Thursday, November 21, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమా కాలనీ కథలు-2

మా కాలనీ కథలు-2

ఒక్క మాటలో చెప్పాలంటే “మరక మంచిదే” అన్నట్లు “మురికి మంచిదే” అనుకోవడం తప్ప మా కాలనీ చేయగలిగింది లేదు. రోజులో అన్ని వేళల్లో, సంవత్సరంలో అన్ని రుతువుల్లో అలా రోడ్లమీద మురుగు నీరు పొంగి ప్రవహించడానికి వీలుగా ప్రణాళిక రచించిన టౌన్ ప్లానింగ్ వారి అమేయ, అమోఘ, అనితరసాధ్యమైన సాంకేతిక పరిజ్ఞానం భావితరాలకు ఒక పాఠం. నగర నిర్మాణ, నిర్వహణకు ఒక గుణపాఠం.

జాతకాలు చెప్పేవారిమీద ఒక ఫేమస్ జోక్ ప్రచారంలో ఉన్నా…అందులో ఎంతో గాంభీర్యం, వాస్తవ దృక్పథం ఉన్నాయి. “నాయనా! నీకు ఏలినాటి శని డబుల్ ధమాకాగా రెండు సార్లు పట్టి పీడిస్తోంది. కాబట్టి పద్నాలుగేళ్లు అష్టకష్టాలు తప్పవు” అన్నాడు జోస్యుడు.
“…అయితే పద్నాలుగేళ్ల తరువాత కష్టాలు తొలగిపోతాయి కదా?” అన్నాడు గ్రహపీడితుడు.
“లేదు నాయనా! ఆ కష్టాలు అలవాటవుతాయి. తరువాత అవి నీకు కష్టంగా అనిపించవు!” అన్నాడు జోస్యుడు.

అలా పద్నాలుగేళ్లుగా మురుగులోనే పాలు-పెరుగు కొంటూ; మురుగులోనే పూలు-పళ్లు తెచ్చుకుంటూ; మురుగులోనే పానీ పూరీ- బజ్జీలు తింటూ; మురుగులోనే శుభాశుభ కార్యాలు చేసుకుంటున్న మాకు ఇప్పుడు మురుగు లేకపోతే…పుష్పకవిమానంలో కమల్ హాసన్ లా బతకలేమేమోనన్న దిగులు కూడా ఉంది.

మొలలోతు కష్టాల్లో మోకాటి లోతు ఆనందం ఏమిటంటే-
పొంగే మురుగు కంపులో రోడ్డుమీద ఎలా ముక్కు మూసుకుని నడవాలో మా కాలనీ నేర్చుకుంది. ఫుట్ పాత్ ఏదో! రోడ్డు ఏదో! తెలియనంతగా పొంగే మురుగు నీటిలో నడవడానికి వీలుగా కొందరు అక్కడక్కడా ఇటుకలు, రాళ్లు, చెక్కలను పేర్చారు. వాటిమీద నడుస్తూ ఇప్పటిదాకా ఒక్కరికి కూడా కాళ్ళు-చేతులు విరగలేదు.

శంకరాచార్యుడు పిలవగానే పద్మపాదుడు నీళ్ల మీద నడిచి వస్తుంటే...అతడు నీళ్లల్లో పడిపోకుండా కింది నుండి తామరలు పుట్టడంతో అతడికి “పద్మపాదుడు” అన్న పేరొచ్చిందన్నది 800 ఏళ్ల కిందటి కథ. ఆ కథ నిజమేనని మా కాలనీలో మురుగులో పడకుండా రాళ్లమీద నడిచేవారిని చూస్తే నాస్తికులైనా ఒప్పుకుంటారు. చాలాసార్లు మమ్మల్ను కాపాడడానికి రాళ్లు పుట్టుకొస్తూ ఉంటాయి. ఆయన పద్మపాదుడు. మేము శిలాపాదులం. మిగతా మహిమలన్నీ సేమ్ టు సేమ్!

బడి పిల్లలు మురుగునీటి పాలు కాకుండా తల్లులు ఉదయాన్నే జాగ్రత్తలు చెబుతూ ఉంటారు. మురుగు నీటి మీద బండరాళ్లు పేర్చుకుని కూడళ్లలో తోపుడు బండ్లు ఎక్కడ పెట్టుకోవాలో కొందరికి తెలిసిపోయింది.

పున్నమినాగు సినిమాలో రోజూ అన్నంలోకి చుక్క విషం కలుపుకుని తినడంవల్ల హీరోను పాము కరిచినా…పాము చస్తుందే కానీ…హీరోకు ఏమీ కాదు. అలా రోజూ అలవాటైన మా కాలనీ మురుగు కూడా మమ్మల్ను ఏమీ చేయలేదు. మమ్మల్ను కడిగే గంగ లేదు. ఉన్నా చాలదు.

కొస మురికి:-
ఈ మురుగు భరించలేక ఇరవై అయిదేళ్లుగా మా కాలనీలో ఉంటున్న ఒక బ్యాంక్ మేనేజర్…ఒక ఆకాశ హర్మ్య గేటెడ్ కమ్యూనిటీలోకి ముచ్చటపడి మారాడు. అక్కడ వర్షాకాలంలో పార్కింగ్ లోకి మురుగునీరు వచ్చి…నెల రోజులు కార్లు బయటికి రాలేదట. తేలిన ఆయన కారులో ఒక ముసలి మొసలి గోళీకాయల కళ్లతో పలకరించేసరికి…మళ్లీ మా కాలనీకే వచ్చేశాడట.

“ఎంత మంచి కాలనీ అండీ మనది? వరదలు ఊరిని ముంచెత్తిన ఏనాడన్నా మన కార్లు మునిగాయా? మన ఇళ్లల్లోకి మురుగునీటితోపాటు ఎప్పుడన్నా మొసళ్లు, తేళ్లు, పాములు, ఎండ్రకాయలు వచ్చాయా? సచ్ ఎ బ్యూటిఫుల్ కాలనీ…థాంక్ గాడ్…యామ్ బ్యాక్…”
అని ఆగకుండా చెప్పుకుపోతున్నాడు.

“తెలిసితే మోక్షము – తెలియకున్న బంధము
కలవంటిది బదుకు -ఘనునికిని
తగినయమృతమేది? – తలవగ విషమేది?”
అని అన్నమయ్య అన్న మాటే మా కాలనీకి మూలమంత్రం!

రేపు:-
రాంగ్ పార్కింగే రైట్!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్