Wednesday, June 26, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంనచ్చలా.. రాజా సార్!

నచ్చలా.. రాజా సార్!

ఒక సగటు అభిమానిగా మీ సంగీతాన్ని ఎల్లలు లేకుండా ఎందరిష్టపడుతున్నారో.. అందులో నేనూ ఒకణ్ని!

కానీ, నచ్చలా!

మీ సంగీతం కాదు సుమీ!
మీ సంకుచితత్వం..
అదే మీ వ్యక్తిత్వం!!

మీరంటూ ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా ఎదిగారంటే.. అందుకు మీరందించిన సంగీతం మీకు సాధించిపెట్టిన గుర్తింపది!

కానీ, ఊ అంటే మీ సంగీతానికి రాయల్టీ అంటూ నోటీసులిస్తున్నారే.. అదిగో అక్కడ మీ పాటనెంతగా ఇష్టపడ్డానో.. మీ సంకుచితత్వానికి అంతగా నొచ్చుకునేలా చేశారు.

లక్షలు, కోట్ల మంది అభిమానుల్లో నేను ఓ బోడి లింగాన్ని! నేనే కాదు.. నాలాంటోళ్లు ఎందరు నొచ్చుకున్నా మీకు పోయేదేం లేదు.

అలా అని మాకు అంతకన్నా పోయేదేముండదు. కానీ, ఒక వటవృక్షంలా ఎదిగి.. వాగ్గేయకారుల తరహాలో.. నేటి సంగీతాన్ని శాసించిన మీరే.. ఇప్పుడు సంకుచితత్వంతో ప్రవర్తిస్తున్నందుకు  ఓ సగటు అభిమానిగా కలిగే ఓ చిన్న పెయిన్ అంతే!

మీ లీగల్ నోటీసులకు.. మీ అభిమానులకు.. భావోద్వేగాలన్నింటినీ పక్కకు నెట్టేసి తర్కంతో మిమ్మల్ని సమర్థించే వాళ్లకు.. సవ్వాలక్ష కారణాలు దొరకొచ్చుగాక!

కానీ, సగటు అభిమాని ఆ లెక్కలు చూసుకోడు. సంగీతంతో రంజింపజేసిన రాజాలోని కామర్స్ అదే సంగీతాన్ని మించి డామినేట్ చేసినప్పుడు.. అరె ఇలా తయారయ్యాడేంటని అనుకుంటాడు!

మీరు ట్యూన్ చేసిన పాట మీద.. పోనీ, మీ ఆడియో కంపెనీ నుంచి విడుదలైన ఆడియో ట్రాక్స్ పైనే మీ రాయల్టీ పోరాటమనుకున్నా.. మీకుమల్లే మీ పాటల్లో బీజియమ్స్ ప్లే చేసిన ఏ వాయిలనిస్టో, తబలా విద్వాంసుడో.. ఆ పాటలో తమ బిట్స్ ఉన్నాయి కాబట్టి.. తమకూ రాయల్టీ కావాలని పట్టుబడితే..?

ఇలా ఆ సమిష్టి కృషిలో ఎందరికి రాయల్టీ దక్కేది..? ఇంకెందరికి నోటీసులిచ్చేది..?

కాసేపు వాణిజ్యాన్ని పక్కనబెట్టి.. నైతికంగా సరైందా, కాదా అనే ఆలోచనైనా తట్టలేదా.. అంత మ్యూజికల్ మేస్ట్రోకి..?

మీలాగే మిగతా సంగీత దర్శకులు కూడా ఆలోచిస్తే..? మీ సంగీతంలో భాగస్వాములైన కళాకారులు ఆలోచిస్తే..?

మీరు సంగీత పర్చిన పాటలు.. తమ సినిమాల్లోవని.. ఆ సినిమాలకు సంగీతం అందించినందుకు మీకు రెమ్యునరేషన్ ముట్టిందని.. కాబట్టి, మీరు స్వరపర్చిన పాటలు మీరే ఎక్కడైనా పాడాలన్నా.. అందుకు, తమకు రాయల్టీ చెల్లించాలని ఒకవేళ ఆ నిర్మాతలంతా కూడబలుక్కుని మీకే నోటీసులందిస్తే..?

మీలాగే పాటల రచయితలు, గాయకులు, గాయనీమణులు అంతా ఆలోచిస్తే.. రాయల్టీ లెక్కల క్యాలిక్యులేషన్ లో.. అప్పటివరకూ పరవశించిన పాట పరిస్థితేంటి..?

స్టూడియోల చుట్టూ తిరిగిన స్వరవాణి.. కోర్టుల చుట్టూ తిరగడమేంటి రాజా..?

మీ సొంత ఆడియో కంపెనీ నుంచి బయటకొచ్చిన పాటలకు మాత్రమే రాయల్టీ అడుగుతున్నారా.. లేక, మీరు సంగీతమందించిన అన్ని పాటలకా అనేదీ ఓ ప్రశ్నే ఐనా.. ఆ ప్రశ్నకు సమాధానాలు వెతుకుతూ.. సగటు అభిమాని సంతృప్తి చెందే పరిస్థితిప్పుడిక ఉండదు.

ఎందుకంటే గతంలో ఇళయరాజా అంటే ఏ కొత్త సినిమాలో ఏ పాటతో అలరించాడన్న చర్చ నుంచి.. ఇప్పుడు రాజా అంటే రాయల్టీ అనేలా మీ సంగీతాన్ని మించి వ్యాపించింది మీ సంకోచస్థితి!

చాలా పేద స్థితి నుంచి వచ్చారు. అనుకున్నది సాధించారు. ఆర్థికంగా మంచి స్థితిమంతులు. ఈమధ్య బిడ్డ చనిపోయిన విషాదం మినహా.. కొడుకులూ మీ అడుగుజాడల్లో పెరిగిన ప్రబుద్ధులు!

ఐనా, ఈ రాయల్టీ పట్టేంది.. పట్టింపేంది రాజా..?

బాత్రూమ్ లో మీ పాట హమ్మింగ్ చేసినా.. యూట్యూబ్ లో మీ పాట విన్నా.. ఇంకా మీరు సంగీతమందించిన పాటలు గురించి బహిరంగంగా చర్చించినా.. రాజా నుంచి రాయల్టీ నోటీసులందే ప్రమాదముందనే భయంకరమైన ట్రోలింగా.. ? మీ గురించి ఓ సగటు అభిమాని కోరుకునేది!

పాట పక్కదారి పట్టింది.. రాయల్టీ ఫోర్ గ్రౌండ్ లో తిష్ఠ వేసింది.

ట్రోలర్స్ పైనా మీ సగటు అభిమానులకు డిఫెండ్ చేసుకునే రకరకాల ఆలోచనలతో మెదడు పదునెక్కుతుండొచ్చు. ఒకానొక దశలో ట్రోలర్స్ ను ఏదైనా చేసేయాలని కోపమూ రావొచ్చు. కానీ, ఏం లాభం..? అసలింత స్థితి ఎందుకు వచ్చిందనే పశ్చాత్తాపం కదా కావల్సింది..?

కొందరు తార్కికులంటారు.. ఏహే, రాయల్టీ వంటి అంశాలు రాజా పట్టించుకోరు.. ఆయన వ్యక్తిగత సిబ్బంది చూసుకుంటారని!

శివుడి ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టొచ్చునేమోగానీ.. రాజా వంటి మోనోపాలీ ఆదేశం లేకుండా ఆయన వ్యక్తిగత సిబ్బంది వివాదాస్పద అంశాలను నెత్తికెత్తుకోవడమనేది.. హహ్హా.. హాస్యాస్పదం!

గతంలో మనసుకు నచ్చిన పాటంటే.. ముందుగా ఓ రాజా పాటలా.. ? ఐతే ఆన్ చేద్దామని.. నీ ట్రాక్సే వింటూ సేద తీరే వారిలో కూడా.. ఇప్పుడు ఓ రాజా ట్రాక్సా.. తర్వాత చూద్దాం లే అనే ఒకింత నిస్పృహకూ కారణం మీ సంకుచితత్వమే కాదా..? మీకర్థమవుతోందా.. రానురాను మీ పాటపై.. మీ రాయల్టీ ముచ్చట్లు ప్రతిబింబాలై ప్రభావితం చేయబోతున్నాయని!

నచ్చలా.. రాజా సార్!!

ఏదేమైనా రాజా.. సుగంధ గాలై వ్యాపించిన నీ సంగీతాన్ని మించి.. ఈరోజు మీ సంకుచితత్వం ఎదిగిపోవడం ఒకింత బాధాకరం!

కృషి ఉంటే మనుషులు రుషులవుతారనేందుకు ఉదాహరణ మీరే! ఎదిగిన కొద్దీ మనిషి ఒదిగుండాలనే దానికి విరుద్ధ భావనా మీరే!!

నచ్చలా.. రాజా సార్.. ఓ సగటు అభిమానిగా ఒకింత బాధతో..

-రమణ కొంటికర్ల

RELATED ARTICLES

Most Popular

న్యూస్