కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాబోయే ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో 40 శాతం పార్టీ టికెట్లు మహిళలకే ఇస్తామని పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధి ఈ రోజు ఢిల్లీలో ప్రకటించారు. మహిళలకు అధికారం వస్తేనే సమాజం బాగుపడుతుందని, మహిళా ఆదికారత కోసం కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుందని ప్రియాంక వివరించారు. కుల, మతాలతో సంబంధం లేకుండా అర్హత ఉన్నవారిని పార్టీ అభ్యర్థులుగా బరిలోకి దింపుతామని వెల్లడించారు.
రాజకీయంగా మహిళలకు నిర్ణయాధికారం ఉండాలనే ఈ దిశగా నిర్ణయం తీసుకున్నామని ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని ప్రియాంక గాంధీ చెప్పారు. రాజకీయాల్లో మార్పురావాలంటే మహిళలకు అధికారం దక్కాలన్నారు. లఖింపూర్ ఖేరి, హత్రాస్ ఘటనలలో బాధితులకు న్యాయం జరగలేదని, బిజెపి ప్రభుత్వం దోషులకు కొమ్ము కాస్తోందని ప్రియాంక విమర్శించారు.
మహిళలకు 40 శాతం టికెట్లపై రాజకీయ విశ్లేషకులు కాంగ్రెస్ పార్టీని అభినందిస్తూనే రాబోయే కాలంలో ఆ పార్టీ మెడకు చుట్టుకుంటుందని అంటున్నారు. ఉత్తరప్రదేశ్ లో పార్టీ బలహీనంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారని, ఇదే డిమాండ్ పంజాబ్, ఉత్తరఖండ్ లో వస్తే ఎం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం దేశ రాజకీయాల్లో కొత్త శకానికి నాంది పలుకుతుందని మేధావులు అబినందిస్తున్నారు.