హిమాచల్ ప్రదేశ్ లో కుండపోత వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఎడతెరిపి లేని వర్షాలకు సట్లేజ్ నది ఉదృతంగా ప్రవహిస్తుంటే, కొండ చరియలు విరిగిపడి రోడ్లపై రాకపోకలు నిలిచిపోయాయి. కిన్నూర్ జిల్లా చౌర ప్రాంతంలో కొండ చరియలు పడి బండరాళ్ళు, మట్టి భారీగా చేరటంతో వాహనాలు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. ఓ వైపు సట్లేజ్ నది ప్రవాహం, మరోవైపు పేకమేడల్లా జారుతున్న కొండచరియలతో భయానక వాతావరణం నెలకొంది.
రోడ్డు పునరుద్దరణ పనులు రెండు రోజులుగా జరుగుతున్నా పురోగతి కనిపించటం లేదు. కుంభవృష్టి ధాటికి మరో నాలుగు రోజుల వరకు జాతీయ రహదారిపై రాకపోకలకు అవకాశం లేదు. రెండు రోజుల్లోగా అత్యవసర వాహనాలు వెళ్లేందుకు అనువుగా రహదారి పునరుద్దరణకు ప్రయత్నిస్తామని మిలిటరీ ఉన్నతాధికారులు వెల్లడించారు. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ పర్యవేక్షణలో కొండ చరియలు తొలగించే పనులు రేయింబవళ్ళు ముమ్మరంగా సాగుతున్నాయి.
పాకిస్తాన్ సరిహద్దు నగరం పంజాబ్లోని ఫిరోజ్ పూర్ నుంచి లుధియానా, చండిగడ్, షిమ్లా, శిప్కిల కనుమ మీదుగా చైనా సరిహద్దును కలిపే 5వ నెంబర్ జాతీయ రహదారి భారత సైన్యానికి గుండెకాయ వంటిది. రెండు కీలకమైన సరిహద్దులను కలిపే జాతీయ రహదారిపై అనేక వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. భారత సైన్యం అధ్వర్యంలో ప్రయాణికులకు అన్నపానియాలు అందిస్తున్నారు.