Sunday, November 24, 2024
HomeTrending NewsManipur: మణిపూర్ లో నిరసనల హోరు

Manipur: మణిపూర్ లో నిరసనల హోరు

మణిపూర్ లో అల్లర్లు తగ్గు ముఖం పట్టకపోగా కుకి-మైతేయి వర్గాల ప్రజల మధ్య వైషమ్యాలు మరింత పెరుగుతున్నాయి. మరోవైపు మణిపూర్‌ అంశంపై జూన్‌ 24న ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే 50 రోజులుగా హింసాత్మక ఘటనలతో మణిపూర్‌ మండిపోతుంటే.. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మౌనం వహించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మణిపూర్‌ వాసుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకొని, వారిని రోడ్లపైకి వచ్చేలా చేసింది. బుధవారం యోగా డేను బహిష్కరిస్తూ.. తౌబాల్‌ జిల్లాలోని తౌబాల్‌ మేలా మైదానంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. వేలాది సంఖ్యలో మణిపూర్‌ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సంక్షోభానికి పరిష్కారం చూపని కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ప్రధాని మోదీతో పాటు అమిత్‌షా, మణిపూర్‌ సీఎం బీరేన్‌ సింగ్‌ దిష్టిబొమ్మలను దహనం చేశారు.

మణిపూర్‌లో శాంతి నెలకొల్పాలని కోరుతూ రాజధాని ఇంఫాల్‌లో పోలో క్రీడాకారులు ర్యాలీ నిర్వహించారు. కేవలం ఎన్నికల సమయంలోనే మోదీకి మణిపూర్‌ గుర్తొస్తుందా? అని పీఏఎల్‌ కార్యదర్శి జిబన్‌కుమార్‌ ప్రశ్నించారు. రాష్ర్టానికి చెందిన 1500 మందికి పైగా విద్యార్థులు పొరుగున ఉన్న మిజోరం రాష్ట్రంలోని పాఠశాలల్లో చేరారు. వీరందరికీ ఉచితంగా అడ్మిషన్లు ఇచ్చినట్టు మిజోరం విద్యాశాఖ డైరెక్టర్‌ లాల్సాగ్లింయానా తెలిపారు.

మోదీ మౌనంపై విపక్షాలు మండిపడుతున్నాయి. మణిపూర్‌ హింసతో మండిపోతుంటే, అధికారంలో ఉన్నవారికి పరిస్థితులను చక్కదిద్దే సమయం లేదా? అని ఎన్సీపీ నేత శరద్‌పవార్‌ ప్రశ్నించారు. విదేశీ పర్యటనలు చేస్తున్న మోదీ.. ముందు దేశంలోని అంతర్గత సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు.రాష్ట్రంలో శాంతి నెలకొనాలని కోరుకుంటూ కాంగ్రెస్‌ నేత సోనియా గాంధీ ఓ వీడియో సందేశం విడుదల చేశారు. కాగా, రాష్ట్రంలోని తాంగ్జింగ్‌, కంగ్‌చుప్‌ ఏరియాల్లో మంగళవారం రాత్రి కాల్పుల ఘటనలు చోటుచేసుకొన్నాయి. తాంగ్జింగ్‌ ఏరియాలోని సుగ్నుకు సమీపంలో దాదాపు 15-20 రౌండ్ల కాల్పులు జరిగాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనల్లో ఎవరూ మరణించలేదని, ఎవరికీ గాయాలు కాలేదని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్