మయన్మార్‌లో సైన్యం దారుణానికి ఒడిగట్టింది. సొంత పౌరులపై వైమానిక దాడికి పాల్పడింది. బాంబుల వర్షం కురిపించడంతో వంద మందికి పైగా చనిపోయారు. వారిపై దాడి చేసింది తామేనని మయన్మార్ జుంట పాలకులు ధృవీకరించారు.నిన్న (మంగళవారం) ఉదయం 8 గంటలకు సగైగ్ ప్రాంతంలోని పజిగ్యి గ్రామంలో సైనిక వ్యతిరేక కార్యాలయ ప్రారంభోత్సవంలో సుమారు 150 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ వాయుసేనకు చెందిన విమానం వారిపై బాంబులు వేసింది. ఈ ఘటనలో 100 మంది వరకు మృతి చెందారని మిలిటరీ ప్రభుత్వ ప్రతినిధి వెల్లడించారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకే ఆ కార్యాలయంపై దాడి జరిగిందన్నారు.
నేషనల్ యూనిటీ గవర్నమెంటుకు (NUG) చెందిన పీపుల్స్ డిఫెన్స్ కార్యాలయ ప్రారంభం సందర్భంగా ఈ దాడి జరిగిందని చెప్పారు. తమదే అసలైన ప్రభుత్వమని ఎన్‌యూజీ చెప్పుకుంటున్నదని, అది సైన్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నదని తెలిపారు. మృతుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఫైటర్లు కూడా ఉన్నారని, వారిలో కొందరు సాధారణ పౌరుల్లా దుస్తులు ధరించాలని చెప్పారు. పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ ఆ ప్రాంతంలో మందుపాత్రలు పాతిపెట్టడంతోనే చాలా మంది మరణించారని ఆరోపించారు. స్థానిక ప్రజలను భయపెట్టి తమకు అనుకూలంగా పనిచేయాలని ఒత్తిడి చేస్తున్నారని వెల్లడించారు. బౌద్ధ గురువులతోపాటు టీచర్లు, సాధారణ పౌరులను చంపేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే శాంతి స్థాపన కోసం మిలిటరీ ప్రయత్నించిందని వ్యాఖ్యానించారు. కాగా, ఈ దాడిని ఎన్‌యూజీ తీవ్రంగా ఖండించింది. అమాయక ప్రజలకు వ్యతిరేకంగా తీవ్రవాద మిలిటరీ చేసిన దాడి అని అభివర్ణించింది.
Post Views: 44