Wednesday, February 26, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమళ్ళీ రాజుకున్న హిందీ వ్యతిరేక ఉద్యమం

మళ్ళీ రాజుకున్న హిందీ వ్యతిరేక ఉద్యమం

తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకె రాజకీయ ప్రయోజనాలతోనే హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని భుజానికెత్తుకుని ఉండవచ్చు. ప్రతిపాదిత పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనను కూడా ఆ ఉద్యమానికి అగ్గికి ఆజ్యం పోసినట్లు కలిపి ఉండవచ్చు. హిందీ విషయం ఎలా ఉన్నా…పార్లమెంటు సీట్ల పునర్విభజన జరిగి…దక్షిణాదిలో పార్లమెంటు సీట్లు తగ్గి…ఉత్తరాదిలో గణనీయంగా పెరిగితే దక్షిణాదికి జరిగే అన్యాయం అంతా ఇంతా కాదు. దీనిమీద విస్తృత చర్చ జరగకపోతే, మేల్కొనకపోతే, సంఘటితంగా పోరాడకపోతే జరగబోయే నష్టం ఊహక్కూడా అందదు. ఈ రెండు విషయాలు ఇదివరకు చెప్పుకున్నవే అయినా మళ్ళీ దృష్టి పెట్టాల్సిన సందర్భంలో ఉన్నాం.

జాతీయ విద్యావిధానంలో భాగమైన త్రిభాషా సూత్రాన్ని తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. హిందీని తమపై బలవంతంగా రుద్దుతున్నారని మండిపడుతూ మొదట లేఖల యుద్ధం మొదలుపెట్టారు. తరువాత నేరుగా రోడ్లమీదికి వచ్చి పోస్టాఫీసులు, రేల్వే స్టేషన్లలో హిందీ అక్షరాలకు నల్లరంగు పూస్తున్నారు. హిందీ బోర్డులను తొలగిస్తున్నారు. రాష్ట్రమంతా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. త్రిభాషా సూత్రంలో హిందీ ఐచ్ఛికమే(అప్షన్) కానీ బలవంతం కాదు కదా! అన్నది కేంద్రప్రభుత్వ సమర్థన. మొదట ఐచ్ఛికమంటారు…తరువాత తప్పనిసరి చేస్తారు…మేము ఒప్పుకునే ప్రసక్తే లేదని తమిళనాడు తెగేసి చెబుతోంది. మీకంత త్రిభాషా సూత్రం మీద గౌరవమే ఉంటే…ఉత్తరప్రదేశ్, బీహార్ లేదా మొత్తం ఉత్తర భారతంలో ఎక్కడైనా తమిళమో, మలయాళమో కూడా ఐచ్ఛికంగా పెట్టండి అని సవాలు విసురుతున్నారు. ప్రాథమిక విద్యాబోధన మాతృభాషలోనే ఉండాలన్నది జాతీయ విద్యావిధానంలో మరో కీలకమైన అంశం. ఆ చర్చ ఇక్కడ అనవసరం.

ఆరు దశాబ్దాల క్రితం తమిళనాడులో డి ఎం కె ఆధ్వర్యంలో హిందీ వ్యతిరేక ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. రాజకీయంగా మళ్ళీ అలాంటి ఆయుధమే దొరికినట్లు డి ఎం కె అనుకుంటోంది. ఈ గొడవ ఎటెటో వెళుతోందని గ్రహించిన ప్రధాని మోడీ భాషలమధ్య వైరుధ్యాలు సృష్టించవద్దని పరోక్షంగా తమిళనాడుకు సూచించారు. అన్ని భాషలూ పరస్పర ఆదానప్రదానాలతో సుసంపన్నమైనవేనని శాంతింపజేయడానికి ప్రయత్నించారు. హిందీ అప్షన్- కంపల్షన్ సన్నని గీత మధ్య ఇప్పుడు భాషా యుద్ధాలు జరుగుతున్నాయి. కర్ణాటక- మహారాష్ట్ర సరిహద్దులో నా భూమి- నా భూమి అంటూ ఒక రాష్ట్రంలో మరో రాష్ట్రం యజమాన్యహక్కుల ఆరని చిచ్చు కూడా భాషా యుద్ధంగా మారుతోంది.

దేశంలో హిందీ జాతీయ భాష అవునా? కాదా? అన్న చర్చ, వాదోపవాదాల్లో ప్రాంతీయ భాషల అస్తిత్వాల మీద ధ్యాస పెరగడం శుభ పరిణామం.

హిందీ జాతీయ భాష కానే కాదు. ఈ దేశంలో అధికారికంగా గుర్తింపు పొందిన 22 భాషల్లో హిందీ కూడా ఒకటి- అంతే. కాకపోతే దేశ జనాభాలో 43 శాతం మంది హిందీ మాట్లాడేవారున్నారు కాబట్టి…హిందీ జాతీయ భాష అని చాలా మంది పొరబడుతూ ఉంటారు. హిందీ తరువాత అత్యధికంగా మాట్లాడే భాషలు వరుసగా బెంగాలీ, మరాఠీ, తెలుగు.

హిందీ జాతీయ భాష అని భుజానికెత్తుకునే అజయ్ దేవగన్ లాంటివారి అజ్ఞానాన్ని, అహంకారాన్ని, అమాయకత్వాన్ని కాసేపు భరించి…హిందీ నిజంగా జాతీయ భాష అయ్యిందనే అనుకుందాం. దేశంలో మిగతా 57 శాతం ప్రజలు మాట్లాడే ప్రాంతీయ భాషలను నెమ్మదిగా చంపేస్తారా? బతికి ఉన్నా పాడె కడతారా? హిందీ తప్ప ఇక ఏ భాషను మాట్లాడనివ్వరా? మాట్లాడినా వినకుండా చెవులు మూసుకుంటారా?

ప్రపంచ భజన సంప్రదాయాన్ని జనమార్గం పట్టించిన మరాఠీ అభంగాల అందచందాలు చూడలేరా?
వేదాలతో సమానంగా నిలిచే తమిళ నయనారుల, ఆళ్వారుల పత్తికాలు వినలేరా?
భారతీయ సాహిత్యానికి మణిదీపాల వెలుగులను పంచిన మలయాళ మలయ మారుతాల పులకింతలు వద్దా?
మరాఠీ భజనల కొనసాగింపుగా కన్నడలో జనసామాన్యులను చేరిన దాస సాహిత్య ఇక్షు సాగరంలో మునకలు వేసి…కనీసం ఒక చుక్క తీపిని నాలుక మీద రుచి చూడలేరా?
అయోధ్య రాముడే మురిసిన అన్నమయ్య, రామదాసు, త్యాగయ్యల తెలుగు కీర్తనల గంగా ప్రవాహంలో మునిగి పునీతులు కాలేరా? పోతన పోతపోసిన కృష్ణతత్త్వం తెలుసుకోలేరా?

ప్రపంచం పట్టనంత బెంగాలీ సాహిత్యం రుచి చూడడానికి ఎన్ని జన్మల పుణ్యం ఉండాలి?
సీతమ్మ పుట్టింటి మిథిలవాసులు మాట్లాడే మైథిలీ భాష జానపదగాథల రామాయణం వినలేమా?
మంగళూరు తీరంలో కోటి మందికి పైగా మాట్లాడుతున్నా లిపిలేదు కాబట్టి తుళు భాషనే రద్దు చూసేద్దామా?
ఎగిరి గంతులేసే పంజాబీ కాళ్లు విరగ్గొడదామా?
ఒరియా ఒద్దా?
ఇంకా అనేకానేక భారతీయ భాషల అందచందాల ముక్కు చెవులు కోసి, కాళ్లు చేతులు విరగ్గొట్టి, నోట్లో గుడ్డలు కుక్కి మూలన పడేద్దామా? భాషలు నవనవోన్మేషంగా బతికి ఉండగానే తలకొరివి పెడదామా?

ఒక దేశం – ఒకే చట్టం; ఒక దేశం- ఒకే ఎన్నిక అంటే ఏంటో అనుకున్నారుకానీ అందులో ఒక దేశం – ఒకే భాష కూడా అంతర్భాగంలా ఉంది.

Youtube : https://www.youtube.com/@MahathiBhakthi
Facebook : https://www.facebook.com/mahathibhakthi
Instagram: https://www.instagram.com/mahathibhakthi/
Twitter : https://x.com/Dhatri_Tv

హిందీమీద అమిత ప్రేమ ఉండక్కర్లేదు – అలాగని హిందీమీద అమితద్వేషమూ అక్కర్లేదు. ఈరోజుల్లో మాతృభాష ఏదయినా ఇంగ్లీషు తప్పనిసరిగా నేర్చుకోవాలి . హిందీ తోడయితే మంచిది. భాషను బలవంతంగా రుద్దితే వాంతి అవుతుంది. ఇష్టపడి ఎవరికివారు నేర్చుకుంటే వాగ్భూషణమవుతుంది.

రేపు:-
“పునర్విభజనలో మునగనున్న దక్షిణాది”

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్