మహారాష్ట్రలో బీజేపీకి గట్టి షాక్ తలిగింది. బీజేపీ ఆ పార్టీ సైద్ధాంతిక గురువుగా భావించే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్)కు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే నాగ్‌పుర్‌లో ఘోర ఓటమి పాలైంది. నాగ్‌పుర్ డివిజన్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ తేడాతో కమలం పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి పరాజయం పాలయ్యారు. మొత్తం పోలైన 34,360 ఓట్లకు గానూ మహావికాస్ ఆఘాడీ (ఎంవీఏ) కూటమి మద్దతు ఇచ్చిన అభ్యర్థి సుధాకర్ అద్బాలే 16,700 ఓట్లు సాధించగా, బీజేపీ మద్దతు అభ్యర్థి నాగో గనార్‌కు 8,211 ఓట్లు మాత్రమే పడ్డాయి. బీజేపీ కీలక నేతలైన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో పాటు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు నాగ్‌పుర్ సొంత ప్రాంతం కావడం గమనార్హం. అదేవిధంగా ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయం కూడా నాగ్‌పుర్‌లోనే ఉన్నది. ప్రస్తుతం నాగ్‌పుర్ ఎంపీగా గడ్కరీ ఉండగా, నాగ్‌పుర్ (సౌత్ వెస్ట్) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఫడ్నవీస్ గత 3 దఫాలుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. నాగ్‌పుర్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఆరు అసెంబ్లీ స్థానాల్లో నాలుగింటిలో బీజేపీ ఎమ్మెల్యేలే ఉన్నారు.
ఏక్‌నాథ్ షిండే బీజేపీ పంచన చేరి సీఎం అయిన తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవడం ప్రాధాన్యం సంతరించుకొన్నది. జనవరి 30న మూడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానాలకు ఎన్నికలు జరుగగా, గురువారం ఓట్ల లెక్కింపు చేపట్టారు.ఔరంగాబాద్ (ఉపాధ్యాయ), అమరావతి (గ్రాడ్యుయేట్) స్థానాలకు కూడా ఎన్నికలు జరిగాయి. కడపటి వార్తలు అందే సమయానికి నాగ్‌పుర్‌లో ఎంవీఏ మద్దతు అభ్యర్థి, కొంకణ్‌లో బీజేపీ అభ్యర్థి గెలుపొందగా, మిగతా 3 స్థానాల్లో పూర్తి ఫలితాలు తెలియరాలేదు.