Gift De(a)ed:
స్టాచ్యుటరి వార్నింగ్:-
గుండె బలహీనంగా ఉన్నవారు, అతి సున్నిత మనస్కులు దీన్ని చదవకండి.
అబ్బాయి:-
వస్తావా? నిన్నేడిపించినవాడి గుండె కోసి కొమ్మకు వేలాడేశా. నీకు లవ్ లెటర్ రాసిన వాడి వేళ్లు కత్తిరించి వాడి జేబులోనే పెట్టా.
అమ్మాయి:-
అబ్బ! ఎంత చల్లని వార్త చెప్పావ్! వస్తున్నా కానీ…అంతదాకా ఆగలేను వాడి గుండె, వేళ్ల ఫోటోలు అర్జంటుగా వాట్సాప్పులో పెట్టవా?
అబ్బాయి:-
ఇదుగో…చూసుకో. ఇంకేం ఫికర్ కాకు.
అమ్మాయి:-
ఓ మై గాడ్! ఇట్స్ రియల్ . యు ఆర్ గ్రేట్. ఇదో నీకు రిటర్న్ గిఫ్ట్ గా గూగుల్ పే లో పదిహేను వందల రూపాయలు పంపుతున్నా. పండగ చేసుకో.
అబ్బాయి:-
అంత పెద్ద అమౌంటా?
థాంక్ యు. థాంక్ యు.
లొకేషన్ పెట్టాను. వచ్చి చచ్చినవాడిని చూసి వెళ్లు.
అమ్మాయి:-
పది నిముషాల్లో వస్తున్నా. ఈలోపు ఒక శాండ్ విచ్, ఒక థమ్స్ అప్ తీసుకుని రా. ఆకలిగా ఉంది.
అబ్బాయి:-
ఓకె…ఓకే.
అబ్బాయి స్వగతంలో:-
హమ్మయ్య. ఈ హత్యతో నా ప్రేమను గెలిపించుకున్నాను. ఇక నా ప్రేయసికి ఏ అడ్డూ లేదు. ప్రేమ ప్రేమను ప్రేమిస్తుంది. నా ప్రేమ హత్యను ప్రోత్సహించింది. నేరం నాది కాదు- ప్రేమది. ప్రేమకు సంకెళ్లు వేస్తారా? ప్రేమను జైల్లో పెడతారా? ప్రేమను హత్య చేస్తారా?
అమ్మాయి స్వగతంలో:-
నా లవర్ ఎంత గొప్పవాడో! నా గుండెకు అడ్డొచ్చిన గుండెను ఎన్ని గుండెలు నీకు? అని కోసి అవతల పారేశాడు. ఇక మా ప్రేమ రెక్కలు విప్పి స్వేచ్ఛగా వినువీధుల్లో విహంగమై తిరుగుతూ ఉంటుంది.
పోలీసులు స్వగతంలో:-
లవర్ హత్య చేస్తే అభినందనపూర్వక గిఫ్ట్ గా 1,500/- ఆన్ లైన్లో పంపే రోజులు వచ్చాయా? అంటే వెయ్యికి, పదిహేను వందలకు ఒక హత్యా? ఈ లెక్కన ప్రేమకు అడ్డొచ్చే గుండెలన్నీ ఇలాగే కోతకు గురవుతాయా? హతవిధీ!
ప్రపంచం స్వగతంలో:-
ఏమిటిది? ఎక్కడున్నాం మనం?
ప్రేమిస్తే చావు. ప్రేమించకపోతే చావు. ఎలాగయినా చావేనా?
చచ్చే చావొచ్చిందే!
ప్రేమ స్వగతంలో:-
ప్రేమను అంగీకరించడానికి, నిరాకరించడానికి ఏ మనసుకయినా హక్కు ఉంటుంది కదా? అవునంటే అవును. కాదంటే కాదని వదిలేయాలి.
చంపేది ప్రేమ ఎలా అవుతుంది?
చస్తే ప్రేమ ఏమి మిగులుతుంది?
ఇవేమి చదువులు?
ఇవేమి సంస్కారాలు?
దీన్ని ప్రేమంటారా?
గమనిక:-
ఇందులో పాత్రలు, సంభాషణలు కేవలం గిల్పితం!
“Any resemblance to real persons, living or dead, is purely coincidental”
-పమిడికాల్వ మధుసూదన్
[email protected]
Also Read :
Also Read :