Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంరోజుకొక్కసారైనా నవ్వాలని జపాన్ లో ప్రభుత్వ ఉత్తర్వులు

రోజుకొక్కసారైనా నవ్వాలని జపాన్ లో ప్రభుత్వ ఉత్తర్వులు

“నవ్వవు జంతువుల్; నరుడె నవ్వును; నవ్వులె చిత్తవృత్తికిం
దివ్వెలు; కొన్నినవ్వు లెటు తేలవు; కొన్ని విషప్రయుక్తముల్;
పువ్వులవోలె ప్రేమరసముం గురిపి౦చు విశుద్ధమైన లే
నవ్వులు సర్వదు:ఖదమనంబులు; వ్యాధులకున్ మహౌషధుల్”
-గుర్రం జాషువా పద్యం

అర్థం:-
జంతువులు నవ్వలేవు. మనిషి మాత్రమే నవ్వగలడు. మన మనస్సుకు నవ్వులే దివ్వెలు. కొన్ని అర్థం కాని నవ్వులు. కొన్ని విషపు నవ్వులు. పువ్వుల్లో మధువులా ప్రేమరసం కురిపించే నవ్వులు అన్ని దుఃఖాలను దూరం చేస్తాయి. వ్యాధులను దూరం చేసే మహా ఔషధాలు- నవ్వులు

మరీ అంతగా మహా చింతగా మొహం ముడుచుకోకలా…
పనేం తోచక పరేషానుగా గడబిడ పడకు అలా…
మతోయేంతగా శ్రుతే పెంచక విచారాల విలవిల
సరే చాలిక అలా జాలిగా తికమక పెడితే ఎలా?
కన్నీరై కురవాలా మన చుట్టూ ఉండే లోకం తడిసేలా…
ముస్తాబే చెదరాలా నిను చూడాలంటే అద్దం జడిసేలా…
ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా
కదా మరెందుకు గోల?
అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా వృథా ప్రయాస పడాలా?

ఎండలను దండిస్తామా? వానలను నిందిస్తామా? చలినెటో తరిమేస్తామా ఛీ పొమ్మని!
కస్సుమని కలహిస్తామా? ఉస్సురని విలపిస్తామా?
రోజులతో రాజీపడమా సర్లెమ్మని!
సాటి మనుషులతో మాత్రం సాగనని ఎందుకు పంతం?
పూటకొక పేచీ పడుతూ ఏం సాధిస్తామంటే ఏం చెబుతాం?

చెమటలేం చిందించాలా? శ్రమపడేం పండించాలా-
పెదవిపై చిగురించేలా చిరునవ్వులు!
కండలను కరిగించాలా? కొండలను కదిలించాలా-
చచ్చి చెడి సాధించాలా సుఖశాంతులు!
మనుషులనిపించే ఋజువు మమతలను పెంచే ఋతువు
మనసులను తెరిచే హితవు వందేళ్ళయినా వాడని చిరునవ్వు”
-సిరివెన్నెల పాట

జాషువాలు, సిరివెన్నెలలు, రేలంగులు, రమణా రెడ్లు, రాజబాబులు, జంధ్యాలలు, చార్లీ చాప్లిన్లు, కపిల్ శర్మలు ఎవరెంతగా చెప్పినా…మనం నవ్వుతామా! ఏమిటి? నవ్వితే నోటి ముత్యాలు రాలిపోయి…కోట్లకు కోట్లు కూడబెట్టుకున్న సొమ్ము కోల్పోతాము కదా? అందుకే నవ్వాల్సిన చోట కూడా ఏడ్చి మొహం కడుక్కుంటూ ఉంటాం.

సిరివెన్నెలకేమి నాలుగు మాటలు పేర్చి…మంత్రించి…మాయ చేస్తాడు. మనం నవ్వాలంటే ఎంత శ్రమ పడాలి? ఎంత ఖర్చు పెట్టాలి? పొట్ట చెక్కలయ్యేలా నవ్వాలంటే ఎంత ఆయాసపడాలి? బుగ్గ సొట్టపడేలా నవ్వాలంటే ఎంత కఠోర సాధన చేయాలి? పెదవి మీద వెలుగులు చిందేలా నవ్వాలంటే ఎన్ని వేల మెగావాట్ల విద్యుత్ ఖర్చు పెట్టాలి? మొహం వేనవేల కాంతులతో వెలిగేలా నవ్వీ నవ్వకుండా నవ్వుల పువ్వులు పూయించాలంటే ఎన్ని వేల హెక్టార్లలో పువ్వుల తోటలను ఎంత కష్టపడి పెంచాలి?

* చిరునవ్వు లేదా మందహాసం
* పడి పడి/ విరగబడి నవ్వు
* వికటాట్టహాసం
* పకపక నవ్వు
* సుందర మందహాసం
* ముసిముసినవ్వు
* నవ్వుగాని నవ్వు
* విషపు నవ్వు
* ఎగతాళి నవ్వు
* వెకిలి నవ్వు

ఇలా నవ్వుల్లో నానా నవ్వులు ఉండవచ్చుగాక. ఇందులో వెకిలి నవ్వొక్కటే మనకు బాగా అలవాటయ్యింది; నచ్చింది; వచ్చింది!

-సునిశిత హాస్యం
-సుమధుర హాస్యం

అని ఉంటే ఉండవచ్చుగాక. మనకు బాగా తెలిసింది; నచ్చింది; వచ్చింది అపహాస్యం ఒక్కటే!

ఇందులో మన తప్పు కూడా పెద్దగా ఏమీ ఉండకపోవచ్చు. ఎక్కడికక్కడ మన బతుకులు నవ్వులపాలైనప్పుడు విడిగా నవ్వడమెందుకు? అన్నది మన టెక్నికల్ అండ్ లాజికల్ పాయింట్ అయి ఉండవచ్చు.

బొడ్డూడని పసికందు ఎల్ కె జి అడ్మిషన్ కోసం తల్లిదండ్రులను ఇంటర్వ్యూలు చేసేప్పుడు మనం నవ్వాలి. కానీ…నవ్వలేదు. ఒకటో తరగతిలో ఐ ఐ టీ లాంగ్ టర్మ్ సెల్ఫ్ డిస్ట్రక్షన్ మెగా ఇంటెన్సివ్ అండమాన్ సెల్ స్పెషల్ కోచింగ్ కు ఫీజు కడుతున్నప్పుడు నవ్వాలి. కానీ…నవ్వలేదు. వెయ్యి ఉద్యోగ ఖాళీలకు ఇరవై లక్షలమంది ఉన్నత చదువులు చదివినవారు పోటీలు పడుతున్నప్పుడు నవ్వాలి. కానీ…నవ్వలేదు. మనం ఎన్నుకున్న పాలకులు మనల్ను భావోద్వేగాల చదరంగంలో పావులు చేసి ఆడుకుంటున్నప్పుడు నవ్వుకోవాలి. కానీ…నవ్వలేదు.

…అప్పుడు నవ్వలేదు.
…ఇప్పుడు నవ్వే అధికారం లేదు.
…ఎప్పటికీ నవ్వలేము!

రోజువారీ జీవితంలో చిన్న చిన్న ఆనందాలకు పొంగిపోయి…తనివితీరా నవ్వడం మహాపరాధమన్న భయంతో నవ్వడం మానేశాము. ఎదురయ్యే ప్రతి మనిషి మీదికి నవ్వుల పువ్వులు చల్లితే ఎంత అనర్థమో అని భయపడి నవ్వడం మానేశాము. హాస్యం పేరిట పరమ బూతు మోతెక్కితేనే నవ్వడం అలవాటు చేసుకున్నాము.

“నలుగురు కూర్చుని నవ్వే వేళల
నా పేరొకతరి తలవండి!”
అని పుత్తడి బొమ్మ పూర్ణమ్మ చేత మన యుగకవి గురజాడ చెప్పించాడు.

“నలుగురు కూర్చుని
రోజుకొకసారైనా
నవ్వండి!”

అని జపాన్ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. లేకపోతే నలుగురు కూర్చుని పూటకొకసారి ఏడవాల్సి వస్తుందని- నవ్వడంలో దాగిన ఆరోగ్య రహస్యాల మీద పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టింది. “గుండె జబ్బులను దూరం చేసే దివ్యౌషధం- నవ్వు” అని మన గుర్రం జాషువా ఏనాడో చెప్పిన మాటనే ఇప్పుడు జపాన్ ప్రభుత్వం సాక్ష్యాధారాలతో నిరూపిస్తోంది.

మనలో మన మాట.
ఇప్పటికిప్పుడు అలవాటులేని, అలవాటు మరచిన నవ్వు నవ్వి గుండెలను భద్రపరచుకోవాల్సిన అవసరం మనకేముంది చెప్పండి. ఆ మందస్మిత వికటాట్టహాస చిట్కాలు, ఆరోగ్య రహస్యాలు, జాగ్రత్తలు గుండెలు ఉన్నవారికి.

అసలే- నవ్విన నాప చేనులన్నీ పండే రోజులు!
జాగ్రత్త! పొరపాటున నవ్వేరు!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్