పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు కోసం ప్రభుత్వం, పోలీసులు చౌక బారు విధానాలు అవలంబించారని పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ ఆరోపించింది. అరెస్టు చేసేందుకు వచ్చినపుడు గడువు ముగిసిన టియర్ గ్యాస్ వాడారని దీంతో అనేక మంది కార్యకర్తలకు ఆరోగ్య సమస్యలు వచ్చాయని ఆరోపించారు. అదే సమయంలో బుల్లెట్లు ఉపయోగించారని ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ హత్యకు కుట్ర జరుగుతోందని పిటిఐ నేతలు ఆరోపిస్తున్నారు.
ఇంత జరిగినా పోలీసుల ఆపరేషన్ విఫలమైంది. లాహోర్‌లో ఇమ్రాన్ ఖాన్ ను నిర్బంధించేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం సక్సెస్ కాలేదు. ప్రస్తుతం ఆయన ఇంటి వద్ద పీటీఐ కార్యకర్తలు, పోలీసుల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్నది. తోషాఖానా కేసులో ఇమ్రాన్ అరెస్టు వారెంట్ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేసేందుకు మంగళవారం పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ మద్దతుదారులు పోలీసుల్ని అడ్డుకున్నారు. దీంతో టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఓ దశలో కాల్పులు కూడా జరిగాయి. అయినా ఇమ్రాన్ ఇంట్లోకి పోలీసులు వెళ్లలేకపోయారు.
తనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే అకస్మాత్తుగా తనను అరెస్టు చేసేందుకు పోలీసులు వచ్చినట్లు ఇమ్రాన్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. తనను అరెస్టు చేసేందుకు పోలీసులు వస్తున్నట్లు న్యూస్‌లో చూశామని ఆయన చెప్పారు. అయినా తాను అరెస్టు కావడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. జైలు జీవితం గడిపేందుకు తాను మెంటల్‌గా ప్రిపేరయ్యానని, ఎన్నాళ్లు జైలులో ఉంటానో తెలియదన్నారు. మార్చి 18వ తేదీ వరకు తాను ముందస్తు బెయిల్ తీసుకున్నానని, కానీ 14వ తేదీన తనను ఎందుకు అరెస్టు చేయాలనుకున్నారో తెలియదన్నారు.
ఇమ్రాన్ అరెస్టు కోసం సాగిన ఆపరేషన్‌లో 33 మంది పోలీసులు గాయపడ్డారు. ప్రస్తుతం లాహోర్‌లోని జమన్ పార్క్ వద్ద భారీ సంఖ్యలో పోలీసుల్ని మోహరించారు. పోలీసులు తనను అరెస్టు చేసేందుకు మళ్లీ తన ఇంటికి రానున్నట్లు ఆయన తాజా వీడియోలో ఆరోపించారు. తనను జైలులో వేయడం లండన్ ప్లాన్ అన్నారు. ఎత్తుకువెళ్లి చంపేయాలని ప్రభుత్వం ప్లాన్ వేసినట్లు చెప్పారు.