పాకిస్తాన్ లో సుస్థిర ప్రభుత్వం నెలకొంటేనే శాంతి స్థాపన సాధ్యమని మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం ఐదేళ్ళు పాలన సాగిస్తేనే… ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుందన్నారు. ప్రజాప్రభుత్వాలు రెండేళ్లకు ఒకసారి కూలిపోవటంతో అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట దిగజారుతోందని ఇస్లామాబాద్ లో ఆందోళన వ్యక్తం చేశారు.
పాక్ లో అవినీతి, రాజకీయ అస్థిరత దేశ అభివృద్దిపై ప్రభావం చూపుతోందని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. మిలిటరీ పెత్తనంపై ఇమ్రాన్ పరోక్షంగా విమర్శలు చేశారు. దేశంలో అదృశ్య శక్తుల జోక్యంతో ప్రజా ప్రభుత్వాలకు విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో రాజకీయ అస్థిరతతో అంతర్జాతీయంగా పెట్టుబడులు కూడా రావటం లేదని, పారిశ్రామికంగా దేశం తిరోగమనంలో పయనిస్తోందన్నారు.
షేహబాజ్ షరీఫ్ ప్రభుత్వం తొందరగా సార్వత్రిక ఎన్నికలు నిర్వచించాలని ఇమ్రాన్ ఖాన్ డిమాండ్ చేశారు. కుట్ర పూరితంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూలదోసి దొడ్డిదారిలో పాలనా పగ్గాలు చేపడితే…దాని ప్రభావం అంతర్జాతీయంగా ప్రతికూలంగా ఉంటుందని ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించారు.
మరోవైపు పాకిస్తాన్ రూపాయి వేగంగా పడిపోతోంది. డాలర్ తో పాక్ రూపాయి మారకం 232 రూపాయలుగా ఉంది. దీంతో దేశంలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
Also Read : పాక్ ప్రభుత్వానికి ఇమ్రాన్ హెచ్చరిక