Sunday, January 19, 2025

భాష వివస్త్ర

Single Letter: ఈమధ్య ఒక యాంకరమ్మ నవరాత్రి దసరా సందర్భంగా తొమ్మిదిరోజులకు తొమ్మిది రకాల వస్త్రాలతో దర్శనమిస్తాను అని సోషల్ మీడియాలో గొప్పగా ప్రకటించుకుంది. అది ఆమె నిర్నిరోధమయిన స్వేచ్ఛ. మనం కాదనడానికి వీల్లేనిది. ఈ తొమ్మిది రోజుల వస్త్ర ప్రదర్శనకు ఆమె పెట్టుకున్న పేరు “నవస్త్ర”.

నవరాత్రి వేళ “నవస్త్ర” ఆచారం దేవీభాగవతంలో కానీ, దుర్గా సప్తశతిలో కానీ ఉన్నట్లు లేదు. బెంగాల్లో ఏమన్నా ఉందేమో తెలియదు. పండగ రోజూ పాత వస్త్రమేనా? తొమ్మిది రోజులకు తొమ్మిది కొత్త బట్టలు కట్టుకుంటే…మంచిదే. జుట్టున్నమ్మ ఏ కొప్పయినా పెట్టుకోవచ్చు.

అయితే…ఇలాంటి కాన్సెప్ట్ లకు పేర్లు-
నవస్త్ర
వివస్త్ర
నిర్వస్త్ర
కువస్త్ర
దుర్వస్త్ర
అని పెట్టకూడదు.

“వస్యతే అనేనాంగమితి వస్త్రం” అని అమరకోశం వ్యుత్పత్తి అర్థం. అంటే శరీరాంగాలను కప్పి ఉండేది వస్త్రం.

న వస్త్ర, వివస్త్ర, నిర్వస్త్ర అంటే బట్టలు లేనిది.
కువస్త్ర అంటే చింపిరి బట్టలతో ఉన్నది లేదా సరైన బట్టలు లేనిది.
ఇందులో ఇంకా ఆత్మనే పది, పరస్మనే పది అర్థాలుగా సూక్ష్మమయిన తేడాలు కూడా ఉన్నాయి. అంటే తనకు తానే బట్టలు తొలిగించుకున్నప్పుడు ఏమనాలో? ఇతరులు తొలగిస్తే ఏమనాలో? తనకు తాను తొలగించక, ఇతరులు తొలగించక బట్టలు వాటంతట అవే తొలగిపోతే ఏమనాలో? వ్యాకరణం స్పష్టంగా నిర్వచించింది.

ఆమె వస్త్రమే దసరా పూట అస్త్రమై జగతిని రక్షిస్తుందనుకుని…ఆ అర్థంలో “నవస్త్ర” పెట్టి ఉంటే…నవ ప్లస్ అస్త్రం సవర్ణ దీర్ఘమై “నవాస్త్ర” అవుతుంది కానీ…నవస్త్ర కాదు. నవాస్త్ర అంటే తొమ్మిది అస్త్రాలు అని తప్ప మరో అర్థానికి ఆస్కారమే లేదు.

భాషలో వివస్త్ర, కువస్త్ర, నిర్వస్త్ర అవస్థలను కాసేపు గాలికి వదిలేసి మన యాంకరమ్మ “నవస్త్ర”కే పరిమితమవుదాం. ఆమె దసరా సందర్భంగా బట్టలు లేకపోవడం అన్న ప్రదర్శనగా భావించి “న వస్త్ర” నామకరణం చేసి ఉంటే…ఆమె భాషా పరిజ్ఞానికి శాలువా కప్పి అభినందించాలి. అలా కాకుండా తొమ్మిది రోజుల నవరాత్రిలో “నవ”; వస్త్రాల్లో “వస్త్ర” కలిపి “నవస్త్ర” మాటను పుట్టించి ఉంటే మాత్రం తెలుగు వివస్త్ర కాకుండా ఎవరో ఒకరు బట్టలు కప్పాలి.

భాషలో మాటలకు కాలగతిలో అవ్యాప్తి, అతివ్యాప్తి దోషాలుంటాయి. ఒకప్పుడు కంపు అంటే వాసన. అంతే. ఇప్పుడు కంపు అంటే చెడు వాసన. ఒకప్పుడు చీర అంటే విస్తారంగా చెరిగి ఉన్నది. భీముడు చీర సవరించి మల్లయుద్ధంలోకి దిగేవాడు. ఇప్పుడు చీరలు, పంచెలు వేరయ్యాయి.

అలా ఈ “నవస్త్ర” పాపులర్ అయి భవిష్యత్తులో దసరా రోజుల్లో అందరూ నవస్త్రగానే ఉండే రోజులు కూడా వస్తాయేమో!

“నవస్త్ర” నామకరణం చేసిన నోటితోనే…
“యాదేవీ నవస్త్రరూపేణ సంస్థితా…”
అని మంత్రాన్ని కూడా మార్చి నవరాత్రుల్లో “నవస్త్ర” ప్రత్యేక పూజలు కూడా చేస్తారో…ఏం పాడో!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

గాడ్ ఫాదర్ మదగజమా!

RELATED ARTICLES

Most Popular

న్యూస్