్షులు గూళ్లకు మళ్లి…ఆకాశానికి ఆపూటకు వీడ్కోలు చెబుతున్నాయి. పడవల్లో తెరచాపకు చిక్కుకున్న సాయం సూర్యుడు పడవ వెంట తీరానికి వస్తున్నాడు.

ఏటి గట్టున పర్ణశాల వెదురు తలుపు తీసి కృష్ణశాస్త్రి బయటికి వచ్చాడు. “సడిసేయకో గాలి! సడి సేయబోకే…” అని కృష్ణ శాస్త్రి అంటాడని తెలిసిన ఈదురుగాలి సడిసేయకుండా…నెమ్మదిగా కృష్ణశాస్త్రిని తాకి వెళ్లిపోయింది. వాకిట్లో ఎండుటాకులు గలలలు మాని కృష్ణశాస్త్రి కాళ్లకు మెత్తటి పచ్చికలా మారాయి. కృష్ణశాస్త్రి ఆకాశంలోకి తేరిపార చూశాడు. నల్లని మబ్బులు తెల్లగా మారి…దూదిపింజలై కృష్ణశాస్త్రిని తాకి…చల్లబరచి వెళ్లాయి. కొమ్మల్లో పక్షులు కృష్ణశాస్త్రి కవితలను కోరి కోరి గొంతెత్తి పాడుతున్నాయి. పెరట్లో మిసమిసలాడే గులాబీలు కృష్ణశాస్త్రితో గుసగుసలాడుతున్నాయి. దూరంగా అడవి…“ఈ అడవి దాగిపోనా! ఎటులైనా ఇచటనే ఉండిపోనా?” అని కృష్ణశాస్త్రినే పాటలతో అడుగుతోంది. కొమ్మలో కొమ్మ అయిన ప్రకృతి పరవశగీతం పాడుతోంది కృష్ణశాస్త్రిని చూడగానే.

సమస్త ప్రకృతి తననేదో రాయమంటోందని అనుకున్న కృష్ణశాస్త్రి పర్ణశాల లోపలికెళ్లి…పెన్ను, పేపర్, రేడియో తెచ్చుకుని…వసారాలో నులకమంచం మీద కూర్చుని…సంజ కెంజాయ రంగు చీరగట్టిన గోదావరిని చూస్తూ రేడియో ఆన్ చేశాడు. అంతే…అప్పుడు వినపడింది ఈ పాట:-

“మేఘాల్లో డ్యాన్సింగ్ నేను
మెరుపుల్తో రేసింగ్ నేను
వాటర్ పై వాకింగ్ నేను
చుక్కల్తో చాటింగ్ నేను

రెయిన్ బో లో స్విమ్మింగ్ నేను
ఫుల్ ఫ్లోలో సింగింగ్ నేను
జాబిలిపై జంపింగ్ నేను
సంతోషాన్నే సిప్పింగ్ నేను

హే భ్రమరాంబకు నచ్చేశాను
జజ్జనక అంబరమే టచ్చేశాను

తెగ ఫిక్సింగ్ నేను
తుంటరి ఫీలింగ్ నేను
వండర్లో వాచింగ్ నేను

దిక్కులనే సెట్టింగ్ నేను
ఊయల్లో సిట్టింగ్ నేను
నా గుండె సౌండింగ్ నే లిజనింగ్ నేను
వెన్నెలనే డ్రింకింగ్ నేను
మ్యాజిక్ లో మ్యూజిక్ మంచింగ్ నేను
తామర పువ్వల్లే వింటర్ గువ్వల్లే
ఒంటరి ఊహల్లో వెయిటింగ్ నేను
హ్యాపీనెస్ తో డేటింగ్ నేను

మ్యాటర్ నేను
క్వార్టర్ నేను
ఊఫర్ నేను
ఎవరెస్ట్ సెర్చింగ్ నేను
రాకెట్ బ్రాకెట్ నేను
ఫ్లయింగ్ నేను”

అప్పుడు శాశ్వతంగా వెళ్లిపోతూ కృష్ణశాస్త్రి చెప్పినదే:-

“దిగిరాను దిగిరాను
దివినుండి భువికి…”

ఈ పాటలో ఏమి తక్కువ? అని ప్రకృతి పెద్ద మనసుతో గేయ రచయిత తరపున వకాల్తా తీసుకుని పైకి వెళ్లే దారిలో కృష్ణశాస్త్రిని అడిగింది. కానీ…అప్పటికే ఆయన నోరు పడిపోయింది. మాట పెగల్లేదు. అతికష్టం మీద తెల్లకాగితం మీద పెన్సిల్ తో రాసి…తలవంచుకుని వెళ్లిపోయాడు.

“నాకు నాలుగు ముక్కలు తెలుగు తప్ప…రెండు ముక్కలు కూడా ఇంగ్లీషు తెలియదు. తెలుగు నేలమీద వీధికొకరుగా పుట్టి పెరుగుతున్న షేక్స్ పియర్, కీట్స్ లాంటి వర్ధమాన ఇంగ్లిష్ గేయ రచయితలెవరైనా మీ సందేహాలను నివృత్తి చేయగలరేమో ప్రయత్నించండి!”
అని రాసి ఉంది అందులో!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్