Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమత్తు ప్రపంచం పిలుస్తోంది! రా! కదలిరా!

మత్తు ప్రపంచం పిలుస్తోంది! రా! కదలిరా!

వాల్మీకి రామాయణం సుందరకాండ. సీతాన్వేషణలో భాగంగా వంద యోజనాల సముద్రం దాటి…చీకటి పడేవరకు ఆగి…పిల్లి పిల్లంత రూపంలోకి మారి…రావణుడు నిద్రిస్తున్న పుష్పకవిమానంలోకి వెళతాడు హనుమంతుడు. ఆ పుష్పక విమానం నేలను తాకకుండా గాల్లో తేలుతూ ఉంటుంది. అది ఒక పెద్ద నగరమంత విమానం. మందు విందు పొందులతో, గానా బజానాలతో అలసి ఒళ్ళుమరచి నిద్రిస్తున్నాడు రావణుడు. అక్కడ గదుల్లో మాంసాహారాలు, మద్యం రకాలు ఎన్నెన్ని ఉన్నాయో వాల్మీకి నిర్మొహమాటంగా పద్దు రికార్డు చేశాడు.

మన మందు పార్టీలు మొదట వీకెండ్. తరువాత సెలవు రోజులు. ఆపై పండగరోజులు. శుభకార్యాలు.  ప్రత్యేక దినాలు…చివరికి ప్రతిరోజూ ఎలా అయ్యిందో…అలాగే త్రేతాయుగంలో రావణుడికి రోజూ మందు పార్టీనే.

తాగడం మంచిదా? చెడ్డదా? అన్న చర్చ ఏనాడో తెరవెనక్కు వెళ్ళిపోయింది. “మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం” అన్న స్టాచుటరీ వార్నింగ్ టెక్స్ట్ ఉంటే చాలు. ఎంత మద్యమైనా తాగచ్చు.

ఇప్పటి సినిమాలు, సీరియళ్లు, వెబ్ సీరీస్…అన్నిట్లో “మద్యం ఆరోగ్యానికి హానికరం” అన్న స్టాచుటరీ హెచ్చరిక సాక్షిగా మద్యం ఏరులై పారుతూనే ఉంటుంది. చిన్నా పెద్ద, రాజు పేద, స్త్రీపురుష భేదం లేకుండా ఇప్పుడు సమాజం తాగడంలో సమానత్వాన్ని సాధించింది. ఇదొక మహా మద్యోదయం. ఇదొక మత్తోదయం.

ఏ రాష్ట్రంలో అయినా ఇప్పుడు మంచి నీళ్ల బడ్జెట్ కంటే మద్యం మీద ఖర్చు కనీసం మూడు, నాలుగు రెట్లు అధికం. కొన్ని రాష్ట్రాలకు మద్యమే ప్రధానమయిన ఆదాయ వనరు. ఇందులో మంచి చెడ్డల గురించి మాట్లాడ్డం దండగ. మద్యం దానికదిగా ఒక పండగ.

మహా నగరాల్లో పగలూ రాత్రి తాగేవారు తాగుతూ ఊగుతూ జోగుతూనే ఉంటారు. తాగి నడిపి ప్రమాదాలు చేసేవారు చేస్తూనే ఉంటారు. మధ్యలో అమాయకులు పోయేవారు పోతూనే ఉంటారు. ఉండేవారు తాగేవారు పెట్టే బాధలు భరించలేక ఎప్పుడు పోతారో తెలియక ఉంటూ ఉంటారు.

బాధలు మరచిపోవడానికి తాగేవారు;
బాధ పెట్టడానికి తాగేవారు;
బాధపడడానికి తాగేవారు;
ఆనందం పట్టలేక తాగేవారు;
ఆనందం కోసం తాగేవారు;
మర్యాద కోసం తాగేవారు;
మర్యాదగా తాగేవారు;
అమర్యాదగా తాగేవారు;
ఏమీ తోచక తాగేవారు;
వ్యసనంగా తాగేవారు;
ఎందుకు తాగుతున్నారో తెలియక తాగేవారు…ఇలా ఈ లిస్ట్ కు అంతులేదు. వీకెండ్ తాగకపోతే గుండె ఆగిపోతుంది కాబట్టి గుండెను గౌరవించి ఎక్కువ మంది వీకెండే ఎక్కువగా మిక్కిలి మక్కువగా తాగుతూ ఉంటారు.

సమాజం ఎప్పుడూ ముందుకు పురోగమిస్తూనే ఉంటుంది. ప్రగతిశీలత దాని స్వభావం. దావత్ మందు పార్టీల్లో గ్లాసుల గలగలలు, మాంసం ముక్కల ఘుమఘుమలు, పీల్చే పొగల ధుమధుమలు ఓల్డ్ ఫ్యాషన్. కొంచెం కొకైన్, కొంచెం గంజాయి, కొంచెం హుక్కా, కొంచెం స్టఫ్ దట్టించి…ఒళ్ళు మరచి గుండెలు చిల్లులు పడే, చెవుల్లో రక్తం కారే డి జె చప్పుళ్లకు అర్ధనగ్న, పూర్ణ నగ్న అమ్మాయిలతో కలిసి డ్యాన్స్ లు చేయకపోతే ఆధునిక రేవ్ పార్టీల రేవళ్ళము కాకుండాపోతాం కదా! ఈ సిచుయేషన్ కు పేకముక్కల జూదం ఓల్డ్ ఫ్యాషన్. ఆధునిక క్యాసినో మిషన్లు మార్కెట్లో ఉన్నాయి కదా? ఇంత అత్యాధునిక రేవాతి రేవ్ పార్టీల్లో ఊరవతల కుండల్లో పులియబెట్టిన కృత్రిమ డైజోఫార్మ్ నాటు సారా తాగుతారా ఎవరైనా? విదేశీ మద్యం చల్లగా గొంతులో దిగుతూ ఉంటే వెచ్చగా బాధలన్నీ కరిగిపోవా?

నవనాగరిక సమాజంలో ఏం మనుషులండీ…మీరు? మా ఆనందం మాది. ప్రశాంతంగా రేవ్ పార్టీలు కూడా చేసుకోనివ్వరా? ఒకపక్క ప్రభుత్వమే మద్యం పాలసీలు తెచ్చి… టార్గెట్లు పెట్టి…అమ్మించి… తాగించి…  జోకొట్టి మత్తులో ముంచుతూ…మరో పక్క తెల్లపొడి స్టఫ్ పీల్చకూడదు. కొకైన్ కొనకూడదు. అమ్మాయిలతో నగ్ననృత్యాలు చేయకూడదు. సొంత ఫార్మ్ హౌసుల్లో క్యాసినో జూదాలు ఆడకూడదు- అనడం ద్వంద్వప్రమాణం కాదా!

నానా విష రసాయనాలతో పండించిన ఆహారాన్నే నేరుగా నోట్లోకి వేసుకుని తిని…బతికి బట్టకట్టగలుగుతున్నాం. ఆఫ్టరాల్ ఈ కొకైన్ తెల్లపొడులు ఏమి చేస్తాయి?

ఇప్పుడన్ని శుభకార్యాల్లో లిక్కర్ కాక్ టైల్ బార్ కౌంటర్లు పెట్టడం ఒక మర్యాదగా, విలువగా, సంప్రదాయంగా, ఆచారంగా మారింది.  ఆబ్కారీ శాఖకు అప్లై చేసుకుంటే అధికారికంగా ఫీజు కట్టించుకుని అనుమతులు కూడా ఇస్తోంది. రేప్పొద్దున అన్ని శుభకార్యాల్లో రేవ్ పార్టీల ఏర్పాట్లు తప్పనిసరి అవుతాయి. ఆచారాలే కాలగతిలో పాటించి తీరాల్సిన చట్టాలవుతాయి.

“సుముహూర్తే సావధాన…
సులగ్నే రేవుదానా…”

పదండి ‘తడి’పార్టీలకు!
పదండి ‘పొడి’పార్టీలకు!

“మత్తు ప్రపంచం,
మస్తు ప్రపంచం,
రేపటి రేవు ప్రపంచం పిలిచింది!
పదండి మందుకు!
పదండి కిక్కుకు!
పోదాం! పోదాం! పాతాళంలోకి!
జూదమాడుతూ,
పదం పాడుతూ,
హృదంతరాళం గర్జిస్తూ…
పదండి పోదాం!
వినపడలేదా మత్తు ప్రపంచపు అశనిపాతం?”

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్